cloudfront

Advertisement


Home > Politics - Political News

ఎవరి ఆత్మ.. ఎవరి గౌరవం.?

ఎవరి ఆత్మ.. ఎవరి గౌరవం.?

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.! 'పేదోడ్ని గొప్పోడిగా మార్చేందుకు మా పార్టీనే అధికారంలోకి రావాలి..' అని చెప్పని రాజకీయ పార్టీ లేదు. 'రైతే రాజు..' అని నినదించని రాజకీయ నాయకుడు లేడు. కుల రహిత సమాజం, మతాలకతీతమైన రాజకీయం.. అన్నవి మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప.. ఆ 'అద్భుతమైన సమాజం' మాత్రం వాస్తవరూపం దాల్చడంలేదు.

పెద్ద నోట్లరద్దు తర్వాత దేశంలో నల్లధనం అన్నమాటకే ఆస్కారం వుండదన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌, గతంలో చెప్పినమాట. ఇప్పుడు, ఎన్నికల సమయంలో పంచుతున్నది నల్లధనం కాక మరేమిటి.? అప్పట్లో ఓటుకు ఐదొందలు.. ఇప్పుడు వెయ్యినోటు లేకపోవడంతో, ఏకంగా 2 వేల రూపాయలకు ఓటు రేటు పెరిగింది.

కోట్లాది రూపాయల నగదు ఎన్నికల సమయంలో పట్టుబడ్తోందంటే, మన ప్రజాస్వామ్యం పాతాళానికి దిగజారిపోతున్నట్టే కదా.! కుల సంఘాలతో మీటింగులు.. మతాల వారీ ఓట్ల కోసం ప్రత్యేక సమావేశాలు.. అసలంటూ, ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోందో మాత్రం ఎవరికీ తెలియడంలేదు.

అధికారం ఎలా దుర్వినియోగమవుతోందో చూస్తూనే వున్నాం. అయినా ఓటు వెయ్యాల్సిందే. ఎందుకంటే, ఇది ప్రజాస్వామ్యం గనుక. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఓటరు అనేవాడు దేవుడిగా కన్పిస్తాడు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలూ ప్రజల్ని బానిసల్లానే చూస్తాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం.

'నోటా' ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చినా, దానికి విలువలేని పరిస్థితి. 'ఈ అభ్యర్థుల్లో ఎవరూ కాదు' అని ఓటర్లు చెప్పే మాటకు విలువ లేనప్పుడు, ఆ ఆప్షన్‌ ఎందుకు.? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో వుంది మన వ్యవస్థ. ఎన్నికల వేళ తరచూ ఆత్మగౌరవం అన్నమాట గురించి వింటుంటాం. ఇప్పుడూ వింటున్నాం.

ఒకాయన 'తెలుగు జాతి' అంటాడు, ఇంకొకాయన 'తెలంగాణ ఆత్మగౌరవం' అంటాడు. తెలుగు జాతి ఏంటి.? తమిళ జాతి ఏంటి.? తెలంగాణ ఆత్మగౌరవమేంటి.? ఆంధ్రా ఆత్మగౌరవమేంటి.? ఇదిగో, ఇక్కడే విభజన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి.

ఈ ఆత్మగౌరవం ఆయా వ్యక్తులకు పదవులు తెచ్చిపెడ్తున్నాయి తప్ప.. ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగే పరిస్థితిని మాత్రం ఏ రాజకీయ పార్టీ కల్పించలేకపోతోంది. ముందే చెప్పుకున్నాం కదా.. ఎన్నికలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌.. ఇప్పుడూ వచ్చాయ్‌.. ఎన్నికల ప్రసహనం నడిచినన్నాళ్ళూ ఓటర్లు దేవుళ్ళు.. ఆ తర్వాత గెలిచినోడే రాజు.. ఆ రాజు చెప్పిందే వేదం.! ఇదీ మన ప్రజాస్వామ్యం.!  

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్