Advertisement


Home > Politics - Political News
దున్నపోతు మీద 'బాలకృష్ణ'

'బాలయ్యా.. కాస్త హిందూపూర్‌కి రావయ్యా..' అంటూ హిందూపూర్‌ నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఆర్తనాదాలు చేస్తున్నారు. వేసవితాపంతో విలవిల్లాడుతున్నామనీ, మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేని కోరుతున్నారు. కొన్నాళ్ళుగా నియోజకవర్గానికి బాలయ్య వెళ్ళకపోవడంతో, కొందరు పోలీసుల్ని ఆశ్రయించారు కూడా. 

ఇక, ఇలా కాదనుకున్నారో ఏమో.. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. దున్నపోతుల మీద బాలకృష్ణ పేర్లు రాసి మరీ, తమ నిరసనను వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఆందోళనల్లో ఈ ఘట్టం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. బాలకృష్ణతోపాటు, టీడీపీ పేర్లనూ దున్నపోతులపై రాసి, వాటిని ఊరేగించారు. అయితే, ఇదంతా రాజకీయ కుట్ర అనీ, వైఎస్సార్సీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందనీ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. 

'పదవి నాకు అలంకారం కాదు.. పదవికి నేనే అలంకారం..' అని చెప్పుకునే బాలయ్య, 'నేను మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడమే మీ అదృష్టం.. అంతకు మించి, ఇంకేమీ మీరు నా నుంచి ఆశించడం అనవసరం..' అన్నట్టు వ్యవహరిస్తున్నారేమో.! అయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడమేంటట.? బాలయ్యా, ఇదేం రాజకీయమయ్యా.? ఆఖరికి, దున్నపోతుల మీద పేర్లు రాసి, నియోజకవర్గ ప్రజలు నిరసన వ్యక్తం చేసే స్థాయికి రాజకీయంగా దిగజారిపోవడమేంటయ్యా.? అని ఆయన అభిమానులు వాపోతున్నారు.