cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

చివ‌రికి ఆయ‌నొక్కరే మిగులుతారేమో!

చివ‌రికి ఆయ‌నొక్కరే మిగులుతారేమో!

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హారశైలి చూస్తుంటే ...ఎన్నిక‌ల సంఘం కార్యాల‌యంలో చివ‌రికి ఆయ‌నొక్కరే మిగిలేలా ఉన్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 

త‌న కార్యాల‌యంలో ప‌నిచేసే ఏ ఒక్క ఉద్యోగిపై న‌మ్మ‌కం లేకుంటే, ఇక ఆయ‌నకు ఎవ‌రిపై న‌మ్మ‌కం ఉన్న‌ట్టు? ఇంత‌కూ త‌న‌పై త‌న‌కైనా న‌మ్మ‌కం ఉందా?  లేదా? అనే అనుమానం ఎవ‌రికైనా క‌లిగితే ... అది నిమ్మ‌గ‌డ్డ త‌ప్పే అవుతుంద‌న్న అభిప్రాయాలున్నాయి.

ఎన్నిక‌ల సంఘం అంటే స్వ‌యంప్ర‌తిప‌త్తి గ‌ల రాజ్యాంగ సంస్థ అనడంలో ఎవ‌రికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే అందులో ప‌ని చేయ‌డానికి ఆకాశం నుంచి ఎవ‌రూ దిగిరార‌నే వాస్త‌వాన్ని నిమ్మ‌గ‌డ్డ గ్ర‌హించిన‌ట్టు లేర‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి. 

రోజుకో వివాదాస్ప‌ద నిర్ణ‌యంతో ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ వైఖ‌రిని ఆయ‌న కోరుకుంటున్న‌ట్టు ...నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే చెబుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను అడ్డుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నారనే అనుమానంతో నిన్న రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సంయుక్త సంచాల‌కుడు (జేడీ) జీవీ సాయిప్ర‌సాద్‌ను విధుల నుంచి తొల‌గించారు. 

ఈ చ‌ర్యే వివాదాస్ప‌ద‌మైన నేప‌థ్యంలో, అలాంటిదే మ‌రొక నిర్ణ‌యాన్ని నేడు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ తీసుకోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్య‌ద‌ర్శి వాణీమోహ‌న్‌ను కూడా తొల‌గిస్తూ, ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేశారు.

వాణీ మోహ‌న్ సేవ‌లు త‌న‌కు అవ‌స‌రం లేదంటూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్‌దాస్‌కు ఎస్ఈసీ నేడు లేఖ రాశారు. త‌న కార్యాల‌యం నుంచి ఆమె రిలీవ్ కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. ఎస్ఈసీ కార్యాల‌యంలో ప‌నిచేసే ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వ‌మే నియ‌మిస్తుంద‌నే నిజాన్ని ముందుగా ఎస్ఈసీ జీర్ణించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏ ఉద్యోగికి వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాలుండ‌వు. ప్ర‌భుత్వ విధానాలకు అనుగుణంగానే న‌డుచుకుంటారు. ఎస్ఈసీ హూందాగా వాళ్ల‌తో ప‌నిచేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని ప్ర‌తి ఉద్యోగిని అనుమాన చూపుల‌తో చూస్తే ...అంద‌రూ త‌న వ్య‌తిరేకులుగానే క‌నిపిస్తారు. 

ఒక‌వేళ త‌నకు న‌మ్మ‌క‌మైన ప‌ని మ‌నుషులు కావాలంటే టీడీపీ నుంచో, మ‌రే ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీల కార్యాల‌యాల నుంచో రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

అలా చేసుకోవాల‌ని నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌న‌సులో కోరిక ఉన్నా, సాధ్యం కాద‌ని కూడా ఆయ‌న‌కు బాగా తెలుసున‌ని కూడా వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తన ప‌ద‌వీ కాలం మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే. ఈ లోపు తాను అనుకున్న‌ట్టు పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని ప‌క్షంలో ....  ఇలాంటి వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు ఇంకెన్ని తీసుకుంటారోన‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

 


×