cloudfront

Advertisement


Home > Politics - Political News

హెలికాప్టర్‌.. టీఆర్‌ఎస్‌ని ముంచేస్తుందా.?

హెలికాప్టర్‌.. టీఆర్‌ఎస్‌ని ముంచేస్తుందా.?

ఓ హెలికాప్టర్‌ ప్రమాదం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని బలితీసుకుంది.. మరో హెలికాప్టర్‌.. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీని కూల్చివేయబోతోందట.! తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇటీవల తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో 60మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర ఎరుగని విషాదమిది. ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థకి సంబంధించి దేశంలోనే అతి పెద్ద ప్రమాదంగా దీన్ని అభివర్ణించొచ్చు. 

ఆషామాషీ ప్రమాదం కాదిది. ఈ ప్రమాదం వెనుక ఆర్టీసీ ఘోర వైఫల్యం సుస్పష్టం. ఆర్టీసీని సరైన రీతిలో నడపలేక చేతులెత్తేసిన ప్రభుత్వమూ 60 మంది ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యత వహించి తీరాల్సిందే. మంత్రి కేటీఆర్‌, మరికొందరు టీఆర్‌ఎస్‌ నేతలు.. ఎంచక్కా హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి వెళ్ళి, బాధితుల్ని పరామర్శించి వచ్చారు. పోయినవి పేద ప్రాణాలు కదా.. ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం తరఫున ప్రకటించేసి ఊరుకున్నారు. 

ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి 'ప్రగతి నివేదన సభ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. దాదాపు 300 కోట్లు ఈ సభ కోసం ఖర్చు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సభ కోసం ఇంత ఖర్చు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు భారీ స్థాయిలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వుండాలి. అది రాజకీయంగానూ ఆ పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడేదేమో.! 

మంత్రి హెలికాప్టర్‌లో వెళ్ళారు సరే.. అదే పని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారు.? ఈ ప్రశ్న విపక్షాల నుంచి మాత్రమేకాదు, బాధిత కుటుంబాల నుంచీ అధికార పార్టీని నిలదీస్తోంది. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా యాదాద్రిని అభివృద్ధి చేసేందుకు వందల కోట్లు వెచ్చిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, కొండగట్టు దేవాలయ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడాన్నీ చాలామంది ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబాలదీ ఇదే ఆవేదన. 

చిన్న ప్రమాదం కాదు.. 60 మందిని బలి తీసుకున్న ప్రమాదమిది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాని, రాష్ట్రపతి సైతం ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా (ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ) సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించేస్తే సరిపోదు. దారుణం, అవమానకరమైన విషయమేంటంటే.. బాధిత కుటుంబాలు.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తమవారి పార్దీవ దేహాలకు అంత్యక్రియలు చేయడానికీ నానా తంటాలూ పడాల్సి వస్తోంది.

ప్రాణాలెలాగూ పోయాయ్‌.. చనిపోయినవారికి కనీసపాటి గౌరవం ప్రభుత్వం ఇవ్వడంలేదన్నది మెజార్టీ అభిప్రాయం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఈ ప్రమాదం తాలూకు ప్రభావం చాలా తీవ్రంగానే వుండే అవకాశం లేకపోలేదు.