cloudfront

Advertisement


Home > Politics - Political News

టీడీపీని నమ్ముకుని మునిగిన కాంగ్రెస్ నేతలు

టీడీపీని నమ్ముకుని మునిగిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని నమ్ముకుని కాంగ్రెస్ నిండా మునిగింది. అయితే లోక్ సభ పోలింగ్ నాటికి తెలంగాణ కాంగ్రెస్ కి జ్ఞానోదయమై టీడీపీతో పొత్తు లేకుండా పోటీచేసి మూడు స్థానాలను కైవసం చేసుకుంది. జ్ఞానోదయం కేవలం తెలంగాణ కాంగ్రెస్ నేతలకే అయింది కానీ ఏపీ నేతలు మాత్రం సైకిల్ ఎక్కి కిల్ అయ్యారు.

కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన ఈ సీనియర్లు హస్తాన్ని వదిలేసి మూకుమ్మడిగా సైకిల్ గుర్తుపై పోటీచేసి మునిగిపోయారు. అరకునుంచి కిశోర్ చంద్రదేవ్, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి ముగ్గురు దిగ్గజాలు ఈ ఎన్నికల్లో మట్టికరిచారు.

ఏపీలో టీడీపీ పొత్తుపై కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడానికి చివరిదాకా ఎదురుచూసిన ఈ ముగ్గురూ చంద్రబాబు చేసిన రాజకీయాలకు బలిపశువులయ్యారు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగానే టీడీపీ బరిలో దిగుతుంది, కావాలంటే తమ పార్టీలో చేరి పోటీచేయాలని వారికి సూచించారు బాబు. ఆ హామీతోనే ముగ్గురూ మూకుమ్మడిగా పార్టీ మారారు. కేంద్ర మంత్రులుగా పనిచేసిన టైమ్ లో సొంత నియోజకవర్గంలో ఉన్న ఇమేజ్, కాంగ్రెస్ నుంచి తమతో వచ్చేసిన మందీ మార్బలం, మరోవైపు టీడీపీ ఓటుబ్యాంకు.. అన్నీ కలసి విజయం నల్లేరుపై నడకేనని అంచనా వేశారు.

కానీ ఆ అంచనాలన్నీ తప్పాయి. అరకులో కిషోర్ చంద్రదేవ్ 2లక్షల 20వేల భారీ తేడాతో పరాజయం మూటగట్టుకున్నారు. కర్నూలులో 1,47వేల భారీ తేడాతో కోట్ల ఖంగుతిన్నారు. ఇక తిరుపతిలో టీడీపీనుంచి వైసీపీలో చేరిన మాజీమంత్రి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో పనబాక లక్ష్మి 2లక్షల28వేల పైచిలుకు తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. ఈ ముగ్గురు కాంగ్రెస్ సీనియర్లు.. ఈసారి టీడీపీకి బలయ్యారు.