cloudfront

Advertisement


Home > Politics - Political News

ఢిల్లీలో 'ఆంధ్రా' పరువు తీసేశారు.!

ఢిల్లీలో 'ఆంధ్రా' పరువు తీసేశారు.!

విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలని ఎవరు అడిగినా తప్పు పట్టాల్సిన పనిలేదు. ప్రత్యేక హోదా దండగ వ్యవహారమని గతంలో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాట మార్చి.. రాజకీయ లబ్ది కోసమే ప్రత్యేక హోదా కోరుకుంటున్నా, ఆయనంతే, రాజకీయమే చేస్తాడని సరిపెట్టుకోవచ్చు. వైఎస్‌ జగన్‌ కావొచ్చు, పవన్‌కళ్యాణ్‌ కావొచ్చు, మరొకరు కావొచ్చు.. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కావొచ్చు.. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాలని ఎవరు డిమాండ్‌ చేసినా, వారిని అభినందించాల్సిందే. 

కానీ, చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్నదేమిటి.? ధర్మ పోరాట దీక్ష.. అంటూ బోల్డంత హంగామా చేస్తున్నారు. వేదిక మీదకు జాతీయ స్థాయి నేతలు వచ్చారు. చంద్రబాబుకి ఢిల్లీలో వున్న పలుకుబడి అలాంటిది. కానీ, శివాజీని వేదిక మీదకు తీసుకొచ్చి, బీజేపీని తిట్టించడమే హాస్యాస్పదమైపోయింది. శివాజీ మాత్రమే కాదు, సినీ నటి దివ్యవాణి వ్యవహారం మరింత దారుణంగా తయారైంది. దివ్యవాణితో మాట్లాడించాలన్నది ఎవరి ఆలోచనోగానీ, ఆమె అయితే మైక్‌ దొరకపుచ్చుకుని.. 'తిట్ల దండకం' అందుకున్నారు. 

వెండితెరపై దివ్యవాణిలో ఈ తరహా యాంగిల్‌ని ఎవరూ చూడలేదు. బుల్లితెరపై కొన్ని క్యారెక్టర్లు చేసే అతి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.? ఈ మధ్య ఎక్కువగా బుల్లితెరపైనే ఎక్కువగా కన్పిస్తోన్న దివ్యవాణి, రాజకీయ వేదికపై నోటికొచ్చినట్లు వాగితే రాజకీయాల్లోనూ అవకాశాలొస్తాయని భావించిందేమో.. హద్దులు మీరి మరీ మాట్లాడేసింది. శివాజీ అయితే, బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకి సవాల్‌ విసిరేశారు, ఆయన ఆరోగ్యమ్మీదా సెటైర్లు వేసేశారు.. బెజవాడ వచ్చి, తిరిగి వెళ్ళగలవా? అని ప్రశ్నించేశారు. 

ఢిల్లీ అంటే దేశ రాజధాని. అక్కడికి చంద్రబాబు అండ్‌ టీమ్‌ వెళ్ళింది నిరసన తెలపడానికి. ఆ నిరసన తెలిపే క్రమంలో కొంత ఆవేశకావేశకాలు సహజమే కావొచ్చు. కానీ, మరీ ఇంతలాగానా.? ఇదేదో స్క్రిప్టెడ్‌ వ్యవహారంలా వుంది తప్ప, ఇంకోటి కానే కాదు. మంచి వాగ్ధాటి కలిగిన నేతల్ని ఎంచుకుని, లెక్కలతో సహా మాట్లాడించి వుంటే.. అదీ ఇంగ్లీషు, హిందీలలో ప్రసంగాలు వుండేలా ప్లాన్‌ చేసి వుంటే.. దేశమంతా, ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయం గురించి ఇంకా బాగా తెలుసుకునే అవకాశం వుండేది. అది మానేసి, ఈ తిట్ల దండకమేంటి.? ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రబాబు ఢిల్లీ దీక్షతో, ఆంధ్రప్రదేశ్‌ పరువు పోయింది.