cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సీమ‌లో సేద్యంపై మ‌ళ్లీ పెరిగిన ఆద‌ర‌ణ‌!

సీమ‌లో సేద్యంపై మ‌ళ్లీ పెరిగిన ఆద‌ర‌ణ‌!

ద‌శాబ్దాలుగా సాగుకు నోచుకోని భూముల్లో మ‌ళ్లీ నాగ‌లి క‌డుతున్నారు... వ్య‌వ‌సాయం ఇక క‌ష్ట‌మ‌నుకున్న చోట మ‌ళ్లీ నాట్లు ప‌డుతున్నాయి.. పుష్క‌ల‌మైన వ‌ర్షాలు, క‌రోనాతో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న వారి ఉపాధి దెబ్బ‌తిన‌డం.. ఈ క్ర‌మంలో వ్య‌వ‌సాయం ప‌ట్ల ఆద‌ర‌ణ పెరుగుతూ ఉంది. భూమికి మ‌ళ్లీ విలువ పెరుగుతోంది! రాయ‌ల‌సీమ‌లో ఇప్పుడు ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన దృశ్యం ఆవిష్కృతం అవుతోంది!

మొన్న‌టి వ‌ర‌కూ రాయ‌ల‌సీమ‌లోని కొన్ని ఊళ్ల‌లో భ‌విష్య‌త్తు ఏమిటి? అనేది ఒక స‌మాధానం లేని ప్ర‌శ్న‌! ప్ర‌త్యేకించి నీటి క‌రువు, వ‌ర్ష‌పాత లేమి.. మ‌నుషుల‌ను భ‌య‌పెట్టింది. అప్ప‌టికే ఇరిగేష‌న్ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి, సుదూర ప్రాంతాల నుంచి తాగునీటిని అందించే తాగు నీటి ప్రాజెక్టులూ నోచుకున్నాయి. 

అవ‌న్నీ ఎన్ని ఉన్నా.. వ‌ర్షం మాత్రం చాలా కీల‌క‌మైన‌ది. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల‌తో మ‌నిషి దాహం తీరుతుందేమో కానీ.. చెట్టూచేమ దాహం తీరాలంటే వ‌ర్షం రావాలి. ఎడారిగా మార‌కుండా, నెర్రెలు చీల‌కుండా భూమికి వ‌ర్షం కావాలి! అలాంటి వ‌ర్షం గ‌త రెండేళ్ల కాలంలో పుష్క‌లంగా కుర‌స్తూ ఉండ‌టంతో.. రాయ‌ల‌సీమలో వ్య‌వ‌సాయానికి సంబంధించిన ప‌రిస్థితులు శ‌ర‌వేంగా మారుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం!

భూమికి కొద‌వ‌లేదు.. ఎక‌రాల కొద్దీ ఒక్కోకుటుంబానికి భూములు ఉండ‌నే ఉంటాయి. అయితే వాటిని సాగుకు తీసుకురావ‌డం మాత్రం ఇన్నేళ్లూ చాలా మందికి ప‌ట్టిన అంశం అయ్యింది. నీటి వ‌న‌రులు లేక‌పోవ‌డ‌మే అందుకు ప్రధాన‌మైన కార‌ణం.

ప్ర‌తి ఎక‌రా భూమికీ చెరువో, వంక నుంచినో నీటి ఆధారం ఉండ‌నే ఉంటుంది రాయ‌ల‌సీమ‌లో. అయితే వంక పార‌న‌ప్పుడు, చెరువు నిండ‌న‌ప్పుడు ఆ భూమికి నీళ్లు ఎక్క‌డ నుంచి వ‌స్తాయి?  భూగ‌ర్భ జ‌లం కూడా ల‌భించ‌క‌పోవడంతో.. బోర్లు వేసినా ప్ర‌యోజ‌నం లేద‌నే ప‌రిస్థితి నెల‌కొంది. 

ప్ర‌త్యేకించి గ‌త రెండు దశాబ్దాల కాలంలో కొన్ని వేల ఎకరాల భూమి సాగుకు దూరం అయ్యిందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఏ ఏడాదికాయేడు వ‌ర్ష‌పాతం త‌క్కువ‌గాన‌మోదు కావ‌డం, ఎప్పుడో ఒక‌టీ అర త‌ప్ప పెద్ద‌గా భారీ వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో ఆ ప‌రిస్థితి త‌లెత్తింది.

ప‌దెక‌రాల భూమి ఉన్న రైతు కూడా.. రెండెక‌రాల‌కు స‌రైన నీటి స‌దుపాయం ఉంటే చాల‌నుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌ర్షాధారంగా వేసే పంట‌ల మీద న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో కొన్ని వేల ఎక‌రాల భూమి క్ర‌మ‌క్రంగా సాగుకు దూరం అయ్యింది!

ఈ క్ర‌మంలో గ‌త ఏడాది మంచి వ‌ర్షాలు కుర‌వ‌డంతో చాలా చోట్ల భూగ‌ర్భ జ‌లాల క‌ళ వ‌చ్చింది. ఈ ఏడాది భారీ వ‌ర్షాలు కురిశాయి.  కొన్ని చోట్ల అతి భారీ వ‌ర్షాలు కూడా కురిశాయి. కోస్తాంధ్ర ప్రాంతం క‌న్నా.. ఈ ఏడాది రాయ‌ల‌సీమ‌లోనే ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింది. రాబోయే రెండేళ్లూ భూగ‌ర్భ జ‌లాల‌కు లోటు ఉండ‌ద‌నే ధైర్యం ఇప్పుడు రైత‌న్న‌లో క‌నిపిస్తూ ఉంది. ఈ ఏడాది ఇంకా వ‌ర్షాల‌కు అవ‌కాశం ఉంది, రాబోయే సంవ‌త్స‌రాల్లో కూడా ఇలాంటి వ‌ర్షాలే కురిస్తే.. ఇక క‌రువు అనే మాట ఉండ‌దు.

ఈ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ వ్య‌వ‌సాయం మీద ఆస‌క్తి మొద‌లైంది. బీడు భూములు సాగుకు వ‌స్తున్నాయి. యేళ్ల త‌ర‌బ‌డి వ్య‌వ‌సాయం చేయ జాలి చెట్లు ప‌డిపోయిన భూముల‌ను కూడా స‌రి చేసుకుంటున్నారు రైతులు. ఇదే స‌మ‌యంలో క‌రోనా కార‌ణంగా న‌గ‌రాల్లో చిన్న‌చితాక ప‌నులు చేసుకునే వాళ్లు సొంతూళ్ల‌లోనే ఆగిపోయారు. నెల‌ల త‌ర‌బ‌డి ఊర్ల‌లోనే ఉండ‌టం, వ‌ర్ష‌పాతం ఆశ‌లు రేకెత్తించ‌డంతో అలాంటి వారు మ‌ళ్లీ సీమ ప‌ల్లెల్లోనే త‌మ భ‌విత‌వ్యాన్ని వెదుక్కోవ‌డానికి స‌మాయత్తం అవుతున్నారు!

దేశం దృష్టిలో ఇప్పుడు జగన్ ఒక హీరో