cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై సుప్రీం అలా...హైకోర్టు ఇలా!

భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై సుప్రీం అలా...హైకోర్టు ఇలా!

భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు సంబంధించి ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. రాజ‌ధాని భూభాగోతంపై ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేప‌థ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏసీబీ ద‌ర్యాప్తును ఏపీ హైకోర్టు నిలుపుద‌ల చేస్తూ మంగ‌ళ‌వారం ఆదేశాలు ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను మీడియా రాయ‌కూడ దంటూ స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను హైకోర్టు ఇచ్చింది. 

ఇదే రోజు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇటు సుప్రీంకోర్టు, అటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో వైరుధ్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ రెండు ఆదేశాల సంద‌ర్భంగా కోర్టులు చేసిన వ్యాఖ్యాన్యాల గురించి తెలుసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

ముందుగా ఏపీ హైకోర్టు మీడియాకు ఇచ్చిన ఆదేశాలేంటో చూద్దాం.

"రాజ‌ధాని భూముల‌పై  ఏసీబీ దాఖ‌లు చేసిన ఎఫ్ఐఆర్ న‌మోదు, అందులోని వివ‌రాల‌ను ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్, సామాజిక మాధ్య‌మాల ద్వారా బ‌హిర్గ‌తం చేయ‌డానికి వీల్లేదు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కు ఈ వివ‌రాలేవీ ఏ మీడియాలో రాకుండా హోంశాఖ కార్య‌ద‌ర్శి, డీజీపీ, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ  ద్వారా  సంబంధిత  సంస్థ‌ల‌కు తెలియ‌జేయాలి. దీనిపై సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెట్ట‌డానికి వీల్లేదు" అని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి  ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చారు.

ఇక దేశ అత్యున్న‌త న్యాయ స్థానం ద‌గ్గ‌రికి వెళ్దాం. మీడియా స్వేచ్ఛ‌పై సుప్రీంకోర్టు చేసిన కీల‌క వ్యాఖ్య‌లేంటో ప‌రిశీలిద్దాం. సుద‌ర్శ‌న్ టీవీ రూపొందించిన "బిందాల్ బోల్" కార్య‌క్రమానికి వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఏమ‌న్న‌దంటే...

"కేబుల్ టీవీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ... ఒక‌రి ప‌రువుకు భంగం క‌లిగించేలా , అస‌త్యాలు, అర్ధ స‌త్యాలతో కూడిన ఊహాజ‌నిత వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌కూడ‌దు. ఇంట‌ర్‌నెట్‌ను నియంత్రించ‌డం చాలా క‌ష్టం. కానీ ఎల‌క్ట్రానిక్ మీడియాను నియంత్రించాలి. అయితే ప్ర‌భుత్వాలు దాన్ని సెన్సార్ చేయాల‌ని మేము చెప్ప‌డం లేదు. ఎందుకంటే అది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధ‌మ‌వుతుంది. కానీ స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌రం" ....అని జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఇందుమ‌ల్హోత్రా , జ‌స్టిస్ కేఎం జోసెఫ్‌ల‌తో కూడిన సుప్రీంకోర్టు త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం స్ప‌ష్ట‌త ఇచ్చింది.

సెన్సార్ చేయాల‌ని తాము చెప్ప‌డం లేద‌ని, ఒక వేళ అలా చెప్ప‌డం అనేది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధ‌మ‌ని సుప్రీంకోర్టు త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు ఆదేశాల‌ను గ‌మ‌నిస్తున్న ప్ర‌జానీకం త‌మ‌త‌మ చైత‌న్యాన్ని, అవ‌గాహ‌న బ‌ట్టి భావ ప్ర‌క‌ట‌న‌పై స్వేచ్ఛ‌, వాక్ స్వాతంత్ర్యంపై ఇప్పుడిప్పుడే ఒక స్ప‌ష్ట‌త‌కు వ‌స్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

 


×