cloudfront

Advertisement


Home > Politics - Political News

దేవదేవుడి పరువు విలువ 100 కోట్లా..?

దేవదేవుడి పరువు విలువ 100 కోట్లా..?

తెలుగుదేశం పార్టీ పరువుని బజారుకీడ్చి, టీటీడీ అరాచకాలను అడ్డుకోవాలంటూ సంచలనం రేపిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈసారి ప్రభుత్వం ఇచ్చిన పరువునష్టం నోటీసుపై ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలపై 100 కోట్ల రూపాయల పరువునష్టం దావా నోటీసు ఇచ్చారని.. అంటే శ్రీవారి పరువు విలువ 100కోట్ల రూపాయలు అని లెక్కకట్టారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 

శ్రీవారి ఆభరణాల లెక్క చెప్పాలని, దేవస్థానంలో జరుగుతున్న అపచారాలను అరికట్టాలని మరోసారి డిమాండ్ చేశారు రమణ దీక్షితులు. తిరుమలలో అమూల్యమైన, ఇప్పుడు మాయమైన శ్రీవారి ఆభరణాల గురించి తాను ప్రశ్నిస్తే తనకు పరువునష్టం దావా నోటీసు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తన వాదనను రాజకీయం చేస్తూ దానికి వక్రభాష్యాలు చెబుతున్నారని, తాను అడిగినదానికి ఇంతవరకు సమాధానం లేదని అన్నారు. ఆగమశాస్త్ర విరుద్ధంగా, ఆగమ శాస్త్ర సలహాదారులమైన తమకు తెలియకుండా శ్రీవారి ప్రసాదాలు తయారుచేసే పోటును మూసివేసి దానిలోని 4 బండలు తొలగించి నేలమాళిగ నుంచి ఏమి తరలించారో చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు. 

శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారికి కనకాభిషేకం చేసిన 18 లక్షల బంగారు వరహాలు పోటు నేలమాళిగలో ఉన్నాయని, ఈ విషయం తిరుమల ఆలయంలోనే శాసనాలలో ఉందని గుర్తు చేశారు. అందువల్లనే ఆ నేలమాళిగను పోటులోనే ఉంచారని, పోటులోకి స్వామివారికి నైవేద్యం సమర్పించే అర్చకులు తప్ప ఇంకెవరూ పోకూడదని అన్నారు. పోటును తమకు తెలియకుండానే మూసివేసి ఆ నేలమాళిగపై బండలు తీసివేశారని, ఈ విషయం తాను పత్రికల్లో వార్తలు చూసి తెలుసుకున్నానని దీక్షితులు అన్నారు. 

తనకు పరువునష్టం దావా నోటీసు ఇచ్చేబదులు నగల మాయంపై విచారణ కమిటీ వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా వివాదాన్ని పక్కదోవ పట్టించే చర్య అని, ఇకనైనా తన ప్రశ్నలకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామివారికి కైంకర్యాలు, పూజలు, నైవేద్యాలు.. అన్నింటిలోనూ తప్పులు చేస్తున్నారని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా స్వామివారి ఆలయ పవిత్రతకు కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు రమణ దీక్షితులు.