cloudfront

Advertisement


Home > Politics - Political News

ఎద్దు పాలివ్వడమేంటి చంద్రన్నా.!

ఎద్దు పాలివ్వడమేంటి చంద్రన్నా.!

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు వచ్చాయో చూశాం. ఆ ప్రకటనలకు తగ్గట్టుగా ఒక్కటంటే ఒక్క ఎన్నికల హామీ అయినా పూర్తిస్థాయిలో నెరవేరిందా.? అంటే లేదాయె. ఇప్పుడు మళ్ళీ ప్రకటనలు షురూ అయ్యాయి తాజా ఎన్నికల కోసం. అందులో ఓ ప్రకటన ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతలా ఆశ్చర్యపరచడానికి కారణం, ఆ ప్రకటనలో ఆవుకు బదులు ఎద్దు కన్పిస్తుండడమే. ఎద్దు, దాంతోపాటే ఓ దూడను చూపించారు ఆ ప్రకటనలో.

చంద్రన్న పసుపు - కుంకుమ పేరుతో ఆడపడుచులకు ఎంతో మేలు చేసేస్తున్నారంటూ ఆ ప్రకటనలో చూపించేందుకు ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ. మామూలుగా అయితే ఆవుని పాల కోసం పెంచుకోవడం ఓ లెక్క. ఆ ఆవుతోపాటే ఓ దూడ తప్పనిసరి. దూడ వుందిగానీ, వచ్చింది ఆవు కాదు.. ఎద్దు. అదే అసలు సమస్య. దీనికి, తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి భాష్యం చెబుతారోగానీ.. సోషల్‌ మీడియాలో అయితే, తెలుగుదేశం పార్టీ తెలివితేటలకి సోషల్‌ మీడియా ఘొల్లెత్తిపోతోంది.!

ఔను, అదంతే.. చంద్రబాబు పాలనలో ఎద్దు అయినాసరే, పాలు ఇచ్చి తీరాల్సిందేనని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లేస్తున్నారు. ఇంకా చాలా చాలా కామెంట్లు పడుతున్నాయి. బీకామ్‌లో ఫిజిక్స్‌ వున్నట్లు, ఎద్దులు కూడా పాలు ఇవ్వడం మొదలు పెట్టినట్లున్నాయని మరికొందరు కామెడీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు విడుదల చేసే ప్రకటనలు ఓటర్లపై ఖచ్చితంగా ఎంతోకొంత ప్రభావం చూపుతాయన్నది నిర్వివాదాంశం.

ఇప్పుడు, టీడీపీ ప్రకటనలూ గట్టిగానే ప్రభావం చూపుతాయి.. చంద్రబాబు పాలన ఎంత సమర్థవంతంగా వుందో చెప్పడానికి ఈ ప్రకటన ఒక్కటీచాలు. పార్టీ ప్రకటనలే సరిగ్గా ఇచ్చుకోలేని దుస్థితిలో వున్న చంద్రబాబు, రాష్ట్రానికి మెరుగైన పాలన ఎలా ఇవ్వగలరు.? అని ఈ ప్రకటన చెప్పకనే చెబుతోంది. ఎద్దుని చూపించి ఆవుగా నమ్మించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. ఆయన గత నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధిని చెప్పకనే చెబుతున్నాయి.

అమరావతిని గాల్లో నిర్మించేశారు, పోలవరం ప్రాజెక్టునీ కట్టేశారు.. రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా చేసేశారు.. ఇదిగో, ఈ ఎద్దు ప్రకటనే సాక్ష్యం.. అంటే అది అతిశయోక్తి కాదు. వెనకటికి ఎవడో అన్నాడట ఎద్దు ఈనింది.. అని. ఆ వెంటనే అయితే దూడని కట్టేయమని అన్నాడట ఇంకొకడు. ఎద్దు ఈనడమేంటి.? అన్న కాస్త ఇంగితం కూడా లేకుండాపోయింది. 'పచ్చ' ప్రకటనలోనూ ఆ ఇంగితం కన్పించలేదు మరి.!