cloudfront

Advertisement


Home > Politics - Political News

గల్లీ మోడీ, ఢిల్లీ బాబు.. పోలిక చాలా సిల్లీ.!

గల్లీ మోడీ, ఢిల్లీ బాబు.. పోలిక చాలా సిల్లీ.!

ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో నిన్న పర్యటించారు. అలా ఆయన రావడాన్ని 'గల్లీ' వ్యవహారంగా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తోంది. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఒక్కరోజు దీక్షకు దిగడాన్ని ఓ రేంజ్‌లో అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు. తెలుగు మీడియాకి సంబంధించి మెజార్టీ మీడియా సంస్థలూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హమిక్కడ. అఫ్‌కోర్స్‌, ఆ మీడియా సంస్థల్ని మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అనుకోండి.. అది వేరే విషయం.

ఢిల్లీ వేదికగా చంద్రబాబు, నరేంద్రమోడీపై నిప్పులు చెరిగేశారు.. అదీ ఒకరోజు దీక్ష ప్రారంభిస్తూనే. విడతల వారీ ప్రసంగాలతో చంద్రబాబు అండ్‌ టీమ్‌, ఈ దీక్షా ప్రాంగణంలో హోరెత్తించేస్తున్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా నరేంద్రమోడీ తన స్థాయిని దిగజార్చేసుకున్నారనీ, 'గల్లీ లీడర్‌' తరహాలో మోడీ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయని టీడీపీ మహిళానేత అనురాధ ఆరోపించారు.

అయితే, చంద్రబాబు ఏమన్నా తక్కువ తిన్నారా.? 'వెన్నుపోటు' గురించి మోడీ ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు, నరేంద్రమోడీ సతీమణి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. 'తాళికట్టి, ఆ తర్వాత ఆమెను దూరంపెట్టిన మోడీ, విడాకులు ఇవ్వకుండా వేధించారు' అంటూ విరుచుకుపడిపోయారు. మరి, ఇక్కడ చంద్రబాబు స్థాయి ఢిల్లీకి పెరిగిందా.? పాతాళానికి పడిపోయిందా.? టీడీపీ నేతలే సమాధానం చెప్పాల్సి వుంటుంది.

2014 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఢిల్లీలో హల్‌చల్‌ చేశారు.. అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సెగల నేపథ్యంలో. 'విభజన అన్యాయం, అక్రమం..' అంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టారు. ఎన్నికలకు ముందర ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అప్పుడు అలా దీక్ష చేయబట్టే, ఆంధ్రప్రదేశ్‌లో తమకు అధికారం దక్కిందని గట్టిగా నమ్ముతున్న చంద్రబాబు, ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్‌ని అప్లయ్‌ చేశారు తప్ప.. ఆంధ్రప్రదేశ్‌ పట్ల చంద్రబాబుకి అసలు చిత్తశుద్ధే లేదన్నది మెజార్టీ అభిప్రాయంగా కన్పిస్తోంది.

నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగి, ఎన్డీయే ప్రభుత్వంలో బాగస్వామిగా మెలిగి, ప్రత్యేకహోదా గురించీ, విభజన హామీల గురించీ గొంతువిప్పని తెలుగు తమ్ముళ్ళు.. ఇప్పుడు ఢిల్లీలో పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే జనం గుడ్డిగా నమ్మేస్తారా.? నమ్ముతారన్నది చంద్రబాబు విశ్వాసం. 'పెద్దయెత్తున జనం తరలివచ్చారు చంద్రబాబు దీక్షకు మద్దతుగా..' అంటూ 'యెల్లో మీడియా' ప్రచారం చేస్తోందిగానీ, ఇక్కడో చిన్న కరెక్షన్‌ వుంది.. అదేంటంటే, 'తరలించారు' అనాల్సి వుంది.. 'తరలివచ్చారు' అనడానికి బదులు.

గల్లీ నుంచి ఢిల్లీకి జనాన్ని మోసుకెళితే, చంద్రబాబు ఢిల్లీ స్థాయి నాయకుడైపోతారనీ, ఆయన తన రాజకీయ లబ్దికోసం ప్రత్యేకహోదా నినాదంతో ఢిల్లీలో దీక్ష చేస్తే.. జాతీయస్థాయి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తాయని అనుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?