cloudfront

Advertisement


Home > Politics - Political News

గోరంట్ల మాధవ్‌ హీరోయిజం.. టీడీపీ పుణ్యమే.!

గోరంట్ల మాధవ్‌ హీరోయిజం.. టీడీపీ పుణ్యమే.!

కెలికి మరీ తెలుగుదేశం పార్టీ, తమ ప్రత్యర్థిని మరింత బలోపేతం చేస్తోంది. అవును మరి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌.. ఇప్పుడింత బలంగా తయారయ్యారంటే దానికి కారణం చంద్రబాబే కదా.! అప్పుడెప్పుడో మంత్రి పదవి అడిగితే కాదన్నారని కేసీఆర్‌, టీడీపీని వీడారు. అది అందరికీ తెల్సిన విషయమే. ఆ తర్వాత కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ స్థాపించి తెలంగాణ ఉద్యమ జెండాని భుజానికెత్తుకుని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేశారు. ఇప్పుడు చంద్రబాబుకే కొరకరాని కొయ్యిలా తయారయ్యారు. 

మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ని ఆడిపోసుకుని, చంద్రబాబు ఏం సాధించారు.? కానీ, చంద్రబాబు అలా రంకెలు వేయడం కేసీఆర్‌కి కలిసొచ్చింది. చంద్రబాబు అత్యుత్సాహం ఇలాగే వుంటుంది మరి.! చంద్రబాబుతో అంటకాగినందుకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్ధానమైపోయే పరిస్థితి దాపురించింది. కేసీఆర్‌, తెలంగాణ సంగతులు పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్ని బలోపేతం చేసే పనిలో చంద్రబాబు అండ్‌ టీమ్‌ బిజీగా వున్నారిప్పుడు. 

పోలీస్‌ అధికారి గోరంట్ల మాధవ్‌పై అప్పట్లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. దానికి గోరంట్ల మాధవ్‌ పోలీస్‌ పౌరుషం చూపించారు. అప్పట్లో అధికార పార్టీ నేతలు మాధవ్‌పై మండిపడ్డారు.. ఆత్మాభిమానం దెబ్బతినడంతో గోరంట్ల మాధవ్‌, ఉద్యోగానికి రాజీనామా చేసి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడాయన హిందూపురం ఎంపీ అభ్యర్థి.. వైఎస్సార్సీపీ తరఫున. 

'బస్తీమే సవాల్‌.. నా మీద గెలిచే దమ్ముందా.?' అని మాధవ్‌ ఇప్పుడు నేరుగా, తెలుగుదేశం పార్టీనే ప్రశ్నిస్తున్నారు. పైగా, తన వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద పదవీ విరమణ) విషయంలో అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ గోరంట్ల మాధవ్‌ మండిపడుతున్నారు. ఈ ఎపిసోడ్‌ అనంతపురం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిందిప్పుడు. 

ఒక్క మాటలో చెప్పాలంటే, గోరంట్ల మాధవ్‌ ఇమేజ్‌ రాత్రికి రాత్రి పదింతలైపోయింది. హిందూపురం ఎంపీ సీటుని గెల్చుకోవడమే కాదు, ఆ పరిధిలో వున్న మెజార్టీ ఎమ్మెల్యే సీట్లనూ వైఎస్సార్సీపీ గెలుచుకునేలా పరిస్థితులు మారాయంటే అదంతా అధికార పార్టీ అత్యుత్సాహం ఫలితమే. నామినేషన్‌ వేశాక అసలు కథ మొదలవుతుందనీ, చంద్రబాబు అండ్‌ టీమ్‌ తమ తప్పులకు మూల్యం చెల్లించుకోబోతోందనీ, రాష్ట్రమంతటా ఇదే పరిస్థితులు వుంటాయనీ వైఎస్సార్సీపీ చెబుతోంది.