Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎస్ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యంపై మ‌రోసారి కోర్టుకు...

ఎస్ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యంపై మ‌రోసారి కోర్టుకు...

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ స్టార్ట్ చేసిన వేళా విశేషమేమో గానీ, ప‌దేప‌దే న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మొద‌ట‌గా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా నాలుగు విడ‌త‌ల్లో పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించారు.

ఇందులో భాగంగా ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేసేందుకు ప్రైవేట్‌గా త‌యారు చేసిన ఈ-వాచ్ యాప్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ యాప్‌పై అధికార పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అంతేకాదు, ఈ యాప్‌ను నిలిపివేయాలంటూ హైకోర్టును వైసీపీ ఆశ్ర‌యించింది. దీనిపై అధికార పార్టీ వాద‌న‌ను హైకోర్టు స‌మ‌ర్థించింది.

ఆ త‌ర్వాత ఇంటింటికి వెళ్లి రేష‌న్ బియ్యం పంపిణీపై ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వాహ‌నాల‌పై దివంగ‌త నేత వైఎస్సార్‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బొమ్మ‌లున్నాయ‌ని, అలాగే వైసీపీ జెండాను పోలిన రంగులు వాహ‌నంపై ఉన్నాయ‌ని నిమ్మ‌గ‌డ్డ ఇంటింటికి రేష‌న్ పంపిణీ కుద‌ర‌ద‌న్నారు. దీనిపై కూడా ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించి సానుకూల తీర్పు పొంద‌గ‌లిగింది.

అలాగే మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కొడాలి నానితో పాటు ఎమ్మెల్యే జోగి ర‌మేశ్‌ల‌పై గృహ నిర్బంధంతో పాటు మీడియాతో మాట్లాడొద్ద‌ని ఎస్ఈసీ ఆదేశాలిచ్చి సంచ‌ల‌నం సృష్టించారు. ఎస్ఈసీ ఆదేశాల‌పై వీరంతా వేర్వేరుగా హైకోర్టును ఆశ్ర‌యించి న్యాయం పొందారు. దీంతో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు వ‌రుస‌గా ప్ర‌తికూల తీర్పులు వ‌చ్చిన‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో మున్సిపాల్టీల్లో ఆగిన చోటు నుంచే తిరిగి ఎన్నిక‌ల ప్ర‌క్రియ స్టార్ట్ చేస్తున్న‌ట్టు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ప్ర‌క‌టించ‌డంపై జ‌న‌సేన‌తో పాటు మ‌రి కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించారు. అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డి, నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకుంద‌ని, తిరిగి రీనోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ఆదేశించాల‌ని 16 పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. అయితే ఎస్ఈసీ వాద‌న‌ను, నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూ ఆ పిటిష‌న్ల‌ను కొట్టి వేసింది.

ఈ నేప‌థ్యంలో ప‌లువురి నుంచి ఫిర్యాదులు, క‌లెక్ట‌ర్ల నుంచి నివేదిక‌ల ఆధారంగా తాజాగా ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తిరుప‌తి కార్పొరేష‌న్‌లో 6 వార్డులు,  పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు, ఎర్ర‌గుంట న‌గ‌ర పంచాయ‌తీలో మూడు  ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు ఎస్ఈసీ అవ‌కాశం క‌ల్పిస్తూ ... ఈ మేర‌కు ఉత్త‌ర్వులిచ్చారు.

ఈ నేప‌థ్యంలో  ఏకగ్రీవమైన‌ ఆ 14 చోట్ల రీనామినేషన్‌కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎస్ఈసీ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ వారంతా న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రేపు హైకోర్టులో పిటిష‌న్లు వేయ‌నున్నారు.  ఈ నేప‌థ్యంలో సంబంధిత కార్పొరేష‌న్‌, మున్సిపాల్టీల్లో ఎన్నిక‌ల‌పై నీలినీడ‌లు అలుముకుంటున్నాయి. ఎస్ఈసీ నిర్ణ‌యంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందోన‌నే ఉత్కంఠ మ‌రోసారి నెల‌కునే అవ‌కాశాలున్నాయి.  

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు హైడ్రామా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?