Advertisement


Home > Politics - Political News
సమర్ధించి ఎందుకు వ్యతిరేకించారు?

తెలంగాణలో ఇప్పుడు ఓ కీలకాంశంపై ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య హోరాహోరీ పోరాటం సాగుతోంది. ఇదో పెద్ద కుంభకోణంగా ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ, ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కాంగ్రెసు పార్టీ నేత రేవంత్‌ రెడ్డి చెలరేగిపోతున్నారు. చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. కోట్ల రూపాయల ఈ కుంభకోణాన్ని తాను అన్ని ఆధారాలతో బయటపెడతానన్నారు. ఇంతకూ ఏమిటీ పోరాటం? అదేనండీ రైతాంగానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా. ఇలాంటి పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అన్ని రాష్ట్రాలు ప్రశంసలు కురిపిస్తున్నాయని, దీనిపై ఆరా తీస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు.

24 గంటలపాటు కరెంటు ఇవ్వగలగడం కాంగ్రెసు పార్టీ ఘనతేనని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాలు పూర్తి చేసిన విద్యుత్‌ ప్రాజెక్టుల మూలంగానే ఇది సాధ్యమైందని, సోనియా గాంధీ పెట్టిన భిక్షేనని వీరు ప్రచారం చేస్తున్నారు. ఇందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ కూడా ఆరోపిస్తోంది. సరే...ఇదంతా ఇలా ఉండగా టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈమధ్య ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ పథకాన్ని ఆకాశానికెత్తేశారు. ఇదో అద్భుతమని అభివర్ణించారు. అయితే తాజాగా ఎర్రబెల్లి ఈ పథకాన్ని వ్యతిరేకించినట్లు వార్త వచ్చింది.

పూర్తిగా వ్యతిరేకించలేదుగాని ఇరవైనాలుగు గంటలపాటు కరెంటు ఇవ్వడం అనవసరమని, 12 గంటలు ఇస్తే సరిపోతుందని అన్నారు. రోజంతా విద్యుత్‌ సరఫరా చేస్తే బావులు ఎండిపోతాయన్నారు. ఈ అభిప్రాయాన్ని మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఓ సభలో వెలిబుచ్చారు. టీఆర్‌ఎస్‌ నేతలెవరూ ఇప్పటివరకు ఈ పథకంపై వ్యతిరేక వ్యాఖ్యలు, సవరణలు చేసిన దాఖలా లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారనే విషయం అందరికీ తెలుసు. ఇరవైనాలుగు గంటలపాటు విద్యుత్‌ సరఫరా అనవసరమనే అభిప్రాయం రైతుల్లో, కొందరు టీఆర్‌ఎస్‌ నాయకుల్లోనూ ఉంది. రోజంతా కరెంటు ఇవ్వడంవల్ల సాగునీరు వృథా అవుతోంది.

ఎన్నికల్లో గెలుపు వరకు ప్రభుత్వ రోజంతా విద్యుత్తు ఇచ్చి ఆ తరువాత తగ్గించే ఆలోచన చేయవచ్చు. ఇక దయాకర్‌రావు విషయానికొస్తే ఇరవైనాలుగు గంటలు అక్కర్లేదని సీరియస్‌గా అన్నారో, యధాలాపంగా అన్నారో తెలియదు. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త ఫిరాయింపుదారుల్లో ఈయనొకరు. టీడీపీకి ఉన్న పదిహేనుమంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ లెజిస్లేచర్‌ పార్టీని అధికారికంగా గులాబీ పార్టీలో విలీనం చేశారు దయాకర్‌రావు. ఈ దెబ్బతో రాష్ట్రంలో టీడీపీకీ నామమాత్రపు ఉనికి మిగిలింది. కాని ఈ పని చేసినందుకు ఈ నాయకుడికి ఏం మిగిలింది? ఏమీ లేదు.

దీంతో దిక్కు తోచక, పొద్దుపోక గమ్మున కూర్చున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉత్సాహంగా చేరినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడంతో చురుకుదనం తగ్గిపోయింది. చాలామంది అనుకున్న పని జరక్కపోతే 'నెక్ట్స్‌ టైమ్‌ బెటర్‌ లక్‌' అని ఊరడిస్తారు. ఎర్రబెల్లిని కేసీఆర్‌ ఊరడించారో, తనకు తానే ఊరడించుకున్నాడో తెలియదుగాని  కొంతకాలం కిందట పార్టీ సమావేశంలో మాట్లాడుతూ 'నేను వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచే పోటీ చేసి గెలుస్తా. మంత్రిని అవుతా' అని చెప్పారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ సర్కారే ఏర్పాటవుతుందనే నమ్మకం ఉండటంతోపాటు తనకు మంత్రి పదవి దక్కుతుందనే విశ్వాసమూ ఉందన్నమాట.