
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ పచ్చ జెండా ఊపింది. ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 8న అంటే రేపు ఏపీ వ్యాప్తంగా యధాతథంగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే పరిషత్ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, మరో షరతు విధించడం గమనార్హం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
ఈ నెల ఒకటిన ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న రోజే గత ఏడాది ఆగిపోయిన పరిషత్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 8న పరిషత్ ఎన్నికలు, అవసరమైతే 9న రీపోలింగ్, 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం నాలుగు వారాల కోడ్ అమలు చేయకుండా ఎస్ఈసీ ఎన్నికలకు వెళ్లిందంటూ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ డివిజన్ విచారించింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదనే వాదనతో ఏకీభవిస్తూ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ వేసింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో డివిజన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించింది.
ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఇక్కడో కండీషన్ పెట్టింది. ఫలితాలను మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పెండింగ్‌లో పెట్టాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 10న కౌంటింగ్ చేపట్టే అవకాశం లేదు. మరోవైపు ప్రభుత్వం ఎన్నికల ఏర్పాట్లో నిమగ్నమైంది. దీంతో రేపటి పరిషత్ ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి.
పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా
నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను