cloudfront

Advertisement


Home > Politics - Political News

'అమ్మ' పార్టీ కథ క్లైమాక్స్ కు వచ్చిందా!

'అమ్మ' పార్టీ కథ క్లైమాక్స్ కు వచ్చిందా!

తమిళనాట అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో చాలావరకూ దెబ్బతింటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. ఈపీఎస్-ఓపీఎస్ ల సారధ్యంలోని అన్నాడీఎంకే వివిధ పార్టీలతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లింది. విజయ్ కాంత్ పార్టీ, బీజేపీలతో కలిసి పోటీచేసింది. అయినా ఈ కూటమికి దక్కేది మూడు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి ఎలా ఉందో వివరించనక్కర్లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ కుప్పకూలడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ సార్వత్రిక ఎన్నికలతో అన్నాడీఎంకే కథ క్లైమాక్స్ కు వచ్చిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి.

తమిళనాట గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు అన్నాడీఎంకే స్వీప్ చేసింది. డీఎంకేను చిత్తు చిత్తు చేసింది. లోక్ సభలో డీఎంకేకు కనీసం ప్రాతినిధ్యమే లేకుండా పోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈసారి అన్నాడీఎంకేకు లోక్ సభలో ప్రాతినిధ్యం లభించడం కష్టంగా మారే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి.

అలాగే తమిళనాట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. వాటిల్లో గనుక డీఎంకే స్వీప్ చేస్తే అన్నాడీఎంకే ప్రభుత్వం మనుగడ కూడా కష్టం అవుతుంది. డీఎంకే టైమ్ మొదలవుతుంది. స్టాలిన్ వెనువెంటనే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. స్టాలిన్ కే సీఎం పీఠం దక్కితే వెంటనే అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లినా వెళ్లగలడు.

అయితే తమిళనాడు రాజకీయాలను జయలలిత మరణించాకా కేంద్రంలోని మోడీ సర్కారు శాసిస్తూ ఉంది. కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు గనుక వస్తే డీఎంకే వాళ్లు వారికి అనుకూలంగా వ్యవహరిస్తే తప్ప రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. గవర్నర్ పాలన వంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే.. కేంద్రంలో డీఎంకేకు అనుకూలమైన సర్కారు ఉండాల్సిందే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం