Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆశలు అణచుకోవాల్సిందే...వెయిట్ చేయాల్సిందే

ఆశలు అణచుకోవాల్సిందే...వెయిట్ చేయాల్సిందే

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో అంటే టీపీసీసీలో లొల్లి ఆగిపోయింది. ఏం లొల్లి అంటున్నారా? అదేనండీ ...అధ్యక్ష పదవి లొల్లి. అధ్యక్ష పదవి విషయాన్ని ఓ పట్టాన తేలనివ్వలేదు నాయకులు. 

రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కాకుండా శాయశక్తులా అడ్డుకున్నారు. ఆయనకు ఇవ్వాలంటే ఈయనకు ఇవ్వాలని, ఈయనకు ఇవ్వాలంటే ఆయనకు ఇవ్వాలని గాయిగాత్తర లేపారు. ఈలోగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా జానా రెడ్డిని ఎంపిక చేయడంతో ఆయన ఒక షరతు పెట్టాడు. 

ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు అధ్యక్షుడి నియామకం వాయిదా వేయాలని కోరాడు. ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ లో గొడవలైతే ఆ ప్రభావం ఉప ఎన్నిక మీద పడుతుందని, దాంతో నష్టం కలుగుతుందని చెప్పాడు. 

సరే ఎందుకులే గొడవ అనుకుందేమో అధిష్టానం. అందులోనూ సీనియర్ నాయకుడు చెప్పాక కాదనడం బాగుండదు కదా. సరే అంది అధిష్టానం. ప్రస్తుతం హై కమాండే గందరగోళంలో ఉంది కాబట్టి అధ్యక్ష పదవి నియామకానికి బ్రేక్ పడింది. 

కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు అంత తేలికగా జరగవు. ఈ విషయం ఆ పార్టీలో  నాయకులందరికీ  బాగా తెలుసు.  పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తులు జరుగుతుంటాయి. 

తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్ ఇదే రకమైన సంప్రదింపులు జరిపింది. అభిప్రాయాలు సేకరించింది. అయితే నిర్ణయం తీసుకునే సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో దిగబోతున్న జానారెడ్డి  సూచనతో  మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేంతవరకు మళ్లీ టీపీసీసీ చీఫ్ ఎంపిక గురించి కాంగ్రెస్ నేతలెవరూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది.

ఇది టీపీసీసీ చీఫ్ లేదా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించి దాదాపు దగ్గరవరకు వెళ్లిన ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి, ఆయన అనుచరులకు నిరాశ కలిగించింది. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయిన తరువాతైనా.. రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌లో కోరుకున్న పదవి దక్కుతుందా అన్నది చెప్పలేని పరిస్థితి ఉంది. 

ఇందుకు అసలు కారణం జాతీయస్థాయిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జూన్‌లో ఎన్నికలు జరగనుండటమే. జూన్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో అప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని కానీ లేక ఇతర కీలక పదవులకు నేతలను కానీ ఎంపిక చేయబోరని దాదాపుగా స్పష్టమైంది.

తెలంగాణలో త్వరలోనే నాగార్జునసాగర్‌‌కు ఉప ఎన్నిక జరగబోతోంది.  ఈ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంటుందని కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగి.. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న తరువాతే మళ్లీ ఈ అంశంపై దృష్టి పెట్టొచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.

అంతేకాదు అప్పటి పరిస్థితిని బట్టి మళ్లీ టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం మళ్లీ సంప్రదింపులు, కసరత్తు మొదలుపెట్టే అవకాశం లేకపోలేదనే వాదన కూడా కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పదవి ఆశిస్తున్న రేవంత్ రెడ్డికి మరికొన్ని నెలల వెయిటింగ్ తప్పేలా లేదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?