cloudfront

Advertisement


Home > Politics - Political News

హరీష్‌ వివాదం సమసిపోయినట్లేనా?

హరీష్‌ వివాదం సమసిపోయినట్లేనా?

టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు వివాదం సమసిపోయినట్లే కనబడుతోంది. ఆయనను కేసీఆర్‌ పక్కన పెట్టేశారని, ప్రాధాన్యం తగ్గించారని మీడియాలో హోరెత్తిపోయిన విషయం తెలిసిందే కదా. రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఉందంటూ హరీష్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. విపక్షాలు దీన్నో అస్త్రంగా మలచుకొని కేసీఆర్‌ కుటుంబంలో చీలిక వస్తోందంటూ ప్రచారం చేశాయి. హరీష్‌రావు పార్టీ నుంచి బయటకు వస్తాడని కొందరన్నారు కూడా.

కాని ఈ వివాదానికి తెరదించారు హరీష్‌. తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను మేనల్లుడు కలుసుకొని వివరణ ఇచ్చుకున్నాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని, భావోద్వేగంతో అన్నానని కేసీఆర్‌కు నచ్చచెప్పాడు. ఇతర నాయకులను వదులుకున్నంత తేలికంగా హరీష్‌ను వదులకోలేడు కదా. ఎన్నికల సమయంలో హరీష్‌ ఆయనకు కొండంత అండ. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ కేసీఆర్‌ తరపున విపరీతంగా కృషిచేసి ఘనవిజయాలు సాధించిపెట్టాడు.

ఇప్పుడు కూడా తాను పోటీచేస్తున్న గజ్వేల్‌లో ప్రచార బాధ్యతలను హరీష్‌ అప్పగించారు కేసీఆర్‌. దీనికి ఆనందంగా అంగీకరించిన హరీష్‌ మామను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తానంటున్నాడు. నిన్న నియోజకవర్గంలో హరీష్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తనను పక్కనపెట్టారని ఇన్నాళ్లు సాగిన ప్రచారమంతా అబద్ధమని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను టీఆర్‌ఎస్‌లో పుట్టానని, ఆ పార్టీలోనే చనిపోతానని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌కు చెందిన మీడియాలో హరీష్‌రావు వార్తలు రాకపోవడంతో ఆయన అనుచరులు తీవ్రంగా కలవరపడ్డారు. ఆయనపై అనధికారిక నిషేధం విధించారన్నారు. హరీష్‌ కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ మీడియాలో అసలు కవర్‌ చేయడంలేదని, వేసినా ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఉందంటూ తన దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో వ్యాఖ్యానించిన హరీష్‌ ఆ తరువాత తాను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదని, ప్రజల అభిమానం చూసి భావోద్వేగంతో అన్నానని మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు. హరీష్‌ను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నిలబెడతారని, సిద్ధిపేట నుంచి కేసీఆరే పోటీ చేస్తారని ప్రతిపక్షాల నేతలన్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్‌ మౌనంగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఏం చేయబోతాననే ఉత్కంఠ నెలకొంది.

అందుకే రకరకాల ఊహాగానాలు ప్రబలాయి. కుమారుడు కేటీఆర్‌కు అడ్డురాకుండా ఉండేందుకే హరీష్‌ను లోక్‌సభకు పంపాలని కేసీఆర్‌ యోచిస్తున్నారని కొందరు నేతలన్నారు. గజ్వేల్‌ ప్రచార బాధ్యతలను హరీష్‌రావు అప్పగించడంతో ఇక అనుమానాలకు తావు లేదనుకోవచ్చు.

కేసీఆర్‌ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలనుకుంటున్నారు కాబట్టి గజ్వేల్‌ బాధ్యత మేనల్లుడికి అప్పగించారు. సిద్ధిపేటలో హరీష్‌ పెద్దగా ప్రచారం చేయకున్నా ఆయన గెలుపుకు ఢోకాలేదు.