Advertisement


Home > Politics - Political News
హార్ట్‌ ఓపెన్‌ చేయని లోకేష్‌...!

'వుయ్‌ రిపోర్ట్‌...యూ డిసైడ్‌' అనే నినాదంతో పనిచేస్తున్న ఛానెల్‌లో ప్రతి ఆదివారం  నిర్వహించే 'ఓపెన్‌ హార్ట్‌'  కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? మనసు విప్పి మాట్లాడటం. కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా హృదయం విప్పి చెప్పడం. ఓపెన్‌గా మాట్లాడటం ఈ కార్యక్రమం ఉద్దేశమైనా అలా మాట్లాడటం, మాట్లాడకపోవడం ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నవారి ఇష్టం. ఓపెన్‌గా మాట్లాడి కష్టనష్టాలు తెచ్చుకోవడం ఇష్టంలేని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు కమ్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్‌ కాబోయే మంత్రి నారా లోకేష్‌ మాట్లాడిన తీరు 'మసిపూసి మారేడుకాయ' చేసిన తీరుగా ఉంది. తనను తాను క్లోజ్‌ చేసుకున్నాడు తప్ప ఓపెన్‌ కాలేదు. చంద్రబాబుకు, తనకు 'గొప్పతనం' ఆపాదించుకున్నాడు తప్ప తమలో ఉన్న లోపాలు చెప్పలేదు.  సగటు రాజకీయ నాయకుడి మాదిరిగానే సమాధానాలు ఇచ్చాడు. ఇవి వాస్తవాలకు దగ్గరగా లేవని ఇంటర్వ్యూ చూసినవారికి అర్థమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సారాంశం 'నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' అనే పద్యాన్ని గుర్తుకు తెచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే 'మా నాన్న తప్పుచేయలేదు. నేనూ జీవితంలో తప్పు చేయను' అని చెప్పడం. తప్పులు చేయకపోవడానికి తండ్రీకొడుకులు దైవాంశ సంభూతులా? పామరుడైనా, పాలకుడైనా తప్పులు చేయకుండా జీవితాన్ని దాటలేరు. కొన్ని తప్పులు తెలిసి చేస్తారు. కొన్ని తెలియక చేస్తారు. ఎలా చేసినా సరే ఎవరైనా (ప్రతిపక్షాలు, మీడియా) గుర్తు చేసిన తరువాత, లేదా వారే గుర్తించిన తరువాతైనా సరిచేసుకోవడం విజ్ఞత. కాని చంద్రబాబుకు ఆ లక్షణం లేదు. 'నేను జీవితంలో తప్పు చేయలేదు. చేయను'..అని పదేపదే చెప్పకోవడం ఆత్మవంచనే. ఇలా చెప్పుకునే అవలక్షణం లోకేష్‌లోనూ ఉన్నట్లు అర్థమవుతోంది. లోకేష్‌ ఇంటర్వ్యూలో అబద్ధాలున్నాయి. ఆ సంగతి ఆయనకు తెలుసో లేదోగాని జనాలకు తెలుసు. 'తప్పులు జరిగినప్పుడు టీడీపీయే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షానికి పాత్ర లేకుండా చేస్తున్నాం' అని చెప్పాడు. నాయకులు, మంత్రులు బాబుకు ధైర్యంగా వాస్తవాలు చెప్పలేరని టీడీపీ అనుకూల పత్రికే పలుమార్లు రాసింది.

అలాంటప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పడం అతిశయోక్తి. 'బ్రహ్మాండమైన రాజధానిని (అమరావతి) మనం 2019లో చూడబోతున్నాం'..అని చెప్పాడు లోకేష్‌. వంట సిద్ధమైంది.. భోజనం చేయడమే మిగిలింది అన్నంత తేలిగ్గా చెప్పేశాడు. బ్రహ్మాండమైన రాజధాని అంటే లోకేష్‌ దృష్టిలో ఏమిటి? హైదరాబాదు వంటి నగరమనా? పరిపాలనకు సంబంధించిన నాలుగైదు భవనాలు అనుకుంటున్నాడా? బ్రహ్మాండమైన రాజధాని ఏమిటో వివరిస్తే బాగుండేది. తెలంగాణలో టీడీపీకి ఛాన్సు ఉందా? అని అడిగితే 'నూరు శాతం' అనేది లోకేష్‌ సమాధానం. ఛాన్సు ఉందా? అంటే అధికారంలోకి వస్తారా? అనే కదా అర్థం. తప్పకుండా వస్తామని లోకేష్‌ చెప్పాడు. ఇది నిజంగా జరుగుతుందా? తెలంగాణలో తన పార్టీ స్థితి ఏమిటో ఆయనకు తెలియదా? 'చంద్రబాబులో మీరు గమనించిన అనుకూల, ప్రతికూల అంశాలేమిటి?' అనే ప్రశ్నకు లోకేష్‌ నిజాయితీగా సమాధానం చెప్పలేదు. తండ్రిలో ప్రతికూల అంశాలేమీ లేవన్నాడు. సీఎంగా, పార్టీ అధినేతగా ఆయన మారాల్సిన అవసరం లేదన్నాడు. లోకేష్‌ను ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానెల్‌ అధినేత తన పత్రికలో రాస్తున్న 'కాలం'లో అనేకసార్లు చంద్రబాబు మారాల్సిన అవసరం ఉందని సలహా ఇచ్చారు.

తండ్రిలోని లోపాలను బహిరంగంగా చెబితే ఆయన పరువు తీసినట్లుగా ఉంటుందని, ప్రతిపక్షం విమర్శలు చేసే అవకాశం ఉంటుందని లోకేష్‌ భావించాడేమో. తండ్రిలో కొన్ని ప్రతికూల అంశాలున్నాయని, కాని ఇంటర్వ్యూలో చెప్పలేనని అంటే కొంతవరకు నిజాయితీగా మాట్లాడినట్లుగా ఉండేది. రాజకీయ వారసత్వం గురించి మాట్లాడుతూ 'గతంలోలా నేతల పిల్లలనగానే ద్వారాలన్నీ తెరుచుకునే పరిస్థితి ఈనాడు లేదు' అని చెప్పాడు. ఇది వాస్తవం కాదు. దేశం నిండా అనేకమంది వారసులు రాజకీయాల్లో కనబడుతున్నారు. లోకేష్‌కు ద్వారాలు తెరవాలని పార్టీ నాయకులు, మంత్రులే డిమాండ్‌ చేశారు కదా. వారసత్వ రాజకీయాలు లేవని ఎలా అంటున్నాడో...! తనను నాయకులు భావి ముఖ్యమంత్రిగా చెబుతున్నారు కదా. మొత్తం మీద హృదయం తెరవకుండా పైపైన మాట్లాడి ముగించేశాడు లోకేష్‌.