
ఈనాడు, ఆంధ్రజ్యోతి సిగ్గుపడాల్సిన సమయమిది. నిస్సిగ్గుగా ఆ రెండు పత్రికలు నిజాలకు ఎలా పాతరేస్తాయో లోకం మరోసారి తెలుసుకోవాల్సిన ఉదంతం ఇది. ఎస్ఈసీపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదనే ఈనాడు, ఆంధ్రజ్యోతి తాపత్రయాన్ని చూస్తే ...వాటిపై కోపానికి బదులు జాలేస్తుంది. ఎందుకంటే కాలంతో పాటు మారని ఏ వ్యవస్థలైనా తమ పతనానికి తామే పునాదులేసుకుంటున్నాయని అర్థం చేసుకోవాలి.
వెనుకటికి ఓ పుంజుకోడి తాను కూత కూస్తే తప్ప తెల్లారదని అనుకున్నదట. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల వాలకం చూస్తే ....ఆ పుంజుకోడి తీరు గుర్తు రాకమానదు. హైకోర్టులో నిన్నటి పరిణామాలు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. అందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కాకుండా, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందన్న అంశాల్ని మాత్రమే హైలెట్ చేయడం ఎల్లో మీడియా సంకుచిత, కుట్రపూరిత స్వభావానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు రూ.40 లక్షలు మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు, సహాయ, సహకారాలను అందించేలా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. కమిషన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దేవానంద్ సోమవారం విచారణ జరిపారు.
ఈ విచారణకు సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో నేడు కూడబలుక్కున్నట్టు వార్తలను ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాని (ఎస్ఈసీ)కి సహాయ సహకారాలు అందించాలని తానిచ్చిన ఉత్తర్వులను ఉన్నతాధికారులు సరైన స్ఫూర్తితో అమలు చేయలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని ఆ రెండు పత్రికలు రాసుకొచ్చాయి.
ఎస్ఈసీ కోరిన విధంగా పోస్టులు భర్తీకి తగిన చర్యలు తీసుకోలేదని.. నిధులు కూడా మంజూరు చేయలేదని పేర్కొన్నట్టు ప్రచురించారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి అర్ధసత్యాలను మాత్రమే ప్రచురించి తాము ఎప్పటికీ మారమని నిరూపించాయి.
కేసు విచారణలో భాగంగా ఎస్ఈసీపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి సాక్షి పత్రిక ఆవిష్కరించింది. ఎస్ఈసీపై హైకోర్టు ఏమన్నదో చూద్దాం.
"రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సదుద్దేశాలపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మాట చెప్పేందుకు ఈ న్యాయస్థానం ఎంతమాత్రం సంశయించడంలేదు. ఎన్నికల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న మా ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుంటే, వెంటనే ఎందుకు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయలేదు.
ఆ తరువాత కూడా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి, అది విచారణకు రాకున్నా కూడా పట్టించుకోలేదు. 42 రోజులపాటు ఆ పిటిషన్‌ను అలా వదిలేశారంటే ఎన్నికల కమిషనర్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుంది. ఇక్కడే ఎన్నికల కమిషనర్ తీరుపై ఈ న్యాయస్థానానికి సందేహాలు కలుగుతున్నాయి" అని సీరియస్ కామెంట్స్ చేసింది.
కానీ ఈ వ్యాఖ్యలేవీ ఈనాడు, ఆంధ్రజ్యోతి చెవులకెక్కించుకోలేదు. నిజానిజాలతో తమకే మాత్రం సంబంధం లేదని, కేవలం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలే కావాలనే ధోరణితో వార్తల్ని వండివార్చాయి. కానీ ఇది సోషల్ మీడియా కాలం. ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్పినవే నిజాలని నమ్మేందుకు కాలం చెల్లింది.
ఇంకా చెప్పాలంటే, ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇచ్చి వార్తా కథనాలను ప్రచురిస్తున్నదంటే ...ఏదో మతలబు ఉందనే అనుమానాలు ప్రతి పాఠకుడిలో కలగడం మొదలై చాలా కాలమైంది. ఎవరు చెప్పారన్నది ప్రజలకు ముఖ్యం కాదు. ఏం చెప్పారనేదే జనానికి కావాలి. నిజాల్ని చెప్పే మీడియాకే ఆదరణ ఉంటుంది.
ఎస్ఈసీపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యల గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల లక్ష్యం నెరవేరకపోగా, పాఠకుల దృష్టిలో మరింత అభాసుపాలయ్యాయి. ప్రజలు కేంద్రం కాకుండా, వ్యక్తిగత రాగద్వేషాలకు అనుగుణంగా వార్తలను అందిస్తామంటే, ఆదరించడానికి జనం వెర్రి వాళ్లు కాదు. అయినా అభాసుపాలు కావడం ఎల్లో మీడియాకు సర్వసాధారణమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.