cloudfront

Advertisement


Home > Politics - Political News

గల్లా జయదేవ్.. శ్రీరంగ నీతులు..!

గల్లా జయదేవ్.. శ్రీరంగ నీతులు..!

ఏపీ ప్రజలు ఇలాంటి డ్రామాలను చాలానే చూశారని.. గల్లా జయదేవ్ కు తెలియనట్టుగా ఉంది పాపం. వెనుకటికి సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్ మన్లు, లాస్టు బంతికి సిక్స్ కొడతామన్న వాళ్లను చూశాం.. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు తయారయ్యారు. వెనుకటికి కాంగ్రెస్ వాళ్లు.. విభజన పాపం చంద్రబాబుదే, జగన్ మోహన్ రెడ్డిదే అని అంటూ.. చివరకు చెక్కలోకి పోయారు. కేసీఆర్ ను తిడుతూ, చంద్రబాబును తిడుతూ, జగన్ ను తిడుతూ.. నాటి కాంగ్రెస్ వాలాలు రాష్ట్రాన్ని దగ్గరుండి ముంచారు. 

చివర్లో ఏదో నాటకం ఆడదామని అనుకున్నారు కానీ.. అక్కడ తేడాకొట్టేసింది. ఇప్పుడు అలాంటి పనులే చేస్తున్న తెలుగుదేశం వాళ్లు.. జనాల చెవుల్లో పూలు పెట్టే పనులు చేస్తూ పోతున్నారు. నాలుగేళ్ల సంగతెలా ఉన్నా.. ఒక్క ప్రసంగంతో గల్లా జయదేవ్ ను టీడీపీ అనుకూల మీడియా హీరోని చేసేసింది. ఇదే అదునుగా.. తెలుగుదేశం వాళ్లు ఆయనకు సన్మానాలు మొదలుపెట్టారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని అన్నారట. ఇదే గొప్పఅట. సాధించింది ఏమిటి? అంటే.. ఏమీలేదు. ప్రసంగించారని సన్మానాలు. 

ఇక ఈ సన్మానాల్లో గల్లా జయదేవ్ మా గొప్పగా మాట్లాడుతున్నాడులే. ఈయన ఏమంటాడంటే.. ‘వైకాపా వాళ్లు వెళ్లి బీజేపీతో చేతులు కలుపుదామని చూస్తున్నారు..’ అని తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి జనాలు ఈ టీడీపీ లీడర్ల లెక్కలో ఎంతటి వెర్రివాళ్లో ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వైకాపా వాళ్లు వెళ్లి బీజేపీతో చేతులు కలపాలని చూడటం పాపం.. అది ద్రోహం. మరి తెలుగుదేశం చేసింది ఏమిటి? చేస్తోంది ఏమిటి? నాలుగేళ్లుగా బీజేపీతో తెలుగుదేశం చేతులు కలిపే ఉన్నాయి కదా. 

నాలుగేళ్ల నుంచి జరిగిన ద్రోహంలో తెలుగుదేశం పార్టీ పాత్ర లేదా? అంతవరకూ ఎందుకు.. ఇప్పుడు చేస్తోంది ఏమిటి? బీజేపీని ఇన్నిమాటలు అంటూ.. ఎన్డీయేలో తెలుగుదేశం కొనసాగడం లేదా? మంత్రి పదవులు తీసుకోలేదా? బీజేపీతో తెగదెంపులు చేసుకునే ధైర్యం తెలుగుదేశం చేస్తోందా? చేయగలదా అసలు? ఇవన్నీ వదిలేసి.. ‘వైకాపా వెళ్లి బీజేపీతో చేతులు కలపాలని చూస్తోంది..’ అని ఏడవడం ఏమిటో అర్థం కావడం లేదు. 

తెలుగుదేశం వాళ్లు ముందు తమ నిజాయితీని నిరూపించుకోవాలి. తర్వాత వేరే వాళ్లపై కామెంట్లు చేయాలి. అంతేకానీ, చెప్పేదీ శ్రీరంగ నీతులు చేసేది.. అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం కామెడీ అయ్యేది వీళ్లే!