Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇవేం పిచ్ లు.. ప‌రువు తీసుకుంటున్న బీసీసీఐ!

ఇవేం పిచ్ లు.. ప‌రువు తీసుకుంటున్న బీసీసీఐ!

ఏ దేశంలో మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ విష‌యంలో అయినా.. ఆ దేశ క్రికెట్ బోర్డు పిచ్ ల‌ను త‌న ఇష్ట ప్ర‌కారం త‌యారు చేసుకుంటుంది. సూటిగా చెప్పాలంటే త‌మ దేశ క్రికెట్ జ‌ట్టుకు అనుగుణంగా వాటిని త‌యారు చేసుకుంటుంది. త‌మ జ‌ట్టు బ‌లాబ‌లాలు ఏమిటో బోర్డుకు పూర్తిగా తెలుసు కాబ‌ట్టి.. ఆ మేర‌కు పిచ్ ల‌ను రూపొందించి ఆడిస్తుంది. ఇది ఒక దేశంలో జ‌రిగేది కాదు. ప్ర‌పంచంలో క్రికెట్ ఆడే ప్ర‌తి దేశంలోనూ ఇదే త‌ర‌హాలో పిచ్ ల రూప‌క‌ల్ప‌న జ‌రుగుతూ ఉంటుంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు.. పేస్ కు స్వ‌ర్గ‌ధామం. ప్ర‌త్యేకించి న్యూజిలాండ్ పిచ్ ల మీద అయితే ఆ దేశ ఫాస్ట్ బౌల‌ర్లు ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్ మెన్ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తారు.  ఆ పిచ్ ల మీద ఏ జ‌ట్టు అయినా ఒక్కో ఇన్నింగ్స్ లో వంద ప‌రుగులు చేయ‌డం కూడా గ‌గ‌నం ఒక్కోసారి. 2002-03 స‌మ‌యంలో న్యూజిలాండ్ లో రెండు టెస్టులు ఆడ‌టానికి వెళ్లిన గంగులీ సేన అక్కడి పిచ్ ల దెబ్బ‌కు చాలా ఇబ్బంది ప‌డింది.

న్యూజిలాండ్ సీమ్ అటాక్ లో షేన్ బాండ్ వంటి బౌల‌ర్ ఉన్న ఆ స‌మ‌యంలో.. రెండు టెస్టుల్లో కూడా టీమిండియా త‌క్కువ త‌క్కువ ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. అలాగే న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కూడా ఆ పిచ్ ల మీద పొడిచింది ఏమీ లేదు. మ‌నోళ్ల క‌న్నా కాస్త బెట‌ర్ గా ఆడి.. గెలిచారు. వాళ్ల‌కు అలాంటి పిచ్ ల మీద ఆడ‌టం అల‌వాటు కాబ‌ట్టి.. కాస్త బెట‌ర్ మెంట్ చూపించి గెలిచారు. మ‌నోళ్ల‌కు అవి పూర్తిగా కొత్త కాబ‌ట్టి.. చిత్త‌య్యారు.

స‌రిగ్గా అలాంటి సీరిస్ నే గుర్తు చేస్తూ ఉంది ఇండియా- ఇంగ్లండ్ టెస్టు సీరిస్. తొలి మ్యాచ్ కు ఆడిన పిచ్ సిస‌లైన ఇండియ‌న్ టెస్టు వికెట్. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ నెగ్గింది. టాస్ నెగ్గ‌డంతోనే ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ స‌గం విజ‌యం సాధించింది. రూట్ అద్భుత ద్విశ‌తకం సాధించాడు.

తొలి రెండు రోజులూ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండ‌టం, ఆ త‌ర్వాత నెమ్మ‌దినెమ్మ‌దిగా బౌలింగ్ కు అనుకూలంగా మార‌డం.. ఇండియ‌న్ పిచ్ ల ప్ర‌త్యేక‌త‌. కొన్ని సార్లు మ‌రీ ఫ్లాట్ వికెట్ లు ఉంటాయి. అప్పుడు మ్యాచ్ ల ఫ‌లితాలు రావు. బౌల‌ర్లు ఎంత చెమ‌టోడ్చినా వికెట్లు ప‌డ‌వు. సెంచ‌రీల మీద సెంచ‌రీలు న‌మోదు అవుతాయి. చివ‌ర‌కు మ్యాచ్ లు డ్రా అవుతాయి. గ‌త కొన్నేళ్లుగా ఇండియ‌న్ పిచ్ ల తీరు అలాంటిది.

అయితే రెండో టెస్టుకు చెన్నైలో ఉప‌యోగించిన వికెట్, మూడో టెస్టుకు అహ్మ‌దాబాద్ వికెట్ మాత్రం విస్తుగొలుపుతాయి. అహ్మ‌దాబాద్ లో అయితే మ‌రీ మ్యాచ్ రెండు రోజులు కూడా పూర్తి కాకుండానే ముగిసింది! ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 140 ఓవ‌ర్ల‌కు ముగియ‌డం అంటే.. అంత‌కు మించిన ప్ర‌హ‌స‌నం లేదు.

బౌల‌ర్లు బంతి వేస్తూ ఉంటే దుమ్ము రేగుతూ ఉంది! ఎక్క‌డైనా ఫుట్ ప్రింట్స్ పడ్డాయంటే.. ఇక అంతే సంగ‌తులు! ఆ ఫుట్ ప్రింట్స్ మీద బాల్ ప‌డితే అదెలా ట‌ర్న్ అవుతుందో కూడా బ్యాట్స్ మెన్ కు అంతు చిక్క‌ని ప‌రిస్థితి! ఈ మ్యాచ్ ల‌లో టీమిండియా గెలిచి ఉండొచ్చు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ క‌న్నా మ‌నోళ్లు ఎంతో కొంత బాగా ఆడి..విజ‌యం సాధించి ఉండొచ్చు.

ఏ దేశంలో అయినా పిచ్ లు ఆ దేశ జ‌ట్టుకు అనుకూలంగా ఉండొచ్చు. ఇవ‌న్నీ కాద‌న‌లేని స‌త్యాలే.  అయితే.. మ్యాచ్ ల‌కు ఆతిధ్యం ఇచ్చేది కేవ‌లం గెల‌వ‌డానికేనా? ఐదు రోజుల ఆట‌కు త‌గ్గ‌ట్టుగా త‌యారు చేయాల్సిన పిచ్ ల‌ను ఇలా రెండు రోజుల్లో  మ్యాచ్ లు ముగిసేలా త‌యారు చేయ‌డం మాత్రం ఏమంత గొప్ప అనిపించుకోదు!

మాజీలు ఏమంటున్నారు?

ఈ సంద‌ర్భంగా దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఈ విష‌యంలో ఏమ‌న్నారో కొంత ప‌రిశీలించాలి. విదేశీ ఆట‌గాళ్లు స‌హ‌జంగానే పెద‌వి విరిచారు. చెన్నై రెండో టెస్టు త‌ర్వాత ప‌లువురు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాళ్లు స్పందిస్తూ.. అది అస‌లు టెస్టుకు త‌గిన పిచ్ కానే కాదు అని అన్నారు. బంతిని ఎదుర్కొన‌డానికి బ్రిటీష్ బ్యాట్స్ మెన్ అప‌సోపాలు ప‌డ‌టంపై వారు అలా స్పందించారు. అయితే.. అప్పుడు భార‌త మాజీలు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.

మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ భార‌త ప్లేయ‌ర్లు ప‌చ్చిక ఉన్న పిచ్ ల మీద ఆడాల్సి ఉంటుంద‌ని, అప్పుడు ఈ విష‌యాలు గుర్తుకు రావా? అని గ‌వాస్క‌ర్ ప్ర‌శ్నించారు. ఇంగ్లండ్ పిచ్ ల మీద అయితే.. ఆవులు, గేదెలు మేయ‌డానికి త‌గినంత గ‌డ్డి ఉంటుందంటూ.. గ‌వాస్క‌ర్ అన్నారు.

ఆ పిచ్ లను ఆయా దేశాల బోర్డులు రూపొందిస్తాయ‌ని ప్ర‌త్యర్థి జ‌ట్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ఆయా స్వ‌దేశీ ప్లేయ‌ర్ల‌కు అనుకూలంగా మాత్ర‌మే పిచ్ ల‌ను రూపొందిస్తార‌ని గ‌వాస్క‌ర్ గుర్తు చేశారు. అలాంట‌ప్పుడు ఇలాంటి పిచ్ ల మీద ఆడ‌టానికి అభ్యంత‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించారు!

గ‌వాస్క‌ర్ లాజిక్ లో నిజం ఉంది. అందుకు పైన పేర్కొన్న న్యూజిలాండ్ పిచ్ లు కూడా ఉదాహ‌ర‌ణ‌. ఇటీవ‌లి బోర్డ‌ర్ -గ‌వాస్క‌ర్ ట్రోఫీ సంద‌ర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పెయిన్ కూడా అదే చెప్పాడు. భార‌త ఆటగాళ్లు గాబా పిచ్ మీద ఆడుతుంటే చూడాల‌ని త‌న‌కు ఉంద‌న్నాడు. ఆ బౌన్సీ పిచ్ మీద వీళ్లు పిల్లిమొగ్గ‌లు వేయాల్సిందే అన్న‌ట్టుగా పెయిన్ స్లెడ్జ్ చేశాడు.

అలా పిచ్ లు త‌మ‌కు అనుకూలంగా ఉంటాయంటూ విదేశీ ఆట‌గాళ్లు బ‌హిరంగంగా చెప్పుకున్న సంద‌ర్భాలు బోలెడు ఉంటాయి. అయితే తీరా అదే గాబాలో ఆస్ట్రేలియా గ‌ర్వభంగం జ‌రిగింది. ఆస్ట్రేలియా చిత్తు అయ్యింది, టీమిండియా విజ‌యం సాధించింది. అప్పుడు ఆస్ట్రేలియ‌న్ మాజీలు త‌మ దేశ క్రికెట్ బోర్డు మీద దుమ్మెత్తి పోశారు. అందులోనూ వారు ముఖ్యంగా చేసిన విమ‌ర్శ ఏమిటంటే.. బౌన్సీ పిచ్ ల‌ను రూపొందిచంలేదు అని!

ఇండియన్ జ‌ట్టు త‌మ దేశానికి వ‌చ్చిన‌ప్పుడు బౌన్సీ పిచ్ ల మీద వారిని ఆడించాల‌ని, తీవ్రంగా బౌన్స్ అయ్యే పిచ్ మీదే తొలి టెస్టు జ‌ర‌గాల్సింద‌ని, భార‌త బ్యాట్స్ మెన్ ఆడ‌టానికి కూడా ఇబ్బంది ప‌డే పిచ్ ల మీద మ్యాచ్ లు నిర్వ‌హించాల్సిందని.. ఆస్ట్రేలియ‌న్ మాజీలు వ్యాఖ్యానించారు.

అస‌లు సీఏ అలా ఎందుకు చేయ‌లేదో .. అంటూ వారు విమ‌ర్శించారు. భార‌త జ‌ట్టు అస్స‌లు ఆడ‌లేని ప‌రిస్థితులు ఉండే మైదానాలు, పిచ్ ల మీద మ్యాచ్ లు నిర్వ‌హించాల్సింది పోయి.. వారికి కాస్త ఊర‌ట‌ను ఇచ్చేలా ఆస్ట్రేలియ‌న్ బోర్డు మ్యాచ్ ల‌ను నిర్వ‌హించింది అంటూ ఆస్ట్రేలియ‌న్ మాజీలు బాహాటంగా వ్యాఖ్యానించారు. ఇలా త‌మ క్రీడాస్ఫూర్తి లేమిని వారు చాటుకున్నారు.

త‌మ జ‌ట్టు ఓడిపోయే స‌రికి ఏం చెప్పాలో కూడా అర్థం కాక‌.. తీవ్ర‌మైన‌ బౌన్సీ, పేస్ పిచ్ లు ఎందుకు  రెడీ చేయ‌లేదు అంటూ ఆస్ట్రేలియ‌న్ మాజీ క్రికెట‌ర్లు ప్ర‌శ్నించ‌డం వారి దివాళాకోరు త‌నాన్ని చాటింది.

ఆస్ట్రేలియ‌న్ మాజీలు మాట్లాడిన ఆ మాట‌లు స‌రి కాదు. త‌మ జ‌ట్టు ఓడిపోయే స‌రికి పిచ్ లు ప‌నికిమాలిన‌వి అంటూ మాట్లాడ‌టం విడ్డూరం. అలాగే.. చెన్నై తొలి టెస్టులో ఓడిన త‌ర్వాత బీసీసీసీఐ వ‌ర‌స పెట్టి స్పిన్ ట్రాక్ ల‌ను రెడీ చేయ‌డం కూడా గొప్ప క్రీడా స్ఫూర్తి కాదు.

గ‌తంలో టీమిండియా హేమాహేమీ టెస్టు జ‌ట్ల‌నే ఇండియాలో ఓడించింది. వ‌ర‌స‌గా 16 టెస్టుల్లో విజ‌యం సాధించి వ‌చ్చిన స్టీవ్ వా సేన‌ను ఇండియాలో చిత్తు చేసింది గంగూలీ సేన‌. అలాగే స్టీవ్ స్మిత్ సార‌ధ్యంలోని ఆస్ట్రేలియా జ‌ట్టును కూడా టెస్టుల్లో చిత్తు చేసింది టీమిండియా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్.. ఇలా ఎంత బ‌ల‌మైన జ‌ట్టు వ‌చ్చినా టెస్టుల్లో ఇండియాలో సీరిస్ గెల‌వ‌డం వాటి త‌రం కాలేదు. అలాంటి మ‌ర‌పురాని విజ‌యాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు కూడా కేవ‌లం పిచ్ ల మీద నెపం వేసి త‌ప్పించుకోలేదు!

ఎందుకంటే. .ఆ మ్యాచ్ లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగాయి. ఐదు రోజుల పాటు పూర్తిగా జ‌రిగాయి. ఐదు రోజుల టెస్టులు చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగితే అంత‌కు మించిన మ‌జా ఉండ‌దు. ఇప్పుడు ఈ ఇసుక దిబ్బ‌ల మీద జ‌రుగుతున్న మ్యాచ్ లు ఆ మ‌జాను కూడా మిస్ చేస్తున్నాయ‌ని వేరే చెప్ప‌క‌త‌ప్ప‌దు. భార‌త బ్యాట్స్ మెన్ కూడా ఆ పిచ్ ల మీద ఆడ‌లేక‌పోతున్నారంటే.. ఇక మ‌జా ఏముంది?

తొలి మూడు రోజులూ.. వికెట్లు తీయాలంటే బౌల‌ర్లకు ప్ర‌తిభ చూపాలి, చివ‌రి రెండు రోజులూ ఆడి నిల‌వాలంటే బ్యాట్స్ మెన్ త‌మ స‌త్తా ఏమిటో చూపాలి.. అది క‌దా టెస్టు మ్యాచ్ అంటే! ఇండియాలో గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో చూసిన టెస్టులు అన్నీ అలాంటివే. అవే అనిత‌ర సాధ్య‌మైన రికార్డుల‌ను నెల‌కొల్పాయి. అలాంటి పిచ్ ల మీద ఎలా బౌలింగ్ చేయాలో, ఎలా బ్యాటింగ్ చేయాలో తెలిసిన భార‌త ఆట‌గాళ్లు ఎన్నో మ‌ర‌పురాని అనుభూతుల‌ను పంచారు. అవే పిచ్ ల మీద మ‌నోళ్లు రెండో ఇన్నింగ్స్ లో డ‌బుల్ సెంచ‌రీలూ చేశారు, తొలి ఇన్నింగ్స్ లో హ్యాట్రిక్ లూ సాధించారు! అది క‌దా.. క్రికెట్ అంటే.

అహ్మ‌దాబాద్ టెస్టు త‌ర్వాత భార‌త మాజీ  క్రికెట్ యువ‌రాజ్ సింగ్ స్పందించిన తీరు కూడా ఇక్క‌డ ప్ర‌స్తావించాలి. ఇలాంటి పిచ్ ల మీద కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్ వంటి క్వాలిటీ స్పిన్న‌ర్లు బంతులు సంధించి ఉంటే.. ఇంకా ఎన్నో అనిత‌ర సాధ్య‌మైన రికార్డులు సాధించే వార‌ని  యువ‌రాజ్ ట్వీట్ చేశాడు. వాళ్లు ఎనిమిది వంద‌ల‌కు మించి వికెట్లు సాధించే వాళ్ల‌ని కూడా యువీ అన్నాడు. అది క‌చ్చితంగా నిజం. కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్  కాలం నాడు ఇలాంటి వికెట్లు లేవు. వాళ్లు వికెట్ల కోసం క‌ష్ట‌ప‌డ్డారు. కేవ‌లం పిచ్ స‌హ‌కారంతో మాత్ర‌మే వికెట్లు సాధించ‌లేదు. అహ్మ‌దాబాద్ టెస్టులో అయితే.. బాల్ వేస్తే దానికి వికెట్ ప‌డాల్సిందే అన్న‌ట్టుగా ఉండింది ప‌రిస్థితి.

ఏ ఆస్ట్రేలియా త‌మ‌కు అనుకూలమైన వికెట్ త‌యారు చేసుకుంద‌ని, ఇంగ్లండ్ లో పిచ్ మీద ప‌శువులు మేసేంత గ‌డ్డి ఉంటుంద‌ని, న్యూజిలాండ్ పిచ్  ల మీద వంద ప‌రుగులు చేయ‌డం కూడా క‌ష్ట‌మ‌ని.. చెప్పి, ఇండియాలో ఇలా రెండు రోజుల టెస్టు మ్యాచ్ ల‌కు త‌గ్గ‌ట్టైన వికెట్ల‌ను ఏర్పాటు చేయ‌డం అభినందించ‌ద‌గిన చ‌ర్య కాదు. దీని వ‌ల్ల ఐదు రోజుల టెస్టు మ్యాచ్ మ‌జా మిస్ అవుతుంది. క్రీడా స్ఫూర్తి దెబ్బ‌తింటుంది.

బ‌హుశా ఐసీసీ టెస్టు చాంఫియ‌న్ షిప్ టేబుల్ లో టాప్ పొజిష‌న్ కోసం ఎలాగైనా ఈ టెస్టు సీరిస్ లో టీమిండియా గెల‌వాల్సిందే అనే లెక్క‌ల‌తో బీసీసీఐ ఇలాంటి పిచ్ ల‌ను సిద్ధం చేసి ఉన్నా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. ఇక మిగిలి ఉన్న ఏకైక టెస్టుకు అయినా.. కాస్త పోటాపోటీగా జ‌రిగేలా ఉండే పిచ్ ను రెడీ చేస్తే బాగుంటుంది. లేక‌పోతే.. బీసీసీఐ స్వ‌దేశం నుంచి కూడా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన‌క త‌ప్ప‌దు. గెల‌వ‌డం అంటే ఇలా కాదు, స్వ‌దేశంలో కూడా గెల‌వ‌డానికి ఇలాంటి ఎత్తులు వేస్తే.. ఇక మ‌నోళ్లు కూడా ఆడ‌టం ఎలాగో కూడా మ‌రిచిపోతారు!

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?