cloudfront

Advertisement


Home > Politics - Political News

యెల్లో థియరీ: నందమూరితో 'నారా'జకీయం!

యెల్లో థియరీ: నందమూరితో 'నారా'జకీయం!

బావమరిది నందమూరి బాలకృష్ణను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తన కుమారుడు నారా లోకేష్‌ని మాత్రం, 'నామినేటెడ్‌' కోటాలో శాసనమండలికి పంపి, మంత్రిని చేశారు. 'నందమూరి' కుటుంబంపై 'నారా' చంద్రబాబుకి వున్న అపారమైన అభిమానానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇప్పుడు, కూకట్‌పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినితో పోటీ చేయించేందుకు రంగం సిద్ధంచేశారు చంద్రబాబు.

కూకట్‌పల్లి నుంచి టీడీపీ తరఫున పలువురు పోటీ పడ్తున్నారు. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని, నియోజకవర్గంలో పార్టీ బాగు కోసం ప్రయత్నిస్తోన్న వారందర్నీ పక్కనపెట్టి, టీడీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డిని తొలుత చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆ పెద్దిరెడ్డికీ హ్యాండిచ్చి, సుహాసినితో పోటీ చేయించబోతున్నారిప్పుడు చంద్రబాబు.

నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు గనుక, ఆ సానుభూతి సుహాసిని మీద వర్కవుట్‌ అయితే, ఎమ్మెల్యేగా ఆమెకు ఛాన్స్‌ ఇచ్చినట్లవుతుందన్నది చంద్రబాబు ఆలోచన కావొచ్చు. కానీ, కూకట్‌పల్లి నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా వున్నాయో, 'ఇంటెలిజెన్స్‌' నివేదికలు చంద్రబాబు తెప్పించుకోకుండా వుంటారా.? అన్నీ తెలిసే, సుహాసినిని రాజకీయ తెరపైకి చంద్రబాబు తీసుకొస్తున్నారు.

బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌.. సుహాసిని తరఫున ప్రచారం నిర్వహించినా, కూకట్‌పల్లిలో ఆమె గెలుపు అంత తేలికకాదు. 'లక్కు' కలిసొచ్చి గెలిచినా, తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకునేంత రాజకీయ అనుభవం సుహాసినికి వుంటుందని అనుకోలేం.

ఎందుకంటే, ఆమె రాజకీయాలకు కొత్త. కూకట్‌పల్లి నుంచి 2014 ఎన్నికల్లో అప్పటి టీడీపీ నేత మాధవరం కృష్ణారావు గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి మాధవరం కృష్ణారావు బరిలో నిలిచారు.

కమ్మ సామాజిక వర్గం ఓటర్లు, సీమాంధ్ర ఓట్లు.. వీటన్నిటికీ మించి నందమూరి అభిమానులే కూకట్‌పల్లిలో టీడీపీని గెలిపించేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారంటే.. అది నమ్మగలిగే విషయమే కాదు. పార్టీలో నందమూరి కుటుంబానికి 'అవకాశం' ఇస్తున్నామని చెప్పుకోవడానికే చంద్రబాబు ఈ 'సిల్లీ' ఎత్తుగడ వేశారు.

సుహాసిని పేరు తెరపైకి రావడంతో, ఇతర రాజకీయ పార్టీలు 'అయ్యోపాపం నందమూరి కుటుంబం'' అంటూ కాస్తంత జాలి చూపించాల్సిన పరిస్థితి దాపురించింది. నందమూరి తారకరామారావు నుంచి టీడీపీని లాగేసుకున్న నారా చంద్రబాబు, ఆ నందమూరి కుటుంబంపై ఇంకా 'నారా'జకీయాన్ని ప్రయోగిస్తూనే వుండడం శోచనీయం.  

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్