cloudfront

Advertisement


Home > Politics - Political News

మహేష్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న గల్లా

మహేష్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న గల్లా

మహేష్ బాబు వివాదాలకు పూర్తిగా దూరం. అలాంటి వ్యక్తి రాజకీయాలకు దగ్గరవ్వాలనుకుంటారా? కచ్చితంగా దూరంగానే ఉంటారు. 2014లో సొంత బావ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నా కూడా మహేష్ బాబు ప్రచార కార్యక్రమాలకు రాలేదు. కనీసం తన సందేశం కూడా వీడియో ఆడియో రూపంలో బైటకు విడుదల చేయలేదు. పార్టీ కండువాలతో ఎప్పుడూ ఫొటోలు దిగలేదు. కేవలం ట్విట్టర్ లో మాత్రం తన బావని గెలిపించండి అంటూ మెసేజ్ పెట్టారు, అది కూడా పార్టీ పేరెత్తకుండా.

అలాంటి మహేష్ బాబుకి ఆయన బావ గల్లా జయదేవ్ బలవంతంగా రాజకీయ రంగు పులిమేందుకు సిద్ధమయ్యారు. ఓటమి భయంతో ఉన్న జయదేవ్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు. వైసీపీకి చెందిన ప్రత్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో ఈ దఫా ఓటమి ఖాయమని తేలడంతో చిన్నగా మహేష్ ని రంగంలోకి దించాలని చూస్తున్నారు జయదేవ్. అయితే మహేష్ మాత్రం ప్రచారాలకు ఒప్పుకోలేదు. కావాలంటే ఈసారి కూడా ట్విట్టర్లో పోస్ట్ లు పెడతానని, అంతవరకే తాను సహాయం చేయగలనని, అంతకుమించి ఏదీ ఆశించొద్దని స్పష్టంచేశారు.

అయినా సరే గల్లా మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. కేంద్రంపై తాను చేస్తున్న పోరాటాలను ఆపేందుకే తనపై ఐటీ రైడ్స్ జరిగాయని, మహేష్ బాబుని కూడా అందుకే టార్గెట్ చేశారని అంటున్నారు గల్లా. గుంటూరు నియోజకవర్గంలో తానుచేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఓ పుస్తకం విడుదల చేసిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య జీఎస్టీ అధికారులు మహేష్ బాబు బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో 2007-2008 ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్న పారితోషికానికి సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని మహేష్ బాబుకి చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేశారు.

ఆ తర్వాత మహేష్ బాబుకి సంబంధించిన సినిమా హాల్ పై కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే దీనిపై మహేష్ పెద్దగా స్పందించ లేదు, బాధపడలేదు, రాజకీయ కోణం వెదకలేదు. కానీ ఆయన బావ గల్లా జయదేవ్ కి మాత్రం ఈ సబ్జెక్ట్ ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఐటీరైడ్స్ జరిగినప్పుడు నోరుమెదపని జయదేవ్, తీరా ఎన్నికల ముందు ఈ విషయాన్నే ఎందుకు హైలెట్ చేస్తున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశం. మహేశ్ బాబు పేరు చెప్పుకుని, ఆయన ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి, కేంద్రం మహేష్ బాబుపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ప్రచారం చేసి తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు జయదేవ్. 

సీట్ల కేటాయింపులో జగన్‌ నేర్పరితనం!