cloudfront

Advertisement


Home > Politics - Political News

డబ్బు టు ది పవర్‌ ఆఫ్‌ డబ్బు!

డబ్బు టు ది పవర్‌ ఆఫ్‌ డబ్బు!
-ఇదే రాజకీయ సిద్ధాంతం
-డబ్బులుంటేనే రాజకీయం!
-రాజకీయంలో డబ్బే డబ్బు!
-ఎన్నికల నేపథ్యంలో రూ.వేలకోట్ల పందేరం!
-ఒక్కో అసెంబ్లీ సీట్లో ఖర్చు రూ.వందకోట్లు పైమాటే!
-డబ్బు పెట్టగానే గెలిచేస్తారా అనేది ప్రశ్నార్థకమే!
 
రాజకీయంలో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు... ఇది జనాలకు బాగా తెలిసిన థియరీ. నేతలకు బాగా తెలిసిన థియరీ. అయితే రాజకీయంలో ఉండాలంటే... డబ్బులు ఖర్చు పెట్టాలి! ఇదీ ప్రస్తుతం అమల్లో ఉన్న అనధికార థియరీ. రాజకీయంలో నిలదొక్కుకోవడం ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారం దక్కాకా సంపాదించుకోవడం అనే ఊరించే వ్యవహారం ఉన్నప్పటికి.. ఇప్పుడు రాజకీయాలు మరీ కాస్ట్లీ కావడంతో రాజకీయంలో ఉన్నవాళ్లే అవాక్కువుతున్నారు. ఒకవైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో నేతలకు దినదినగండంగా గడుస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనాలంటే ఒక్కోరు పదుల కోట్ల రూపాయల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంత ఖర్చుచేస్తే.. గెలుస్తామో, ఓడతామో.. అనే విషయం వారికే అర్థం కావడంలేదు.
 
పార్టీల తేడాలు లేవు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. అయితే అధికార పార్టీ వాళ్లు బాగా సంపాదించుకున్నారు. వంద కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా గత ఐదేళ్లలో సంపాదించుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లకు ఇప్పుడు ఖర్చులకు ఇబ్బందిలేదు. ఇక ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు, కొత్తగా రాజకీయం మొదలుపెట్టిన వాళ్లు మాత్రం రాజకీయం మరీ ఈ రేంజ్‌లో ఖర్చులున్నాయా.. అని వాపోతూ ఉన్నారు. ఈ రేంజ్‌లో ఖర్చులు పెడుతున్న వాళ్ల గుండెలు దడదడలాడుతున్నాయి. ఈ విషయాన్ని వారు బయటకు చెప్పుకుని వాపోతూ ఉన్నారు!
 
ఒక్కో నియోజకవర్గంలో ఖర్చు ఎంత?
ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కో నియోజకవర్గంలో నేతలు పెడుతున్న ఖర్చు అనేక రెట్లు పెరుగుతూ పోతోంది. క్రితంసారి ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో నిలబడటానికి పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగిందని స్పష్టం అవుతోంది. గత ఎన్నికల సమయంలో ఒక్కో అభ్యర్థి కనిష్టంగా ఐదుకోట్ల రూపాయలతో మొదలుపెట్టి.. గరిష్టంగా పాతిక, ముప్పైకోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాళ్లున్నారు. అయితే ఈసారి కనిష్టం పదిహేను కోట్ల రూపాయలు కానున్నదని.. గరిష్టానికి ఒక హద్దంటూ ఉండదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో రాయలసీమలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, కొన్ని రిజర్వర్డ్‌ నియోజకవర్గాల్లో కనిష్ట స్థాయి ఖర్చులు నమోదయ్యాయి. వాటిల్లో మూడుకోట్ల రూపాయలు, ఐదుకోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన వాళ్లవే రాష్ట్రంలోని లీస్ట్‌ ఫిగర్స్‌. అయితే గత ఎన్నికల్లోనే కొంతమంది పదుల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన దాఖలాలున్నాయి. కోస్తా ప్రాంతంలో.. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ముప్పైకోట్ల రూపాయల పై మొత్తాలు ఖర్చుపెట్టిన అభ్యర్థులున్నారు. అవి గరిష్టస్థాయి మొత్తాలు.
 
ఇక ఈసారి మాత్రం ఎక్కడా రాజీలేదు అని, రెండు మూడు కోట్ల రూపాయలతో ఎన్నికలను ఎదుర్కొనే రోజులు పోయాయని రాజకీయంలో ఉన్నవాళ్లే చెబుతున్నారు. ఈసారి బలమైన అభ్యర్థులిద్దరూ తలపడే చోట్ల మినిమం ఖర్చు ముప్పై కోట్ల రూపాయలకు తగ్గదు అనేది ఒక అంచనా. ఇది నలభై, యాభై కోట్ల రూపాయలకు చేరినా ఏమాత్రం ఆశ్చర్యం అక్కర్లేదు. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... అంత ఖర్చు పెట్టేది కేవలం బరిలో నిలవడానికి మాత్రమే! గెలుపు కోసం ఎంత ఖర్చు పెట్టాలంటే దానికి ఎలాంటి అంచనాలూ లేవు, వాళ్ల పార్టీకి ఊపు, వాళ్లకు లక్‌ ఉంటే గెలుస్తారు. లేకపోతే పాతిక కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా, ముప్పై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా చిత్తు కావాల్సిందే!
 
పార్టీల వేట.. ధనికుల కోసమే!
డబ్బు ఖర్చు పెట్టగలడా లేదా.. అనేదికాదు ఎంత ఖర్చు పెడతాడు? అనేది ఇప్పుడు పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ పార్టీల పేర్లు చేయనక్కర్లేదు. అన్ని పార్టీల్లోనూ మెజారిటీ సీట్ల విషయంలో ఇవే లెక్కలే ఉన్నాయి. ఎక్కువ కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగలిగే వారికే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కావాల్సింది ప్రజల్లో ఉన్న పేరు, ప్రజలకు సేవచేసిన నేపథ్యం కాదని.. పదుల కోట్ల రూపాయల వెయిటే అని పార్టీలు తేల్చి చెబుతున్నాయి. ఈ విషయంలో రాజీ పడటంలేదు. ఎక్కువ ఖర్చు చేయగలిగే వారికే పార్టీలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. వాళ్ల ట్రాక్‌ రికార్డులను పట్టించుకోవడం లేదు. రాజకీయాలు కేవలం డబ్బు వ్యవహారాలుగా మారిపోయాయి.. అనేమాటను జనాలు కూడా పట్టించకోవడం లేదు. జనాల్లో కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని ఖర్చుచేస్తారు, ఆ పార్టీలో ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలరు.. అనే అంశాల గురించి మాత్రమే చర్చిస్తూ ఉన్నారు. బాగా ఖర్చుపెట్టే అభ్యర్థి పట్లే జనాలు కూడా క్రేజ్‌ను చూపిస్తూ ఉండటం విశేషం!
 
రంగంలోకి వ్యాపారవేత్తలు, కోట్లకు పడగలెత్తిన వాళ్లు!
ఒక పార్టీ గెలుస్తుందనో.. ఒక పార్టీ ఓడుతుందనో.. ఎన్నికల విషయంలో చాలామంది ఒక ఒపీనియన్‌కు వస్తూ ఉంటారు. ఆ పార్టీ తరఫున పోటీచేస్తే నెగ్గుతారా, ఈ పార్టీ తరఫున పోటీచేస్తే ఓడతారేమో.. అని విశ్లేషించుకొంటూ ఉన్నారు. అయితే రాజకీయాల్లోకి ఉత్సాహవంతంగా వస్తున్న వాళ్లు మాత్రం పార్టీల విషయంలో విశ్లేషణలు వేసుకోవడం లేదు. తమకు టికెట్‌ దక్కుతుందా, టికెట్‌ ఇస్తే తాము ఖర్చుపెట్టి గెలిచేయగలమనే వాళ్లు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు. కొత్త పార్టీలు వస్తుంటే.. కొత్త అభ్యర్థులు వస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. ఏదో రంగంలో సంపాదించిన డబ్బును.. ఈజీగా వచ్చిన డబ్బును.. రాజకీయం మీద ఇన్వెస్ట్‌ చేయడానికి వీళ్లు వెనుకాడటం లేదు.
 
ఇక ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్లకు తిరుగేలేదు! ఏపీలో ప్రస్తుత అధికార పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే సంపాదన కూడా వంద కోట్ల రూపాయలకు తక్కువలేదు అని సమాచారం. వంద కోట్ల రూపాయలు కేవలం ఒక చిన్న నంబర్‌ మాత్రమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా గత ఐదేళ్లలో అనేక ఆదాయ మార్గాలను కనుగొన్నారు. ఇసుక, నీళ్ల నుంచి కూడా కోట్ల రూపాయలు కమీషన్లు దక్కాయి. ఇక భూములు, ఆక్రమణలు, అక్రమ సంపాదనలు, కమీషన్లు.. ఇవన్నీ వేరే. సొంత వ్యాపారాలు, కాంట్రాక్టులు మరోలెక్క! ఈ రకంగా అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు.. ఒక్కోరు వందకోట్ల రూపాయల పైనే సంపాదించుకున్నారు అనేది ఒక అంచనా. గత ఎన్నికల ముందు ఏదో అనామకులుగా అనిపించిన వాళ్లు, ఆర్థికశక్తి లేనివాళ్లు.. ఇప్పుడు తిరుగులేని స్థాయికి చేరిన దాఖలాలు బోలెడున్నాయి. ఒకప్పటికే అంగ, అర్థబలం ఉన్నవారి శక్తి ఇప్పుడు అనేక రెట్లు పెరిగింది.
 
వంద కోట్ల రూపాయలకు తగ్గని రీతిలో సంపాదించుకున్న వాళ్లు.. అందులో సగం మొత్తాలను ఖర్చుపెట్టి.. ఇంకో టర్మ్‌ నెగ్గడానికి యాభై కోట్ల రూపాయలను చల్లాడటానికి ఏమాత్రం వెనుకంజ వేసేలాలేరని క్షేత్రస్థాయి పరిశీలకులు అంటున్నారు. యాభైకోట్లు ఇప్పుడు ఖర్చుపెట్టినా.. మళ్లీ గెలిస్తే.. అంతకు రెట్టింపు సంపాదించుకోవచ్చు అనేది నేతల లెక్క! ఈ పందేరంలో ప్రతిపక్ష పార్టీ వాళ్లు మాత్రం వెలవెలబోతున్నారు. అధికార పార్టీతో ఆర్థికంగా ఢీకొట్టలేక వీళ్లు బెంబేలెత్తుతున్నారు.
 
అప్పుడే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు!
ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాలేదు.. ఎన్నికల షెడ్యూల్‌ కూడా రాలేదు. ఇప్పటికే అధికార పార్టీ తరఫువాళ్లు పెడుతున్న ఖర్చులు చూస్తే ఎవరైనా షాక్‌ కావడం ఖాయం. చాలా నియోజకవర్గాల్లో రాజకీయ నేతలు ముందుగా డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరీకి చీరలు పెడుతున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే ఇలా కొనేసుకోవాలని చూస్తున్నారు. ఏదో  వంద రూపాయల చీరలు ఇస్తే మహిళల నుంచి వచ్చే అనుకూలత కన్నా వ్యతిరేకత ఎక్కువ. కాబట్టి.. ఒక్కో చీరకు మూడు వందల నుంచి ఐదారు వందల రూపాయల వరకూ ఖర్చుపెట్టారు. ఒక్కో నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల సంఖ్య ఇరవై వేలకు పైనే ఉంటుంది! అంతమందికి సగటున ఐదు వందల రూపాయలు అంటే కోటి రూపాయలు అయినట్టే.
 
జస్ట్‌ అదొక చిన్న ప్రోగ్రామ్‌ మాత్రమే. ఇక సంక్రాంతి సందర్భంగా ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ప్రజలందరికీ నేతలు పండగ స్పెషల్స్‌ ఇచ్చారు. ప్రతి ఇంటికీ.. పట్టుబట్టలు, స్వీట్‌ ప్యాకెట్లు! ఒక నియోజకవర్గంలో అధికార పార్టీ తరఫున పోటీ చేయబోయే వ్యక్తి ఈ పండగ స్పెషల్‌ కోసం.. పెట్టుకున్న ఖర్చు అక్షరాలా ఇరవై కోట్ల రూపాయలు అంటే ఆశ్చర్యం కలగకమానదు. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గంలో ఈ ఇల్లు లేదు అనకుండా.. ప్రతి ఇంటికి చీరలు, పట్టు పంచెలు, స్వీట్లు ఇచ్చారు. పార్టీ తేడా లేకుండా.. ప్రతి ఇంటికీ వద్దన్నా వీటిని పంచిపెట్టారు. ఇరవై కోట్లు ఖర్చుచేసి ఇలా ప్రజలను పండగ సందర్భంగా సంతోష పెట్టాడు అధికార పార్టీ తరఫున టికెట్‌ దక్కించుకుపోయే వ్యక్తి.
 
అదే నియోజవవర్గంలో ప్రతిపక్ష పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నాడు. దీంతో ఈయన కూడా తప్పనిసరిగా అదే ప్రోగ్రామ్‌ చేయాల్సి వచ్చింది. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఇంటింటికీ.. పట్టుపంచెలు, చీరలు.. స్వీట్లు.. సేమ్‌ మెనూను అందించాల్సి వచ్చింది. అసలే డబ్బుల్లేని ఈ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈ ప్రోగ్రామ్‌ దెబ్బకు ఇరవై కోట్ల రూపాయల వరకూ అప్పులపాలు అయ్యాడట! ఇలాంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలకు ముందు ఇలా పదుల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం అంటే.. ఇప్పుడే ఇరవై కోట్ల రూపాయల మొత్తం అంటే.. ఎన్నికల నాటికి ఈ ఖర్చు వంద కోట్ల రూపాయలకు చేరదా? అంతకు మించవచ్చునేమో!
 
ప్రజల్లో కూడా మార్పు వచ్చిందా!
గత ఎన్నికల్లో దాదాపు అరవై నుంచి డెబ్బైశాతం మంది ఓటర్లకు డబ్బులు అందాయని అంచనా. అది కూడా వంద రూపాయలు.. నూటా యాభై రూపాయలతో మొదలుకుని.. పదిహేను వందల రూపాయలు, ఓటుకు రెండువేల రూపాయలు పంచారు. చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి కొనసాగింది. అయితే.. ఈసారి నోట్లు అందుకునే ప్రజల శాతం వందకు వంద చేరవచ్చు! ఓటేస్తారో లేదో తెలీదు.. పార్టీలకు అతీతంగా ఎన్నికల పండగకు అభ్యర్థులు వద్దన్నా డబ్బు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది.
 
ఒకప్పుడు ఓటుకు నోటు తీసుకోవడం ప్రజలు అవమానంగా భావించేవారు. తాము అలాంటి వాళ్లం కాదని చెప్పేవాళ్లు. పల్లెల్లో కమ్యూనిటీని బట్టి నోట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనే లెక్కలుండేవి. అయితే ఇప్పుడు అన్నీ పోయాయి. ప్రతి ఇంటికీ ఓటుకు నోటు చేరే పరిస్థితి వచ్చేసింది. కోస్తాలో ఇది అమల్లోకి వచ్చేసింది. అయితే రాయలసీమలో మాత్రం ఓటుకు నోటు తీసుకోవడం అవమానంగా భావించేవాళ్లు చాలామందే కనిపిస్తున్నారు. నంద్యాల్లో ఈ పరిస్థితి కనిపించింది. అయితే తీసుకునే వాళ్లకు అక్కడ ఐదువేల రూపాయలు కూడా దక్కింది!
 
డబ్బుతోనే గెలిచేస్తారా?!
ఇదే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. దీనికి గత ఉదాహరణలు ప్రస్తావించుకోవాల్సిందే కానీ.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. ఉదాహరణకు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గాన్నే ఉదాహరణగా పరిగణించాలి. అక్కడ ఒక అభ్యర్థి తరఫున అత్యంత భారీ మొత్తాన్ని ఖర్చుపెట్టారు. సదరు అభ్యర్థి సొంత డబ్బు తీయాల్సిన అవసరం లేకపోయినా.. వారి కులపోళ్లు ఎక్కడెక్కడ నుంచినో వెళ్లారు. కోట్ల రూపాయలు తీసుకుని వెళ్లారు. ఓటుకు ఐదువేల రూపాయలు లెక్కగట్టారు. వేల ఓట్లను కొన్నారు. తమ కుల దీపాన్ని గెలిపించుకోవాలని చూశారు. చివరకు ఏమైందో అందరికీ తెలిసిందే!
 
కాబట్టి కేవలం డబ్బుతోనే గెలవడం, ఓడటం అనేది ఉండదు. కానీ టఫ్‌ కాంపిటీషన్‌ ఉన్న సమయంలో.. మెజారిటీలు నాలుగైదు వేలను మించని సమయంలో.. డబ్బుది కీలక పాత్ర అవుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కొన్నివేల ఓట్లను లక్ష్యంగా చేసుకుని డబ్బులు పంచుతారు వచ్చే ఎన్నికల్లో కూడా. ఇరుపార్టీల తరఫు నుంచి, మూడోపార్టీ తరఫు నుంచి కూడా ప్రజలకు డబ్బులు అందడం ఖాయం. ఒక్కోరిది ఒక్కోస్థాయి. అధికార పార్టీ రెండు నుంచి ఐదువేల రూపాయలు ఇవ్వొచ్చు. మిగతా పార్టీలు వెయ్యి నుంచి పదిహేను వందల వరకూ ఇవ్వాల్సి రావొచ్చు! డబ్బు తీసుకునేవాళ్లు.. ఇరుపార్టీల నుంచి, ఇచ్చే అన్ని పార్టీల నుంచి తీసుకుంటారు!
 
ముగ్గురుతోనూ తీసుకున్నవాడికి సమన్యాయం జరిగినట్టే. అప్పుడు సదరు ఓటర్‌ లాజికల్‌గా ఆలోచించవచ్చు. తనకు ఇష్టం అయిన వాళ్లకు ఓటు వేయడం అనే బ్యాలెన్స్డ్‌ స్టేజికి వెళ్లిపోవచ్చు. లేదా ముగ్గురిలో ఎవరు ఎక్కువ ఇచ్చారో వారివైపే మొగ్గు చూపవచ్చు. అయితే కొనుగోలు ఓట్లే పూర్తిగా ఫలితాలను నిర్దేశించలేవు. కొంతవరకూ వీటి ప్రభావం ఉండొచ్చు కానీ.. ఇవే పరమావధి కాదు. డబ్బు తీసుకున్నా.. తమకు నచ్చిన వారికే ఓటువేసే 'నిజాయితీ పరులు'... ఓటుకు డబ్బును తీసుకోవడాన్ని ఛీకొట్టి తీర్పుని ఇచ్చేవాళ్లు.. వీళ్లే ఫలితాలను నిర్దేశిస్తారు... ప్రభుత్వ పనీతీరుపైనే ప్రజల ఓట్లు తీర్పునిస్తాయని ఆశిద్దాం.
 
ప్రాంతాల వారీగా వేర్వేరు ఖర్చులు!
రాజకీయాల్లో కూడా ఖర్చులు ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఉన్నాయి. కష్ణా, గుంటూరు జిల్లాలు నేతలకు ఖర్చు విషయంలో టాప్‌ పొజిషన్లో ఉన్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా వాటితో ఢీకొడుతూ ఉన్నాయి. ఇక్కడ రేపటి ఎన్నికల్లో గట్టిగా ఢీకొట్టే ప్రత్యర్థులు ఒక్కోరు వందకోట్ల రూపాయలను రెడీచేసి పెట్టుకోవాల్సిందే అని అంటున్నారు పరిశీలకులు. ఇక గోదావరి జిల్లాల్లో కూడా ఆ స్థాయిలో కాకపోయినా.. ఒక పదీ ఇరవైశాతం తక్కువ ఖర్చుకు రెడీగా ఉండాల్సిందేనట! ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మరికాస్త తక్కువ. రాయలసీమ జిల్లాల్లో కూడా తేడాలున్నాయి. చిత్తూరు జిల్లాలపై కోస్తా జిల్లాల ప్రభావం పడుతోంది. వందకోట్ల రూపాయల ఖర్చు అయ్యే నియోజకవర్గాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇక కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా కొందరు పదుల కోట్లతో రెడీగా ఉన్నారు. అధికార పార్టీ తరఫు నుంచినే ఇలాంటి నంబర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడి నేతలు మరీ చిల్లాడటం లేదు. డబ్బులు సంపాదించుకున్నా.. ఎన్నికలు దగ్గర పడ్డాకే ఖర్చు పెడతాం అన్నట్టుగా ఉన్నారు ఈ ప్రాంత అధికార పార్టీ నేతలు.
 
బయటకు వస్తే రెండు మూడు లక్షల రూపాయలు!
గత ఐదారు నెలలుగా.. ఏరోజు బయటకు వచ్చినా.. నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లినా రోజుకు రెండు మూడు లక్షల రూపాయల ఖర్చు వస్తోందని చెబుతున్నాడు ఒక పార్టీ నేత. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన ఆయన ఇప్పుడు మరో ఎమ్మెల్యే సీటుకు ఇన్‌చార్జిగా కొనసాగుతూ ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీ తరఫున. నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి బాగానే తిరుగుతున్నాడు, నాలుగేళ్లుగా పర్యటనలు సాగిస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి ఖర్చులే. అయితే ఐదారు నెలలుగా బాగా పెరిగిందని.. రోజుకు రెండు మూడు లక్షలు పెట్టుకోవాల్సి వస్తోందని, నెలలో పదిహేను రోజులు అయినా ఇలాంటి పరిస్థితి ఉందని ఆయన చెబుతున్నాడు. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టుపెట్టి రాజకీయం చేయాల్సి వస్తోందని చెబుతున్నాడాయన!
-ఎల్‌.విజయలక్ష్మి
 
ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!
భారతదేశంలోనే ఎన్నికల కోసం ఎక్కువ సొమ్మును ఖర్చుపెట్టే రాష్ట్రాల్లో ఏపీ నంబర్‌ వన్‌ పొజిషన్లో ఉంది. ఇలా గెలవడానికి డబ్బు ఖర్చు పెట్టడాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని చూసే నేర్చుకున్నాయి. ఏపీ నుంచి ఈ జాడ్యం తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా పాకింది. అలాగే పార్లమెంట్‌లో ఉన్న అత్యంత ధనవంతులు కూడా ఏపీ వాళ్లే. వారిలో తెలుగుదేశం పార్టీ వాళ్లే ముందున్నారు. ఏపీలో రాజకీయం పూర్తిగా వ్యాపారమయం. గతం నుంచి ఈ పరిస్థితే ఉంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ... గతంలో ధనవంతులకు, సామాన్య నేతలకూ కొంత బ్యాలెన్స్‌ చేసేది.
 
రిజర్వేషన్‌ కేటగిరి నుంచి వచ్చిన వారిని, కొన్నిచోట్ల ధనిక నేపథ్యం లేనివారికి టికెట్లు ఇచ్చి.. కాంగ్రెస్‌ బ్యాలెన్స్‌ చేసేందుకు ప్రయత్నించేది. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాకా, అది చంద్రబాబు నాయుడి చేతుల్లోకి వెళ్లాకా.. డబ్బుల్లేని వారు రాజకీయాల్లో అనర్హులు అనే సంప్రదాయం మొదలైంది. కోటీశ్వరుడు కాని వాడు.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా చేశారు చంద్రబాబు. ఇక ఎన్నికల కమీషన్‌ క్రమక్రమంగా అనేక సంస్కరణలు తీసుకువస్తూ ఉంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతే కమిషన్‌ జోక్యం చేసుకోగలదు. అయితే ఇప్పుడే ఓట్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలను ఎలా తరలిస్తున్నారో, వెచ్చిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇది దురదష్టకరం. ఈ రియలెస్టేట్‌ రాజకీయాలను ఏ రోజుకు అయినా ప్రజలే తిరస్కరించాలి.
-పి.విజయ్‌ బాబు, ఆర్టీఐ మాజీ కమీషనర్‌
 
డబ్బుంటేనే గెలిచేస్తారా?
డబ్బుంటే చాలు, ఎన్నికల్లో గెలిచేయవచ్చు అందామంటే ఎన్నికల్లో ఓడిపోయిన అనేకమంది మాజీ సంస్థానాధీశులు, జమీందార్లు, పారిశ్రామికవేత్తలు గుర్తుకువస్తారు. అంతేకాదు, ఉదాహరణకి 100 కోట్లు ఖర్చుపెట్టి ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే దానికి కాస్త తక్కువగానో, ఎక్కువగానో 80 నుంచి 120 కోట్ల మధ్య ఖర్చుపెట్టి ఓడిపోయిన పార్టీ కూడా పక్కనే కనబడుతుంది. 100 కోట్ల పార్టీ డబ్బుతో గెలిచిందనుకోవచ్చు, మరి 80 కోట్ల పార్టీ మాటేమిటి? డబ్బు అక్కరకు రాలేదు కదా! అధికారంలో ఉన్న పార్టీకి అనేక వనరులుంటాయి, ప్రభుత్వధనంతో కూడా నిధులు పారించగలవు. కానీ అనేకసార్లు అవి ఎన్నికల్లో ఓడిపోతూనే ఉంటాయి. దీన్నిబట్టి చూస్తే అర్థమయ్యేది - గెలవడానికి డబ్బు ప్లస్‌ సమ్‌థింగ్‌ కావాలి అని!
 
ఆ సమ్‌థింగ్‌ ఏదో ఒంటబట్టించుకోలేక, గణించడానికి వీలైనది కాబట్టి అందరూ డబ్బు గురించే మాట్లాడుతున్నారు. గతంలో కంటె ఎన్నికలు ఖరీదయ్యాయనేది నిర్వివాదాంశం. కార్యకర్తలకు కమిట్‌మెంట్‌ ఉండేది, ఆదర్శాలకోసం, పార్టీపై అభిమానం కోసం చేసేవారు. ఇప్పుడు ధనం కానీ, వస్తువు కానీ ఇవ్వకపోతే సమావేశాలకే రావడంలేదు. గతంలో ఓటు అమ్ముకోవడం హీనంగా భావించేవారు. ఎవరో అట్టడుగు వర్గాల వారినే డబ్బుతో ఆకర్షించగలిగేవారు. కానీ పత్రికల్లో, టీవీల్లో నిరంతరం అవినీతి గురించి వింటూ వింటూ మధ్యతరగతి మనిషి, విద్యాధికుడు కూడా తన విలువలు మార్చుకున్నాడు. వాళ్లంతట వాళ్లే ఇస్తున్నారుగా అని నచ్చచెప్పుకుంటూ వస్తూరూపేణా ప్రలోభాలకు గురవుతున్నాడు. ఇక బడుగు వర్గాల వారు ఏ పార్టీ ఇచ్చినా డబ్బు పుచ్చుకుంటూ, చివరకు తమకు నచ్చినవాడికో, సెంటిమెంటుకో వేస్తున్నారు.
 
ఇంకో విషయం కూడా గమనించాలి. దేశమంతా ఎన్నికల ఖర్చు ఒకేలా లేదు. మన తెలుగు రాష్ట్రాల వంటి కొన్నిటిలోనే ఖరీదైన ఎన్నికలు శాపంగా దాపురించాయి. మన తెలుగు సినిమారంగం బజ్జె ట్‌ పెంచేసి, నిర్మాణంపై అదుపు కోల్పోయి, అసలైన నిర్మాతలను దూరం చేసుకుంది. ఏదోరకంగా డబ్బు సంపాదించినవాళ్లే పెట్టుబడిదారులుగా అవతరించారు. అలాగే తెలుగు రాజకీయరంగం బజ్జెట్‌ పెంచేసి, ప్రజాసేవ పట్ల సీరియస్‌నెస్‌ ఉన్న అభ్యర్థులను దూరం చేసుకుంది. అడ్డదారుల్లో డబ్బు సంపాదించి దీన్ని కూడా వ్యాపారంగా మార్చుకున్నవారే అభ్యర్థులుగా అవతరిస్తున్నారు. ఏతావతా డబ్బుండాలి, దానితో పాటు మరేదో ఉండాలి, అప్పుడే గెలుపు.
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌, రచయిత, కాలమిస్టు