cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏంటిది అశోకా.. ఎందుకీ కినుక.?

ఏంటిది అశోకా.. ఎందుకీ కినుక.?

మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు లేకుండానే భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసేశారు. అశోక్‌ గజపతిరాజు అంటే ఎవరు.? తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేత, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు.. అన్నిటికీ మించి విజయనగరం జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాంటి అశోక్‌ గజపతిరాజుగారికి సొంత జిల్లాలో జరిగిన అతి పెద్ద కార్యక్రమానికి ఆహ్వానం వెళ్ళలేదా.? వెళ్ళినా ఆయన కినుక వహించారా.? 

ఏమోగానీ, పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో అశోక్‌ గజపతిరాజు ఒకింత గట్టిగానే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం ప్రయత్నించారు కాబట్టి, ఆయనకు తగినంత గౌరవం తెలుగుదేశం పార్టీ ఇచ్చి వుండాల్సింది. ప్రభుత్వం తరఫు, పార్టీ తరఫున కూడా ఇటీవలి కాలంలో ఎదురవుతున్న అవమానాలతోనే అశోక్‌ గజపతిరాజు కినుక వహించారన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా విన్పిస్తోన్న అభిప్రాయం. అయితే, అదంతా ఉత్తదేననీ.. అశోక్‌ గజపతిరాజు పబ్లిసిటీ స్టంట్స్‌ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్తున్నారు. 

అన్నట్టు, మాజీ కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు సుముఖంగా వున్నారు. ఇటీవలే కిశోర్‌ చంద్రదేవ్‌, కాంగ్రెస్‌కి గుడ్‌ బై చెప్పారు.. చంద్రబాబుతో ఆల్రెడీ భేటీ అయ్యారు.. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కూడా. ఉత్తరాంధ్రలో సీనియారిటీ పరంగా చూస్తే, అశోక్‌ గజపతిరాజుకి కిశోర్‌ చంద్రదేవ్‌ ఒకింత గట్టిగానే పోటీ ఇవ్వగలరు.. కానీ, ఎన్నికల్లో గెలిచేంత బలం మాత్రం ఈ ఇద్దరిలో ఎవరికీ లేదన్నది తాజాగా విన్పిస్తోన్న వాదన. 

కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడిన అశోక్‌ గజపతిరాజు, చంద్రబాబుకి ఇప్పుడు ఎదురు తిరుగుతారా.? వైఎస్సార్సీపీ వైపో, జనసేనలోకో వెళ్ళేందుకు సాహసిస్తారా.? అంటే, ఛాన్సే లేదని ఆయనగారి అనుచరులు చెబుతున్నారు. పైగా, పవన్‌కళ్యాణ్‌ అంటే ఎవరో తనకు తెలియదంటూ ఇప్పటికి చాలాసార్లు అశోక్‌ గజపతిరాజు సెలవిచ్చారాయె. జగన్‌ అవినీతి గురించి ఆయనగారి విమర్శల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అఫ్‌కోర్స్‌, పార్టీ మారాలనుకుంటే.. పాత విషయాల్ని మర్చిపోవడం పెద్ద కష్టమేమీ కాదనుకోండి.. అది వేరే విషయం.