cloudfront

Advertisement


Home > Politics - Political News

హవ్వ.. 'కూలీ' అడుగుతున్న నారా 'నిప్పు'.!

హవ్వ.. 'కూలీ' అడుగుతున్న నారా 'నిప్పు'.!

నిప్పు నారా చంద్రబాబునాయుడుగారు 'కూలీ' అడుగుతున్నారు. 'ఐదేళ్ళు నేను కష్టపడ్డాను, ఆ కష్టానికి కూలీ ఇప్పుడు అడుగుతున్నాను..' అంటూ నిన్న 126 మంది అభ్యర్థులను ప్రకటించిన సందర్భంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నవ్వులపాలవుతున్నాయి. ఇక్కడ కూలీ అంటే గెలుపు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అలా గెలిచి, అధికార పీఠమెక్కాక మళ్ళీ జనం కోసం కష్టపడటమే తనకు ఇష్టమన్నది చంద్రబాబు చెబుతున్నమాట.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది వ్యవహారం.! దేశంలోనే అత్యంత విలాసవంతంగా ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్‌ చేసి, వార్తల్లోకెక్కిన నారా చంద్రబాబునాయుడు ఇంకోసారి అలాంటి విలాసవంతమైన 'కూలీ పని' కోరుకుంటున్నారన్నమాట. ఇచ్చేందుకు జనం సిద్ధంగా వున్నారా.? లేదా.? అన్న ప్రశ్నకి సమాధానం చాలామందికి తెలుసు. అవును మరి, ఒక్కటంటే ఒక్క సర్వే కూడా చంద్రబాబుకి అనుకూలంగా రాలేదంటే, ఆయనెంత గొప్పగా 'కూలీ పని' చేసి జనాన్ని మెప్పించారో అర్థం చేసుకోవచ్చు.

రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ఎంత ఖర్చు చేశారోగానీ, ఆ పేరుతో పబ్లిసిటీ కోసం చంద్రబాబు చేసిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. గ్రాఫిక్స్‌లో తప్ప, రాజధాని అమరావతి వాస్తవంగా ఓ కొలిక్కి రాని పరిస్థితి. 'పోలవరం ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి' అని చెబుతూ వచ్చిన చంద్రబాబు, ఆ పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో ఎంతలా పబ్లిసిటీ స్టంట్స్‌ చేశారో ప్రత్యేకంగా చెప్పాలా.? 2014 ఎన్నికల్లో ఓటర్లు 'కూలీ పని' అప్పగిస్తే, చంద్రబాబు తన పుత్రరత్నానికి 'మంత్రి' అనే ఉద్యోగం ఇచ్చుకున్నారు.. మరి, రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారు.?

తన ట్రేడ్‌ మార్క్‌ ప్రచారాన్ని చంద్రబాబు ఎన్నికలకు ఏడాది సమయం వుండగానే ప్రారంభించారు. పెన్షన్లను పెంచడం, కాపు రిజర్వేషన్ల వ్యవహారం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే వున్నాయి.. చివరి నిమిషంలో చంద్రబాబు పంచిన పప్పూ బెల్లాల కథ. నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవంలో చంద్రబాబు నేర్చుకున్నది, జనాన్ని మభ్యపెట్టడమే.

తెలంగాణ రాష్ట్ర సమితితో అంటకాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన చంద్రబాబు, ఇప్పుడు అదే కేసీఆర్‌ని బూచిగా చూపి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారు. అయినా, చంద్రబాబు తన రాజకీయ జీవితంలో అంటకాగని రాజకీయ పార్టీ అంటూ ఏదన్నా వుందా.? నిప్పులాంటి రాజకీయం అంటే ఇదే మరి.!

గుండె నిండా తీవ్ర ఆవేదనతో, ఆందోళనతో, అధికారం మీద కాంక్షతో చంద్రబాబు 'కూలీ' అడుగుతున్నారు, ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా వున్నారా.? ఇంకోసారి పబ్లిసిటీ అండ్‌ గ్రాఫిక్స్‌ పాలనకి జనం మొగ్గుచూపుతారా.? వేచి చూడాల్సిందే.

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!