Advertisement


Home > Politics - Political News
దేశంలో మారిన రాజకీయ సమీకరణాలు

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ గెలుపుతో దేశంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఆత్మరక్షణలో ఉన్నాడనుకున్న నరేంద్రమోడీ ఇప్పుడు విజ్రుంభణ చేసే దశకు వచ్చారు. కాంగ్రెస్‌ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనమైన స్థితిలో ఉన్నది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో బీజేపీకి భారీ విజయం తర్వాత ఆ పార్టీపై ఇక ఏ ఆరోపణలు చేసినా చెల్లదనే పరిస్థితి ఏర్పడింది. బీజేపీపై ఇప్పటివరకూ రకరకాల ఆరోపణలు వచ్చేవి. ఒకటి మతతత్వ పార్టీ.. అని. బీజేపీ మతాన్ని రెచ్చగొడుతుందని, హిందూ ముస్లింలను విభజిస్తుందని, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సంస్థలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమే కాక అక్కడక్కడా ఉద్వేగాలను సృష్టిస్తాయని ప్రచారం జరిగేది. అంతేకాక, బీజేపీ దళితులకు వ్యతిరే కమని చిత్రించేందుకు కూడా ప్రయత్నం జరిగింది. ముస్లింలు, దళితులకు బీజేపీ, దాని సంస్థలు వ్యతిరేక మని చిత్రించి, దేశమంతటా ఆ రకంగా వాతావరణాన్ని ఏర్పర్చి, ఆఖరుకు యూనివర్సిటీలు, విద్యాసంస్థలను కూడా ఉపయోగించుకుని కాంగ్రెస్‌, దాని ప్రతిపక్షాలు గత 2 సంవత్సరాలుగా విశ్వయత్నాలు చేశాయి. రోహిత్‌ వేముల ఆత్మహత్యను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశాయి. ఆఖరుకు సాహిత్య అకాడమీ అవార్డులను కూడా వివాదాస్పదం చేసి రచయితల ద్వారా బీజేపీని అప్రతిష్ట పాలు చేసేందుకు చూశాయి. 

విచిత్రమేమంటే ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో జరిగిన ఎన్నికలు ఈ ప్రచారాన్ని తిప్పిగొట్టాయి. రెండు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ మెజారిటీ ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితుల్లో అతి వెనుకబడిన వారు బీజేపీకి పట్టం కట్టారు. అత్యధిక సంఖ్యలో బీజేపీ నుంచి దళితులు, మహిళలు గెలిచారు. ఈపరిణామం దేన్ని సూచిస్తోంది.. ప్రతిపక్షాలు చేసిన ప్రచారంలో వాస్తవం లేకపోగా, ఈ ప్రచారం బీజేపీకే ఉపయోగపడిందని అర్థమవుతున్నది. నిజానికి కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ మతతత్వ, కులతత్వ రాజకీయాలకు పాల్పడ్డాయి. కాంగ్రెస్‌, ఎస్‌పీ బీసీలు, ముస్లింలు, అగ్రవర్ణాలపై కన్ను వేసి అదే రకంగా సీట్లు పంచుకుంటే, బీఎస్‌పీ ముస్లింలు, దళితులపై ఆధారపడి అదే రకంగా సీట్లు ఇచ్చింది. ఫలితంగా ముస్లింలు రెండు పార్టీల మధ్య చీలిపోతే, బీసీలు, దళితుల్లో బాగా వెనుకబడిన వారు, అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓటు వేశాయి. అంటే ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని దశాబ్దాలుగా బీసీలు, దళితులు రాజ్యమేలుతు న్నప్పటికీ ఈ రెండు కులాల్లో కేవలం బలమైన వర్గాలే ప్రయోజనం పొందాయని అర్థమవుతున్నది. 

బీసీలు, దళితుల్లో తమ వర్గాలపై తమకున్న అసంత్రుప్తిని బీజేపీ అద్భుతంగా ఉపయోగించుకుంది. ఇక ప్రతిపక్షాలు చేసిన ప్రచారం వల్ల బీజేపీ పెద్దగా అదనపు ప్రచారం చేయక పోయినా, హిందూ ఓట్లు సంఘటితమయ్యాయి. మొత్తానికి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి తనకంటూ ఒక పెద్ద ఓటు బ్యాంకు ఏర్పడింది. 2014లో బీజేపీ చేసిన ప్రయోగం పూర్తిగా విజయవంతం అయి 2019 నాటికి అది పూర్తి గా వివిధ వర్గాలు బీజేపీకి అనుకూలంగా సంఘటితమయ్యేలా చేసింది. ఒకప్పుడు కాంగ్రెస్‌ దళితులు, అగ్ర వర్ణాలు, హైనారిటీలను తమ వశం చేసుకుని ఉత్తరప్రదేశ్‌ను, తద్వారా దేశాన్ని ఏలింది. ఆ ఫార్ములా వల్ల కాంగ్రెస్‌కు దాదాపు అయిదు దశాబ్దాలు జాతీయ స్థాయిలో తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ఇదే ఫార్ములా బీజేపీ కొద్దిగా సవరించి ఉపయోగించుకుంది. యూపీలో జాతీయస్థాయిలో 80సీట్లు, అసెంబ్లీలో 300పైగా సీట్లు సంపాదించిన పార్టీకి ఇక దేశంలో తిరుగెక్కడ ఉంటుంది? 

నిజానికి మరో రెండేళ్లలో ఎన్నికలున్నదనగా బీజేపీ సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు. యూపీ లోనే కాదు, దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటు బ్యాంకు సంఘటితం కావడానికి ఈ విజయం తోడ్పడుతుంది. ఇప్పటికే ఈశ్వరయ్య నేత్రుత్వంలోని బీసీ కమిషన్‌ బీసీల వర్గీకరణకు సిఫారసులు చేసింది, వెనుకబడిన వర్గాలు, అతి వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలుగా బీసీలను విభజించి దేశవ్యాప్తంగా సర్వే చేయడానికి ప్రతి పాదనలు పంపింది. మరోవైపు దళితుల వర్గీకరణకు కూడా బీజేపీ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రలో దళితులను విభజించేందుకు బీజేపీ ఇప్పటికే సైద్దాంతికంగా అనుకూలత ప్రకటించింది. యూపీ విజయం తర్వాత బీసీలు, దళితులను విభజించేందుకు బీజేపీ వేగంగా చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదితో బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ వస్తే తాను అనుకున్న విధంగా రాజ్యాంగ సవరణలు చేసి కొత్త రిజ ర్వేషన్‌ సూత్రాలు అమలు చేసేందుకు బీజేపీ వెనుకాడదు. తద్వారా బీజేపీ సామాజిక న్యాయం చేసినట్లు మాత్రమే కాక, తనఓటు బ్యాంకును దేశవ్యాప్తంగా సంఘటితంచేసుకుంటుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలు ఈ చర్యనుపెద్దగా వ్యతిరేకించలేవు. మండల్‌లో కమండల్‌ను ప్రవేశపెట్టే ఉద్దేశంతో బీజేపీ ముందుకు వెళుతోంది. 

ఇక బీజేపీ తక్షణ లక్ష్యం ఈ ఏడాది ఆఖరులో గుజరాత్‌లో విజయం సాధించడం. గుజరాత్‌లో గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. రచ్చ గెలిచి చూపించిన మోడీ ఇక ఇంటగెలిచి చూపించాల్సి ఉన్నది. ఇప్పుడే పటేదార్‌ ఉద్యమం వల్ల బీజేపీ గుజరాత్‌లో కొంత దెబ్బతింది. నరేంద్రమోడీ కేంద్రానికి వచ్చిన తర్వాత గుజరాత్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చింది. గుజరాత్‌లో నాలుగుసార్లు విజయం సాధించినందువల్లే తాము ఢిల్లీకి రాగలిగామని నరేంద్రమోడీ, అమిత్‌షాలకు తెలుసు. కనుక గుజరాత్‌లో గెలువడం వారి ముందున్న పెద్ద సవాలు. బీజేపీ అ్యధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగి గుజరాత్‌లో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తెప్పించి సంఘటిత పరచకపోతే గుజరాత్‌లో బీజేపీ దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇది ప్రతిపక్షాల్లో కోల్పోయి న నైతిక స్థైర్యం తిరిగి పుంజుకునేలా చేస్తుంది. నిజానికి యూపీ చివరిదశ ఎన్నికలు జరుగుతుండగానే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గుజరాత్‌ వెళ్లి దాదాపు రెండు రోజుల పాటు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం విజయ్‌రూపట్‌ తనకు ఏర్పాటు చేసిన విందులో మోడీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడారు. వ్యూహరచన చేశారు. ఇక పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా యూపీలో ఎన్నికలపర్వం ముగియగానే గుజరాత్‌ పర్యటన ప్రారంభించారు. సోమనాథ్‌ మందిరాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. మోడీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో మాట్లాడితే అమిత్‌ షా పార్టీ నేతలు, ప్రజలతో మాట్లాడారు. ఇద్దరూ తమకు వచ్చిన సమాచారాన్ని పంచుకుని వ్యూహరచనలో మునిగిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్‌లో తిరిగి అధికారంలోకి రావాలన్నది వారిద్దరి లక్ష్యం. అత్యంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యూహరచన చేసే పరిస్థితిలో లేదు. ఇదే బీజేపీ బలం. 

రెండవది ప్రతిపక్షాలు బీజేపీ పథకాలపై ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా అది నిలబడలేదు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు ధర్నాలు చేశాయి. బంద్‌లు నిర్వహిం చాయి. సభలు ఏర్పాటు చేశాయి. సోషల్‌ మీడియాను ఉపయోగించుకున్నాయి. కాని ఇవన్నీ ప్రజలు పట్టించు కోలేదు. నరేంద్రమోడీ నిజాయితీని వారు శంకించలేదు. ప్రతిపక్షాలు అవినీతికి, నల్లధనానికి మద్దతునిస్తున్నాయని వారు భావించారు. ప్రతిపక్షాలు విశ్వసనీయత కోల్పోవడం, మోడీ ప్రతిష్ట చెక్కుచెదరకపోవడం వల్లే బీజేపీ ప్రయోజనం పొందుతోంది. ఉత్తరప్రదేశ్‌లో మోడీ ఒక్కడే ప్రచారం చేసినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ దేశంలో ఆధిపత్యంగల నాయకుడు నరేం ద్రమోడీ.. అని మాజీహోంమంత్రి చిదంబరం కూడా కితాబు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. విచిత్రమేమంటే ఈ దేశంలో వామపక్షాల సిద్దాంతాలకు విలువ తగ్గిపోవడం. ప్రజలు వారిని కాలం చెల్లిన వారిగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు వామపక్షాలతో అవసరార్థం చేతులు కలపడాన్ని కూడా వారు హర్షించడంలేదు. అందర్నీ కట్టకలిపి చెత్తబుట్టలో విసిరేస్తున్నారు. వామ పక్షాల వల్ల తమకు విశ్వసనీయత లభించకపోగా ఉన్న విశ్వసనీయత పోతుందని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. వామపక్షాలు కూడా అవతలి వాడి భుజంపైకి ఎక్కి ఎదగడం మానేసి స్వంతంగా తమ బలం ఎంతో తేల్చుకుంటే కనుమరుగ వుతారా, నిలబడతారా అన్నది తేలుతుంది. 

ఇక చివరిగా మోడీ నిరంకుశుడని, నియంత అని, అంతాతానే పెత్తనం చలాయిస్తారని ప్రచారం జరిగింది. బీజేపీలో కూడా పలువర్గాలు, చివరకు మంత్రులు కూడా మోడీ పూర్తిగా అధికారం తన చేతుల్లో కేంద్రీక తం చేసు కున్నాడని వాపోయాయి. కాని ఇది మోడీకే ప్రయోజనకరంగా పరిణమించింది. గతంలో ఇందిరాగాంధీ విషయంలో కూడా ఇదే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇందిరాగాంధీ తర్వాత నరేంద్రమోడీ ఆకర్షణీయమైన స్థానంలో నిలిచారు. మోడీ నియంతగా వ్యవహరించడాన్ని ప్రజలు తప్పుపట్టనప్పుడు మిగతా వారెంత అరిచి గీపెట్టినా ఏమి ప్రయోజనం?