Advertisement

Advertisement


Home > Politics - Political News

గొయ్యి తవ్వుకుంటున్న 'దేశం'

గొయ్యి తవ్వుకుంటున్న 'దేశం'

ఏ లాభం లేకుండా శెట్టిగారు వరదజోలికిపోరు అని పాత సామెత. ఇది ఎవరి మనో భావాలు దెబ్బతీయడం కోసం చెబుతున్నది కాదు. ఒకప్పటి సామెత ఇది. ఈ తరంలో ఇది రాజకీయ నాయకులకు అన్వయించుకోవచ్చు. ఏ లాభం లేకుండా రాజకీయ నాయకులు స్టేట్ మెంట్ ఇవ్వరు అని మార్చుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు లాంటి అధికారలాలస అపారంగా కలిగిన రాజకీయ నాయకులు ఓ మాట విసిరినా, ఓ చర్యకు ఒడికట్టినా దాని వెనుక అర్థం పరమార్థం వేరుగా వుంటాయి.

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఏ మతస్థులు అయినా అన్ని ప్రార్థనా స్థలాలు సందర్శిస్తారు. ఆయా మతాల గెటప్ లు వేస్తారు. కానీ చిత్రంగా అవసరం అయినపుడు మాత్రం ఏ మతానికో ఏదో అయిపోయిందంటూ నానా గత్తర చేస్తారు. ఇది మన దౌర్భాగ్యం. భారతదేశం కర్మ భూమి. కానీ కులాలు, మతాలుగా విడిపోయిన ఖర్మభూమిగా మార్చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు.

కులాల ప్రాతిపదికగా ప్రాంతీయం

ప్రాంతీయ పార్టీలు ఎప్పుడయితే స్థానిక అంశాలు అంతకన్నా ముఖ్యంగా కులాల ప్రాతిపదికగా పురుడుపోసుకున్నాయో, అప్పటి నుంచి జాతీయ పార్టీలకు ఈ దేశంలో మనుగడలేకుండా పోయింది. తమిళనాట నుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా ఆంధ్ర వరకు చాలా ప్రాంతీయ పార్టీల పుట్టుక వెనుక కులాల సమీకరణలే కారణాలు తప్ప వేరు కాదని అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో జాతీయ పార్టీలకు మనుగడ ఎలా? అందుకే అందులోంచి పుట్టుకువచ్చిందే కీలకమైన హిందూత్వ వాదం.

రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలు దాదాపుగా హస్త గతం చేసుకోవడంతో,జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల కరుణ, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చింది. కాంగ్రెస్ లౌకిక పునాదుల మీద పుట్టి పెరిగిన పార్టీ కావడంతో సంప్రదాయ రాజకీయ విధానాలనే పాటిస్తూ ముందుకు సాగలేక సాగిలపడిపోయింది. కానీ హిందూత్వ పునాదుల మీద ఏర్పడిన భారతీయ జనతా పార్టీ చాలా తెలివిగా పాచికలు విసురుతూ అధికారంలోకి వచ్చింది. మోడీ, అమిత్ షాల సారథ్యంలో ఓ తెలివైన వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా.

భాజపా వ్యూహం

ఏ ప్రాంతీయ పార్టీల కారణంగా అయితే జాతీయ పార్టీల మనుగడకు ప్రమాదం ఏర్పడిందో, ఆ ప్రాంతీయ పార్టీలను బలహీనం చేస్తూ ముందుకు సాగడమే ఈ వ్యూహం. ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు ఇలా చాలా చోట్ల ఇదే వ్యూహం అమలు చేసారు. కర్ణాటక, కేరళ, బెంగాల్ ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రయత్నించడం లో భాగంగా హిందూత్వ అస్త్రాన్ని బలంగా వాడుతున్నారు. అందుకోసం అందుబాటులోకి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.

క్రిస్టియానిటీ మూలాలు వున్న నాయకుడు అనే ముద్ర వున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వుండడం, అతగాడి ఏ విధంగా అవకాశం దొరికినపుడల్లా అప్రతిష్ట పాలు చేయాలా?అనే ఆలోచనలో వున్న తెలుగుదేశం ప్రతిపక్షంగా వుండడం తో భాజపా పని సులువు అయ్యేలా కనిపిస్తోంది. ఆంధ్రలో బలపడడానికి భాజపా ముందుగా విసిరిన పాచిక కాపులను అందరినీ ఓ పక్కకు చేర్చడం. 

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకోవడం, అలాగే కన్నా లక్ష్మీనారాయణను, ఆపై సోము వీర్రాజును పార్టీ ప్రాంతీయ నేతలుగా తీసుకురావడం. ఇప్పుడు ఓ అంకం ముగిసింది. మూడు పార్టీలు కమ్మ, కాపు, రెడ్డి కులాల ప్రాతిపదికగా మారిపోయాయి. ఇక మిగిలింది ఇతర కులాల ఓట్లు. కానీ ఇక్కడ భాజపా ఆట సాగదు. టోటల్ గా నిలువుగా చీల్చాలి అంటే మిగిలిన అంశం ఒక్క మతం మాత్రమే.  అందుకే ఆ దిశగా ప్రయాణం ప్రారంభించారు.

అసలు ఏం జరుగుతోంది?

వైఎస్ జగన్ కుటుంబానికి క్రైస్తవ మూలాలు వుండి వుండొచ్చు. కానీ ఆయన హిందూ విశ్వాసాలను ఎంతలా పాటిస్తారో చిరకాలంగా చూస్తూనే వున్నాం. పాదయాత్ర అనంతరం నడచి తిరుమలకు వెళ్లడం అన్నది అందరికీ గుర్తున్నదే. శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానంద కు, తిరుపతి రమణ దీక్షితులకు, చినజీయర్ స్వామికి ఇచ్చిన ప్రాధాన్యత తెలిసిందే. 

ఆ సంగతి అలా వుంచితే, కోరి హిందువులతో కయ్య తెచ్చుకునే పని, వారి మనోభావాలు దెబ్బతీసే పని జగన్ ఎందుకు చేస్తారు? అధికారంలో వున్న వ్యక్తి ఇలా చేసి, తనను తాను ఇరుకునపెట్టుకుంటారు? అని మెడ మీద తలకాయ వున్న వాడు ఎవ్వరూ నమ్మరు.

ఆ విషయం అలా వుంచితే ఏ సంఘటన అయినా జరపకుండా ఆపడం అన్నది అంత సులువు కాదు. పైగా ఎక్కడో, ఏదో మూల ఎవరో ఒకరు కావాలని చేసే సంఘటనలను అరికట్టడం అంటే ప్రతి ఒకరిద్దరికి ఓ పోలీసు వుండాలనేంత కష్ట సాధ్యం. కానీ ఇలా చేస్తే, పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. ఫలితాలు అంతకన్నా కఠినంగా వుంటాయి అనేలా ప్రభుత్వం, పోలీసు శాఖ పనితీరు వుండాలి. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వం కొంత ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే ప్రతిపక్షాలకు మరింత బలం ఇస్తోంది.

ఇంతకీ ఇది ఎవరికి లాభం?

సరే హిందూత్వ ను ఎగసం దోసి లాభపడాలని ప్రతిపక్షాలు అనుకోవచ్చు. లేదా ఆ విషయంలో అధికార పక్షం వైఫల్యం మూటకట్టుకోవచ్చు. కానీ నిజంగా ఈ వ్యవహారం ఎవరికి ఏ మేరకు లాభకరం? అన్నది చూడాలి. ఆంధ్ర ప్రదేశ్ ఓ భిన్నమైన రాష్ట్రం. ఇక్కడ ప్రజల స్పందనలు కానీ,  వ్యవహారాలు కానీ చిత్రంగా వుంటాయి. బలమైన హిందూత్వ ఇక్కడ వర్కవుట్ అవుతుందనీ లేదు. అలా అని కాదనీ లేదు. ఇక్కడ స్పందనలు అంతంతమాత్రం.

కులాల విషయంలో స్పందించినంత తీవ్రంగా, బలంగా, లోతుగా హిందూత్వ గురించి ఇక్కడ స్పందన తక్కువ. చిరకాలంగా అన్ని మతాల వారు కలిసి మెలిసి బతకడం ఇక్కడ అలవాటుగా వుంది. చీటికీ మాటికీ కొట్టేసుకొవడం అన్నది లేదు. ఇప్పుడు కొత్తగా ఈ కల్చర్ ను రుద్దే ప్రయత్నం ఎవరో చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ దానికి ఇక్కడి ప్రజలు అంత సులవుగా మొగ్గు చూపరు. అది వాస్తవం.

అయితే జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా అన్ పాపులర్ చేయడమే లక్ష్యంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ పోయిపోయి భాజపా పేటెంటెడ్ హిందూత్వ అజెండాకు మద్దతు పలుకుతోంది. ఇది ఆ పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుతుంది అన్నది చూడాల్సి వుంది.

ఆంధ్ర రాజకీయాలు

ఆంధ్ర రాజకీయాలు అనాదిగా కులాల ప్రాతిపదికగానే నడుస్తున్నాయి. ఇక్కడ జనజీవనంలో కులం భాగం అయిపోయింది. ఎంత భాగం అంటే ఇక్కడ మత మార్పిడులు జరిగినా కొత్త పేరు చివర్న కూడా శాస్త్రి, చౌదరి, నాయుడు, రెడ్డి లేకుండా వుండవు. జాకబ్ శాస్త్రి అనో, జోసఫ్ చౌదరి అనో పేర్లు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. వినిపిస్తుంటాయి. 

అంటే కులాలు వున్న మతంలోంచి కులాలు లేని మతంలోకి వెళ్లినా, కులాన్ని మాత్రం వదలడం లేదు. అదే విధంగా ఆ మతంలోకి వెళ్లినా కులాచారాలు మాత్రం వదలడం లేదు. నిత్య జీవనం దగ్గర నుంచి పెళ్లిళ్లు పేరంటాల వరకు కులాలు వీడడం లేదు. పద్దతలు మానడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రలో మత రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇది ఎంత వరకు సాధ్యం? ఎంత వరకు ఫలప్రదం? పైగా భాజపాకు కిందిస్థాయిలో పట్టు లేదు. జనాలు లేరు. ఒకరో ఇద్దరో నాయకులు తప్ప. ఆ నాయకులు కూడా మళ్లీ ఆయా ప్రాంత కులాల ప్రాతిపదికగానే తప్ప మతాల లెక్క కాదు.

అసలు ఈ హిందూత్వ మీద యాగీ చేసేవాళ్లు, కిందా మీదా అయిపోయే వాళ్ల శాతం ఆంధ్రలో ఎంత? మొత్తం ఓటింగ్ ను ఒక్క శాతం ప్రభావితం చేస్తుంది అని అనుకోవచ్చా? సరే అనుకుందాం. ఆ ఓటు ఎవరిది? భాజపాదా? తేదేపాదా? హిందూత్వ విధానాలపై మక్కువ వున్నవారు భాజపా వైపు వుంటారా? తేదేపా వైపు వుంటారా? ఈ విషయం తెలుగుదేశం పార్టీకి తెలియనిది అని అనుకోవడానికి లేదు. తెలుసు. కానీ తెలిసి కూడా భాజపా కన్నా అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తోంది? అన్నది ప్రశ్న.

దీనికి బహుశా రెండు విధాల సమాధానం చెప్పుకోవచ్చు.  ఒకటి వైకాపాను అన్ని వైపుల నుంచి ముట్టడి చేయాలనే ఆలోచనతో ఇలా చేస్తూ వుండి వుండొచ్చు. లేదా హిందూత్వ ఎజెండాను తలకెత్తుకుని, తద్వారా భాజపాకు అధినేతల మెప్పు పొంది, ఆపై ఆ పార్టీకి దగ్గర కావాలన్న ఆలోచన కూడా వుండి వుండొచ్చు. సరే, రెండింటిలో ఏదో ఒకటి వుండి వుండొచ్చు. అందుకే ఈ తరహా కార్యాచరణకు తెలుగుదేశం పూనుకుని వుండొచ్చు.

లాభమెంత? నష్టమెంత?

అయితే ఈ నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభమెంత? నష్టమెంత? ఇప్పటికే ఓట్ల శాతం ఎంత అయినా వైకాపాకు రెడ్ల ఓట్ల బ్యాంకు స్థిరంగా వుంది. రాయలసీమలో మెజారిటీ ఓట్ల బ్యాంక్ ఆ పార్టీకే వుంది. హిందూత్వ వల్ల ఇది ఏ మాత్రం దూరం అయ్యే అవకాశం వుంటుందా? అన్నది అనుమానమే. వైకాపాను క్రిస్టియన్ల పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం చేయడం ద్వారా తెలుగుదేశం ఆ వర్గపు ఓట్లను కూడా దూరం చేసుకుంటోంది అన్నది వాస్తవం. 

ఆ ఓట్లు ఎలాగూ భాజపాకు వెళ్లమన్నా వెళ్లవు. అలాగే ఈ హిందూత్వ నినాదం తలకెత్తుకోవడం, భాజపాకు మళ్లీ దగ్గర కావాలని ప్రయత్నించడం ద్వారా మైనారిటీ ఓట్లను కూడా తెలుగుదేశం దూరం చేసుకుంటోంది. ఎందుకంటే ఈ ఓట్లు కూడా భాజపాకు వెళ్లేవి కాదు.

సరే ఇక మిగిలిన ఓట్ల సంగతి చూద్దాం. బిసి లు, కాపులు, ఎస్సీ ఎస్టీలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు.  కాపులు, బిసిల ఓట్లను హిందూత్వ నినాదం ప్రభావితం చేసేది కొంత వరకే. కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ఈక్వేషన్లు మారిపోతాయి. హిందూత్వ ఆలంబనగా ఇవి ఏ పార్టీకి దగ్గరా కావు, దూరమూ కావు. మూడున్నరేళ్ల తరువాత వుండే పరిస్థితులు, రాజకీయ ఈక్వేషన్లు, అభ్యర్ధులు ఇతరత్రా వ్యవహారాలను బట్టి వుంటాయి. పైగా వీళ్లలోనూ మైనారిటీ ఓట్లు వుంటాయన్నది మరిచిపోరాదు.  మతం మారినంత మాత్రాన ఆంధ్రలో కులం మారినట్లు కాదు కదా?

ఇక హిందూత్వ వల్ల ఎక్కువ ప్రభావితం అయ్యే ఓట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఓట్లు మాత్రమే. తేదేపా ఈ హిందూత్వ నినాదాన్ని తలకెత్తుకోవడం ద్వారా ఆ ఓట్లు తమకు వస్తాయని అనుకుంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే సంప్రదాయ హిందూత్వ ఓట్లు అభ్యర్థులతో సంబంధం లేకుండా, కేడర్ తో సంబంధం లేకుండా,  భాజపాకు వెళ్తాయి. పైగా వీటిలో పోలింగ్ బూత్ కు వెళ్లేవాటికన్నా సామాజిక మాధ్యమాల్లో స్పందించేవి ఎక్కువ.

అందువల్ల గ్రౌండ్ రియాల్టీ చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఈ హిందూత్వ నినాదం తలకెత్తుకోవడం అన్నది మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువ వున్నాయి. ముస్లిం యువకులపై కేసు తీసివేస్తే, ఎవరో కోర్టుకు వెళ్తే, కోర్టు ఇది సెక్యులర్ రాష్ట్రమా అని ప్రశ్నిస్తే, అది పరోక్షంగా ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీ నేతల అనుభవానికి అందకుండా అయితే వుండదు. అందుకే అన్ని కోర్టు తీర్పులప్పుడూ కాస్త ఎక్కువ స్పందించే తెలుగుదేశం అధినేతలు ఈ తీర్పుపై మౌనం వహించారు.

పొత్తు లేకపోతే పరిస్థితి

అవతలవాడు ఓడిపోతే తాను గెలిచినట్లే కదా? అనే టైపులో తెలుగుదేశం ఆలోచిస్తోంది. వైకాపా దూరం అయిపోతే చాలు భాజపాకు తాను దగ్గరయిపోతాను అని భావిస్తోంది. కానీ అది ఎంత వరకు సాధ్యం? తాను బలపడుతున్నాను అన్న భావన భాజపాకు వస్తే చాలు తెలుగుదేశం మరింత దూరం అవుతుంది. 

భాజపా అధిష్టానానికి వైకాపా మీద ప్రేమా లేదు, తేదేపాపై ద్వేషమూ లేదు. రెండింటినీ తొక్కి తాను అధికారంలోకి రావడమే లక్ష్యం. అందువల్ల వైకాపా వీక్ అయితే తేదేపా ప్లేస్ లోకి ఆ పార్టీ తాను రావాలునుకుంటుంది కానీ, తన బలాన్ని అరువు ఇచ్చి తేదేపాను లేపాలని ఎందుకు అనుకుంటుంది? పైగా దానికి పక్కన జనసేన అధిపతి పనవ్ కళ్యాణ్ వున్నారు. 2014లో తాను వదిలేసారు. 2019లో జనం ఆయనను వదిలేసారు. 

2024 లొ కూడా ఇలా వదిలేసే కార్యక్రమం కొనసాగాలని పవన్ కళ్యాణ్ కోరుకోరు కదా? అలా కోరుకుంటే 2029 వరకు వేచి వుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే. అప్పటికి ఆయనకు 60 ఏళ్లు దాటేస్తాయి.

అందువల్ల 2024 ను పవన్ కళ్యాణ్ వదులుకోవాలని అనుకోరు. ఆ విధంగా చూసుకుంటే తేదేపాకు భాజపా దగ్గర కావడం కష్టం. మరి ఇలాంటి నేపథ్యంలో తేదేపా హిందూత్వను తలెకెత్తుకుని, దానిని ఎగసం దోయడం అన్నది ఎంత వరకు తెలివైన ఆలోచన అవుతుంది. పైగా కొంత సాలిడ్ ఓట్ బ్యాంకును శాశ్వతంగా దూరం చేసుకుంటూ కూడా.

మరో మార్గం లేదు

కానీ జగన్ ను ఢీకొనడానికి, వైకాపాను కాళ్లు పట్టుకుని కిందకు లాగడానికి తేదేపాకు మరో వ్యూహం కనిపించడం లేదు. జనాన్ని రెచ్చగొట్టి ముందుకు నడిపించేందుకు మరే కారణమూ కనిపించడం లేదు. అందువల్ల ఏ వంక లేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్న సామెతగా వుంది తెలుగుదేశం పరిస్థితి. కానీ ఆపరేషన్ అవసరమైన దానికి జండూ బామ్ పూసి సరిపెట్టడం లాంటది. తాత్కాలిక ఉపశమనం తప్ప, శాశ్వత ఫలితం ఇవ్వదు. పైగా ఈ లోగా జబ్బు ముదిరిపోతుంది.

తెలుగుదేశం పార్టీ హిందూత్వ నినాదాన్ని ఎంత బలంగా తలకెత్తుకుంటే ఆ పార్టీ కి శాశ్వతమైన నెగిటివ్ ఓట్ బ్యాంక్ ఏర్పాటు కావడం అన్నది తథ్యం. అలా ఒక నెగిటివ్ ఓటు బ్యాంక్ అంటూ తయారైపోతే, అది తెలుగుదేశం పార్టీకి అత్యంత దురదృష్టవంతమైన విషయంగా మారిపోవడం గ్యారంటీ. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంత తొందరగా గమనిస్తే అంత మంచింది.

చాణక్య

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?