Advertisement


Home > Politics - Political News
ధర్మవరం.. తమ్ముళ్ల తన్నులాట అసలు కథ అదా..!

అనుకూల పత్రికల్లోనేమో.. బాబుగారు ఘాటుగా హెచ్చరించేశారు, ఇరువవర్గాలనూ మందిలించేశారు, ఇరువురినీ కూర్చోబెట్టి పంచాయితీ చేశారు.. ఇక గొడవపడితే సహించనని అన్నారు.. దీంతో ఇరు నేతలూ రాజీకివచ్చారు. కలిసి పనిచేసుకుంటాం, ఎవరిపని వారు చూసుకుంటాం.. అని హామీని ఇచ్చేశారు.. అంటూ అనునిత్యం రాస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ అంతర్గత గొడవలు మాత్రం అదే రీతిన కొనసాగుతూ ఉంటాయి. ఇదో సీరియల్‌. చంద్రబాబుకు కూడా బాగానే తీరిక ఉన్నట్టుగా ఉంది. ఖాళీ దొరికినప్పుడల్లా.. వీళ్లు తన్నులాడినప్పుడల్లా.. పిలిపించుకుంటారు, పంచాయితీ చేస్తారు. ఆ తర్వాత మామూలే!

కామెడీ ఏమిటంటే.. బాబుగారి పంచాయితీ ప్రతీసారి అంతే సీరియస్‌గా జరిగినట్టుగా, బాబుగారు తన్నుకుంటున్న వారిపై నిప్పులు చెరిగినట్టుగా.. వారిని గట్టిగా హెచ్చరించినట్టుగా... అవే పడికట్టు పదాలతో పత్రికల్లో వార్తలు వస్తూ ఉంటాయి. అదెంత రొటీనో.. తమ్ముళ్లు తన్నుకోవడం కూడా అంతే రొటీన్‌ అయిపోయింది. అలాంటి గొడవల్లో ఒకటి అనంతపురంజిల్లా ధర్మవరంలో పరిటాల వర్గానికి, లోకల్‌ ఎమ్మెల్యే వరదాపురం సూరికి జరుగుతున్న గొడవ.

ఈ రచ్చ ఇప్పటిది ఏమీకాదు.. వరదాపురం సూరీకి పరిటాల వర్గానికి మధ్య గొడవ చాలా పాతదే. ఎప్పుడో రవి ఉన్న రోజుల్లో వాటాల్లో వచ్చిన గొడవ అలాగే పెరిగి పెరిగి పెద్దది అవుతూ వచ్చింది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికి పార్టీ తరపున టికెట్‌ దక్కడం ముందు నుంచినే పరిటాల ఫ్యామిలీకి ఇష్టంలేదు. అది తమ నియోజకవర్గం కాకపోయినా.. అక్కడ తెలుగుదేశం పార్టీని నిలిపింది తామేనని.. తాము చెప్పిన వ్యక్తులే అక్కడ తెలుగుదేశం తరపున ఉండాలనేది పరిటాల కుటుంబం వాదన.

ఇందుకు తగ్గట్టుగా ఒకటీ రెండుసార్లు.. వరదాపురం సూరిని అణగదొక్కగలిగింది పరిటాల ఫ్యామిలీ. ప్రత్యేకించి 2009లో పార్టీ టికెట్‌ దక్కనీయకుండా చూడటంలో పరిటాల సునీత విజయవంతం అయ్యారు. అయితే.. 2014లో మాత్రం సూరికి అడ్డులేకుండా పోయింది. ఇక సునీతకు మంత్రిపదవి దక్కేసరికి ఆమె తిరిగి ధర్మవరంలో కూడా హవాను కొనసాగించాలి, తమ పాతశత్రువు సూరిని అణదక్కాలనే ధోరణిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూరి కూడా ఢీ అనడంతో ఇరువర్గాల మధ్యనా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ రచ్చలో చంద్రబాబు జోక్యం చేసుకుని.. చెబుతున్నా, ఇరువర్గాలూ బాబు మాటను ఖాతరు చేయడంలేదు.

మరి వేలుచూపుతూ.. హెడ్మాస్టర్‌లా మాట్లాడే బాబు అంటే తెలుగుదేశం నేతలకే లెక్క లేకుండా పోయినట్టుంది పాపం. బాబు ఇటీవలే పంచాయితీ చేసినా ప్రయోజనం శూన్యం. బాబు మాటలు బాబువే, మా గొడవలు మావే.. అన్నట్టు మారింది వ్యవహారం. మొన్నటి వరకూ గొడవలు తక్కువగానే ఉండేవి, ఇటీవల అటో రెండొందల మంది, ఇటో రెండొందల మంది రంగంలోకి దిగి రాళ్లు విసురుకుని రచ్చ చేసేంత వరకూ వెళ్లింది. మరి ఒక పట్టణంలో నాలుగు వందల మంది ఇష్టానుసారం రాళ్లు రువ్వుకోవడం అంటే... అదెంత పెద్ద గొడవో వేరే ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.

మరి ఇంతగా కొట్టుకోవడానికి తక్షణ కారణం ఏమిటి? అని ఆరాతీస్తే.. ఇదంతా వాటాల గొడవ అని తెలుస్తోంది. ఒక కాంట్రాక్టు పనికి సంబంధించిన వాటాల్లో తేడా వచ్చిందని, దాదాపు మూడుకోట్ల రూపాయల విలువైన పని విషయంలో పరిటాల కుటుంబానికి, వరదాపురం సూరికి మధ్య వాటాల తేడా వచ్చిందని, సొమ్ము తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఇరు వర్గాలూ రెచ్చిపోయాయని తెలుస్తోంది. తన నియోజకవర్గంలో పనులకు సంబంధించి పరిటాల కుటుంబానికి వాటాలు ఏమిటి? వసూళ్లు అన్నీ తనకే దక్కాలనేది సూరి వాదనగా తెలుస్తోంది.

అయితే వాటాల్లో వసూళ్ల కోసం పరిటాల కుటుంబం పేచీ పెడుతోందని.. ఈ పేచీనే అంత రణరంగానికి కారణం అయినట్టుగా తెలుస్తోంది. మరి.. ఈ వాటాల పంచాయితీని బాబు ఎలా పరిష్కరిస్తారో, ఎవరి పర్సెంట్‌ ఎంతని డిసైడ్‌ చేస్తారో.