ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మళ్లీ కోర్టుకు చేరింది. ఇప్పటికే అనేక దశల్లో ఈ ఎన్నికలపై కోర్టులో విచారణ జరిగింది. ఆగడం, మళ్లీ మొదలుకావడంపై బోలెడంత వాదన జరిగింది. మొత్తంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ మీద జరిగిన విచారణ అదంతా అనుకుంటే.. ఎస్ఈసీ, ప్రభుత్వం పరస్పర విబేధాలతో కోర్టుకు ఎక్కాయి. చివరకు కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల విషయంలో కోర్టు తీర్పును అనుసరించి మున్సిపోల్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నట్టుగా లేదు.
పంచాయతీ ఎన్నికల్లో దక్కిన విజయం కూడా.. మున్సిపోల్స్ నిర్వహించడానికి ప్రభుత్వానికి ఉత్సాహాన్ని ఇస్తోందని స్పష్టం అవుతోంది. అయితే.. మున్సిపోల్స్ పై అభ్యంతరాలకు లోటు మాత్రం లేదు!
మున్సిపల్ ఎన్నికలను ఆగిన చోటు నుంచినే నిర్వహించబోతున్నట్టుగా ఎస్ఈసీ ప్రకటించడాన్ని ఇప్పటికే పలు పార్టీలు తప్పు పట్టాయి. ఈ నేపథ్యంలో అవి కోర్టును కూడా ఆశ్రయించినట్టుగా ఉన్నాయి. యథాతథంగా ఆగిన చోట నుంచినే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకూడదని, వాటి కోసం మళ్లీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై నేడు కోర్టు విచారించనుంది.
తాడిపత్రి, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి కొంతమంది వ్యక్తులు ఈ పిటిషన్లను దాఖలు చేశారట. వీరి వెనుక ఎవరున్నారనేది ఊహించడం పెద్ద కష్టం కాదు. అక్కడ బీజేపీ, తెలుగుదేశం నేతల అనుచరులు ఈ పిటిషన్లను వేసినట్టుగా సమాచారం.
అయితే.. స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపినప్పుడే ఎస్ఈసీ ఆగిన చోట నుంచినే మళ్లీ మొదలుపెట్టబోతుందని గతంలోనే ఎస్ఈసీ కోర్టుకు తెలిపారు. కరోనా సమయంలోనే ఆ ప్రకటన చేశారు. అప్పటికే పలు ఏకగ్రీవాలు, డిక్లరేషన్ పత్రాలను ఇవ్వడం జరిగింది. వాటిని కదిలించేది ఉండదని ఎస్ఈసీ గతంలోనే కోర్టుకు నివేదించారు. ఇటీవల వాటి విషయంలు పునఃసమీక్షకు ఎస్ఈసీ అవకాశం ఇవ్వడం మీదనే రచ్చ జరిగింది. దానిపై కొంతమంది కోర్టును ఆశ్రయించాయి.
ఒక్కసారి ఆర్వో డిక్లరేషన్ పత్రాలు ఇచ్చాకా.. వాటిని రద్దు చేసే అవకాశం కానీ, పునఃసమీక్ష చేసే అధికారం కానీ ఎస్ఈసీకి లేదనే వాదన కోర్టులో వినిపించారు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా.. చట్టంలో లేని విధంగా ముందుకు వెళ్లడం ఎలా? అనే ప్రశ్నను వేసినట్టుగా తెలుస్తోంది. ఇలా పునఃసమీక్ష వాదనతో వెళ్లిన ఎస్ఈసీకే అక్కడ సానుకూల ఫలితం రాలేదు. ఇలాంటి నేపథ్యంలో ఏడాది కిందట ఎస్ఈసీ కోర్టుకు చెప్పిన, కోర్టు సమ్మతించిన అంశంపై ఇప్పుడు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఇప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.
కోర్టుకు ఆల్రెడీ నివేదించిన అంశాన్నే ఒక రకంగా ఎస్ఈసీ ఫాలో అవుతోంది. డిక్లరేషన్ పత్రాలను రద్దు చేయడం అంటే మాటలు కాదని కూడా స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. మొత్తం నోటిఫికేషన్ ను రద్దు చేసి, మళ్లీ విడుదల చేయలనే వాదన.. పూర్తి అసంమజసంగా అనిపిస్తుంది. మరి దీనిపై పిటిషన్లను వేసిన వ్యక్తులకు ఎలాంటి స్పందన దక్కుతుందో!