cloudfront

Advertisement


Home > Politics - Political News

గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ః ధర్మవరంలో ఎవరు లీడ్?

గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ః ధర్మవరంలో ఎవరు లీడ్?

అనంతపురం జిల్లా ధర్మవరం... తెలుగుదేశం పార్టీకి అనుకూల నియోజకవర్గాల్లో ఒకటి. బీసీ ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక్కోసారి ఓడినా.. మరోసారి గెలుస్తూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పర్యాయాల్లో కూడా కొన్నిసార్లు ఇక్కడ టీడీపీ జెండాపాతింది. అలాగని కాంగ్రెస్ గెలవలేదు అనికాదు. రెండువేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఘన విజయం సాధించారు.

అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేరు. పొత్తులో భాగంగా ఈ సీటును కమ్యూనిస్టులకు కేటాయించింది టీడీపీ. ప్రస్తుత టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇండిపెండెంట్ గా పోటీ చేశారప్పుడు. అయితే వైఎస్ హవాలో.. కేతిరెడ్డి విజయం సునాయసం అయ్యింది. ఇక గత ఎన్నికల్లో కేతిరెడ్డి మీద వరదాపురం సూరి మంచి మెజారిటీతో నెగ్గారు.

ఇక ప్రస్తుతం సీన్ ఎలా ఉంది?
- జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకోదగిన నియోజకవర్గాల్లో ఒకటిగా కనిపిస్తోంది ధర్మవరం.
- సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరి మీద నియోజకవర్గంలో బాగా అసంతృప్తి కనిపిస్తూ ఉంది.
- ఆ అసంతృప్తి తెలుగుదేశం వాళ్లలోనే కావడం గమనార్హం. ఆయన ఎవ్వరినీ గౌరవించరని, సూరి కన్నా ముందు నుంచినే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వారిని పూచికపుల్లలా తీసి వేస్తున్నాడు అనేది తెలుగుదేశం పార్టీలోని నాయకత్వం నుంచి వినిపిస్తున్న మాట.
- కేవలం తెలుగుదేశం పునాదులు బలంగా ఉండటంతో మాత్రమే ఇప్పుడు సూరి పోటీలో అయినా కనిపిస్తున్నారు.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేతిరెడ్డి ఐదేళ్ల నుంచి కూడా స్థానికంగా ఉంటున్నారు.
- అభ్యర్థిత్వం విషయంలో కేతిరెడ్డికి పోటీలేదు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా.. గత ఏడాది నుంచి మరింత గట్టిగా తిరుగుతున్నారు అనేది స్థానికులు చెబుతున్న మాట. 
- తెలుగుదేశం పార్టీకి అనుకూల నియోజకవర్గం అయినా వార్ వన్ సైడెడ్ కాదు అనేది స్పష్టం అవుతోంది.

డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే...
- ధర్మవరం నియోజకవర్గం మీద పరిటాల కుటంబ ప్రభావం మొదటి నుంచి ఉంది. పరిటాల ప్రత్యర్థులు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన నేపథ్యం ఉంది. వాస్తవానికి ఈ టికెట్ ను తన తనయుడు శ్రీరామ్ కు కావాలని సునీత ఒకదశలో పట్టుపట్టారు. అయితే చంద్రబాబు నో అన్నారు.
- వరదాపురం సూరి విజయానికి పరిటాల వర్గం ఏమాత్రం సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. సునీత డైరెక్ట్ జోక్యం లేకపోయినా... పరిటాల అభిమానులు మాత్రం వరదాపురానికి ఓటేసే అవకాశాలు కనిపించడం లేదు.
- ధర్మవరం పట్టు ప్రపంచ ప్రసిద్ధి. చేనేత సామాజికవర్గానికి చెందిన వారే ఇక్కడ ఎవరిది విజయం అనేది దాదాపుగా డిసైడ్ చేస్తారు.
- పల్లెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు కనిపిస్తూ ఉంది. రుణమాఫీ సరిగా కాకపోవడం తెలుగుదేశం పార్టీని గట్టిగా దెబ్బతీయనుంది.
- గత ఎన్నికల్లో చేనేత సామాజికవర్గం నూటికి తొంభైశాతం తెలుగుదేశానికి మద్దతుగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆ సామాజికవర్గానికి చెందిన చాలామంది ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఫిఫ్టీ – ఫిఫ్టీ స్థాయికి రావడం గమనార్హం!
- జనసేన తరఫున చిలకం మధుసూదన్ రెడ్డికి టికెట్ ఖరారు  అయ్యింది. అయితే జనసేన ఊసులేదు. జనాలు ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. జనసేన పేరు గుర్తు చేయగానే.. జనాలు నవ్వడం మొదలుపెడుతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి..
కొన్ని వందల శాంపిల్స్ ను పరిశీలించిన తర్వాత.. ధర్మవరం నియోజకవర్గం సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -51
తెలుగుదేశం పార్టీ -45
జనసేన- 04

మరిన్ని ఆసక్తిదాయకమైన విషయాలు ఇవి..
-హిందూపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే ఈ సీట్లలో బీసీల్లో కూడా మార్పు కనిపిస్తోంది. హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ పోటీ చేస్తే.. కురుబ సామాజికవర్గం  ఓట్లు వైసీపీ వైపు గణనీయంగా పడే అవకాశం ఉంది.
-జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధుసూదన్ రెడ్డి చీల్చే ప్రతి ఓటూ తెలుగుదేశం ఓటే  అని అని అంటున్నారు.
-జనసేన తక్కువలో తక్కువ నాలుగైదు వేల ఓట్లు పొందినా… అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభమే అని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు.
-వరదాపురం సూరికి ఆర్థిక బలం విషయంలో తిరుగు లేదు. వంద కోట్లు అయినా ఖర్చు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు. ఆఖరి నిమిషంలో కోట్ల రూపాయల రూపాయలు అయినా చిల్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు.
-బత్తలపల్లి మండలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తోంది. ధర్మవరం రూరల్ వైసీపీ వైపు మొగ్గుచూపుతోంది. ధర్మవరం టౌన్  మొత్తం ఫలితాలను డిసైడ్ చేస్తోంది. 
-డబ్బు విషయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెనుకడుగు వేస్తున్నారని, డబ్బు ఉన్నా కార్యకర్తల కోసం కూడా ఆయన పెద్దగా ఖర్చులేమీ పెట్టడం లేదని అంటున్నారు.
-డబ్బు ఒక్కటే కొన్ని వేల ఓట్లను ప్రభావితం చేసి..వరదాపురం వైపు  మొగ్గు చూపితే తప్ప.. ఆయనను గెలిపించే అంశాలు ఏవీ లేవని స్థానికుడు ఒకరు తేల్చి చెప్పారు!

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!