cloudfront

Advertisement


Home > Politics - Political News

కర్ణాటకలో కాంగ్రెస్ ఖాతాలోకి మరోటి!

కర్ణాటకలో కాంగ్రెస్ ఖాతాలోకి మరోటి!

కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగాల్సి ఉండి, అనుకోకుండా ఎన్నిక ఆగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేస్తోంది. మొన్న ఆర్ఆర్ నగర్‌లో, ఇప్పుడు జయనగర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఓటర్ కార్డుల కుంభకోణంతో రాజరాజేశ్వరి నగర్‌లో ఎన్నిక ఆగింది. తర్వాత జరిగిన పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భారీ మెజారిటీతో ఆ సీటును సొంతం చేసుకుంది.

ఆర్ఆర్ నగర్లో కాంగ్రెస్, జేడీఎస్‌లు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇక జయనగర్లో కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి మరణించడంతో ఇక్కడ ఎన్నిక ఆగింది. ఆ తర్వాత నెల విరామంతో పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలాబలాలు మారిపోయి ఉండాల్సింది.

చివరకు ఏమైందో కానీ.. ఈ సీటును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక్కడ నుంచి గెలిచింది మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్య. రామలింగారెడ్డి బీటీఎం లేఔట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ సారి వారసురాలిని పక్కనే ఉన్న జయనగర్ నుంచి బరిలోకి దించారు. ఆమె కూడా గెలిచిందిప్పుడు. స్వల్ప మెజారిటీతోనే సౌమ్య రెడ్డి విజయం సాధించింది.

జేడీఎస్ మద్దతు పలికినప్పటికీ వచ్చిన మెజారిటీ తక్కువే కావడం గమనార్హం. ఒకవేళ జేడీఎస్ పోటీలో ఉండి ఉండే ఇక్కడ ఫలితం మరింత ఆసక్తిదాయకం అయ్యేది. అసలే బోటాబోటీ మెజారిటీతో ఉన్నకాంగ్రెస్ కూటమికి ఇది కొంత ఊరటే. కాంగ్రెస్ జేడీఎస్‌లు కలిసినా మినిమం మెజారిటీ కన్నా కాస్త ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్ఆర్ నగర్, జయనగర్ ఫలితాలు వీరికి ఊరటే. ఇక రామలింగారెడ్డికి కుమారస్వామి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఇప్పుడు జయనగర్ విజయంతో ఆయన మంత్రి పదవి విషయంలో అధిష్టానంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.