Advertisement


Home > Politics - Political News
కొద్దికాలమైనా ఆ కోరిక తీరుతుందా?

ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చి, ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాక, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి మళ్లీ తెర మీదికి వచ్చింది. పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్న కేంద్ర నాయకత్వం అధ్యక్ష పదవి నుంచి హరిబాబును తొలగించి సమర్ధుడికి, దూకుడుగా వ్యవహరించే నేతను నియమిస్తారనే వార్తలు కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

వాస్తవానికి హరిబాబును మారుస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆయన్ని మార్చాలనే డిమాండ్‌ కూడా పార్టీలోని ఒక వర్గం నుంచి బలంగా ఉంది. దేశమంతా బీజేపీ అధ్యక్షులను మార్చినా కేంద్ర నాయకత్వం ఏపీలో మార్పులు చేయలేదు. ఇందుకు అప్పట్లో వెంకయ్య నాయుడు (ఉప రాష్ట్రపతి కాకముందు), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నారు.

హరిబాబు వెంకయ్యకు సన్నిహితుడు, చంద్రబాబుకు అనుకూలుడనే పేరుంది. బాబు ఎన్‌డీఏలో ఉన్నంతకాలం ఆయనపట్ల సాఫ్ట్‌కార్నర్‌తో వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన వ్యవహారశైలిని పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా విమర్శిస్తూ వస్తోంది. వెంకయ్య కొంతకాలం క్రితం ఉప రాష్ట్రపతి అయ్యారు. చంద్రబాబు ఎన్‌డీఏ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి హరిబాబు సామర్థ్యం సరిపోదని కేంద్ర నాయకత్వం భావిస్తోంది.

సో.. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని మళ్లీ ప్రచారమవుతోంది. ఇదీ కొత్తది కాదు. గతంలో ఒకసారి కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసినప్పుడు హరిబాబు మంత్రి అవుతున్నారని వార్తలొచ్చాయి. అప్పట్లో తెలంగాణ ఎంపీ బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించడం, వెంకయ్య ఉప రాష్ట్రపతి కావడంతో హరిబాబుకు స్థానం ఉంటుందనుకున్నారు.

ఆయన మంత్రి పదవికి ఎంపికైనట్లు పీఎంఓ నుంచి సమాచారం అందడంతో కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీకి వెళ్లారు. కాని ఆయన పేరు లేకుండానే మంత్రివర్గం ప్రక్షాళన ముగిసింది. ఒకవిధంగా ఇది ఆయనకు అవమానమే. ఆ తరువాత అశోక్‌ గజపతిరాజు పోర్టుఫోలియో మారుస్తారని, ఆ స్థానంలోకి హరిబాబు వచ్చే అవకాశముందని వార్తలొచ్చాయి. అదీ జరగలేదు.

ఇప్పుడు కేంద్రంలో టీడీపీ మంత్రులు అశోక్‌, సుజనా చౌదరి లేకపోవడం, పొత్తు విచ్ఛిన్నం కావడంతో హరిబాబు పేరు వినబడుతోంది. గతంలో ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలనుకోవడానికి ప్రధాన కారణం రైల్వే జోన్‌కు పరిహారంగా అని  కొందరు నాయకులన్నారు. అంటే రైల్వే జోన్‌కు మంత్రి పదవి సమానమన్నమాట.

రైల్వే జోన్‌ ఇస్తే రాష్ట్రానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. కాని హరిబాబుకు మంత్రి పదవి ఇస్తే ఆయనకు ప్రయోజనం కలుగుతుందిగాని రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలుగుతుంది? రైల్వే జోన్‌ ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయమే మంత్రి పదవి అనుకోవాలా? తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తొలగించాక, ఆంధ్రాకు చెందిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ నేతనూ మంత్రివర్గంలోకి తీసుకోకూడదని మోదీ నిర్ణయించుకున్నారట.

ఇలా అనుకున్నప్పుడు టీడీపీ నేతలు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రివర్గంలోనే ఉన్నారు. అప్పటికి బంధం తెగిపోలేదు. ఇప్పుడు వారు లేరు కాబట్టి మోదీ నిర్ణయం మారుతుందా? ఎన్నికలకు ఏడాదే సమయం ఉంది కాబట్టి హరిబాబుకు పదవి ఇస్తే ఏపీలో పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అనుకుంటారా? ఒకవేళ పదవి ఇస్తే మాత్రం కొంతకాలమైనా హరిబాబు కోరిక తీరుతుంది.