cloudfront

Advertisement


Home > Politics - Political News

తెరాసకే పీఠమన్న ఎగ్జిట్ పోల్స్!

తెరాసకే పీఠమన్న ఎగ్జిట్ పోల్స్!

ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రీ పోల్  సర్వేలు ఒకరమైన అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. పోస్ట్ పోల్ సర్వేలు మరో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి అయిన తర్వాత వివిధ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా ఉన్నాయి..

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ లో కారు హవా కనిపిస్తోంది. కేసీఆర్ చెప్పినట్టుగా వంద సీట్లు కాదు కానీ.. గత ఎన్నికల కన్నా మూడు సీట్లను అదనంగా తెరాస సంపాదించుకుంటుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెరాస 66 సీట్లను సాధించగలని పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 37 సీట్లకు పరిమితం అవుతుందని, బీజేపీ ఏడు సీట్లు ఇతరులు తొమ్మిది సీట్లు సాధించగలరని టైమ్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెరాసకు మినిమం మెజారిటీ ఖాయమని పేర్కొంది.

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ మాత్రం తెలంగాణలో ఒకింత అస్పష్టమైన ఫలితాలు ఉండవచ్చని పేర్కొంది. తెరాస 50 నుంచి 65 సీట్లను పొందగలదని, మహాకూటమి 38 నుంచి 52 సీట్లను నెగ్గుతుందని, బీజేపీ నాలుగు నుంచి ఏడు, ఇతరుల పది నుంచి పదిహేడు సీట్లను పొందుతారని రిపబ్లిక్  టీవీ అంచనా వేసింది.

సీఎన్ఎన్ న్యూస్ 18 కూడా ఇవే నంబర్లనే చెప్పింది. తెరాకు 50 నుంచి 65 అని, కూటమికి 38 నుంచి 52 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది.

తెలంగాణలో తెరాస స్వీప్ చేస్తుందని ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెరాస ఏకంగా 71 సీటు నుంచి 91 సీట్లను సొంతం చేసుకుంటుందని ఇండియాటుడే అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి కేవలం 21 నుంచి  33 సీట్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది. బీజేపీ గరిష్టంగా మూడు, మజ్లిస్ గరిష్టంగా ఏడు సీట్లు నెగ్గవచ్చని పేర్కొంది.

మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా!

మరోసారి మధ్యప్రదేశ్ లో కమలం పార్టీ హవానే కొనసాగుతుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అక్కడ బీజేపీ 126 సీట్లను సాధించుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితం అవుతుందని పేర్కొంది. బీఎస్పీ ఆరు, ఇతరులు తొమ్మిది సీట్లను నెగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక్కడ అధికారాన్ని అందుకోవాలనే కాంగ్రెస్ ఆశ కలగానే మిగిలిపోతుందని టైమ్స్ నౌ అంచనా వేసింది.

ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్ టైమ్స్ కు భిన్నంగా ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ కు 104 నుంచి 122 సీట్లు దక్కే అవకాశం ఉందని ఇండియాటుడే అంచనా వేసింది. ఇదే సమయంలో బీజేపీకి కూడా 102 నుంచి 120 సీట్లకు మధ్యలో వస్తాయని ఇండియాటుడే అంచనా వేసింది. అక్కడ పోటాపోటీ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ రాష్ట్రంలో పోటాపోటీ పరిస్థితి ఉందని ఆజ్ తక్ కూడా పేర్కొంది. అన్ని ప్రముఖ ఎగ్జిట్ పోల్ ఫలితాలనూ కలుపుకుని భాగించి చూస్తే మధ్యప్రదేశ్ లో బీజేపీ 115 సీట్లు కాంగ్రెస్ 105 సీట్లు సాధించే అవకాశాలున్నాయి. బీఎస్పీ రెండు, ఇతరులు ఎనిమిది సీట్లలో నెగ్గవచ్చు.

చత్తీస్ గడ్ లోనూ కమలమే!

చత్తీస్ గడ్ లో 90 సీట్లకు గానూ 46 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంటుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. కాంగ్రెస్ 35, బీఎస్పీ ఏడు సీట్లకు పరిమితం అవుతాయని అంచనా వేసింది. చత్తీస్ గడ్ లో బీజేపీ 46 నుంచి 50 సీట్లను సంపాదించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఇండియా టీవీ సర్వే అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మినిమం మెజారిటీ సంపాదిస్తుందని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీ 39 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ఇండియాటుడే అంచనా వేసింది. దీని లెక్కల ప్రకారం కాంగ్రెస్ కు అక్కడ 55 నుంచి 65 సీట్లను సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.

రాజస్తాన్ కాంగ్రెస్ దే!

రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ మినిమం మెజారిటీని సాధించడం ఖాయమని టైమ్స్ నౌ అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 105 సీట్లు దక్కే అవకాశం ఉందని, బీజేపీకి ఇక్కడ ఎదురుదెబ్బే అని.. కమలం పార్టీ ఇక్కడ 85 సీట్లకు పరిమితం కావొచ్చని టైమ్స్ అధ్యయనం అంచనా వేసింది. బీఎస్పీ రెండు సీట్లలో , ఇతరులు ఏడు చోట్ల నెగ్గవచ్చని పేర్కొంది.

రాజస్తాన్ లో హస్తం భారీ విజయాన్ని సాధిస్తుందని ఇండియాటుడే పేర్కొంది. ఆ పార్టీకి ఏకంగా  119 నుంచి 141 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఇండియాటుడే అంచనా వేసింది. బీజేపీ 55 నుంచి 72 సీట్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది. రాజస్తాన్ విషయంలో దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నాయి.