Advertisement

Advertisement


Home > Politics - Political News

వైసీపీకి ఇంతటి ఘనవిజయం ఎలా సాధ్యమైంది?

వైసీపీకి ఇంతటి ఘనవిజయం ఎలా సాధ్యమైంది?

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు 22 ఎంపీ స్థానాలు దక్కాయి. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ ఓట్ షేర్ పెరుగుతూ పోతోంది. 

చివరికి ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో అది 90శాతానికి చేరుకుంది. ప్రతిపక్షాలన్నిటినీ కలిపి 10శాతానికి పరిమితం చేసింది.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్..

మొత్తం 13081 పంచాయతీల్లో వైసీపీ 10536 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. 12 కార్పొరేషన్లు మొత్తం వైసీపీకే దక్కాయి. 75మున్సిపాల్టీల్లో 74 చోట్ల వైసీపీ పాలకమండలి కొలువుతీరింది. తాజాగా 13 జిల్లా పరిషత్ స్థానాల్లో ఒక్కటి కూడా మిస్ కాలేదు. 

ఎంపీటీసీలు 90శాతం వైసీపీకి దక్కాయి. ఈ గణాంకాలు పైకి కనిపిస్తున్నవి మాత్రమే. విజయాలు గురించి చెప్పుకోడానికి ఇవి సరిపోతాయి. కానీ ఆ విజయాల వెనక కారణాలు వివరించాలంటే మాత్రం చాలా ఉంది.

పనులు, పథకాలు..

ఎన్నికల ముందు ఎవరైనా హామీలు గుప్పిస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక కొంతమందే వాటిని అమలులోకి తెస్తారు. అందులోనూ ఎన్నికలకు కాస్త ముందుగా హామీల అమలు మొదలు పెట్టి, వాటిని కొనసాగించాలంటే మరోసారి తమనే ఎన్నుకోవాలనే చెప్పే జిమ్మిక్కులు చాలా ఏళ్లనుంచి ఆనవాయితీగా వస్తున్నాయి. కానీ సీఎం కుర్చీలో కూర్చున్న మరుసటి క్షణం నుంచే హామీల అమలుపై దృష్టిపెట్టిన ఏకైక సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారు.

రెండేళ్లు పూర్తయ్యేలోగా 95శాతం హామీలను అమలులో పెట్టారు. అందరి మనసులు గెలుచుకున్నారు. హామీలను అమలులో పెట్టడం ఒకెత్తయితే, ఎక్కడా అసంతృప్తి లేకుండా వాటిని అమలు చేయడం మరో ఎత్తు. క్రమం తప్పకుండా ఆ హామీల అమలుని కొనసాగించడం అన్నిటికీ మించిన ఘనత. 

రెండేళ్లలో ప్రభుత్వం మొదలు పెట్టిన ఏ ఒక్క పథకం కూడా ఆగిపోలేదు, వాయిదా పడలేదు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే పరిషత్ ఎన్నికల్లో కూడా వైసీపీకి పట్టం కట్టింది.

పాలనపై సంతృప్తి..

సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై రోజులు గడిచేకొద్దీ ప్రజల్లో కాస్త అసంతృప్తి పెరగడం సహజం. కానీ రోజు రోజుకీ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వచ్చింది. సచివాలయాలతో ఇంటిముందుకే పాలన తెచ్చారు, గడప ముందుకే రేషన్ సరకులు తెచ్చి ఇచ్చారు. 

వాలంటీర్లతో ప్రతి కార్యక్రమం ఇంటి దగ్గరికే వస్తోంది. గతంలో ఏదైనా పథకం కింద లబ్ధిదారుగా చేరాలంటే సవాలక్ష కండిషన్లు, అధికార పార్టీ నేతలకు ఆమ్యామ్యాలు. కానీ ఇప్పుడలా లేదు, ఏపీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం లబ్ధిదారుడే. అందుకే అన్ని వర్గాలు జగన్ పాలనతో సంతృప్తిగా ఉన్నాయి. ఆ సంతృప్తి పరిషత్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

కరోనా కష్టాలను జయించారు..

కరోనా కష్టకాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విమర్శలనెదుర్కున్నాయి. కానీ ఏపీలో మాత్రం సచివాలయ వ్యవస్థ పనితీరు అప్పుడే అందరికీ తెలిసొచ్చింది. 

గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంలో కానీ, కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు పరచయడంలో కానీ, క్వారంటైన్ సెంటర్ల నిర్వహణలో కానీ, వ్యాక్సినేషన్లో కానీ సచివాలయాల పనితీరు అమోఘం. వివిధ పథకాలతో అన్ని వర్గాలకు ఆర్థిక ఆసరా లభించడంతో కరోనా కష్టాలను ఏపీ ప్రజలు సులభంగా జయించారు. అందుకే వైసీపీకి స్థానిక ఎన్నికల్లో పట్టం కట్టారు.

ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా..

ప్రభుత్వం తన పని తాను సాఫీగా చేయడం ఒకెత్తు అయితే, ప్రతిపక్షాల అడ్డుగోడల్ని బద్దలు కొట్టుకుంటూ వెళ్లడం మరో ఎత్తు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎన్ని వ్యతిరేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయో అందరికీ తెలుసు. కోర్టుల్లో ఎన్ని కేసులు వేశారో, ఏ పథకానికి ఎలా అడ్డంకులు సృష్టించారో ప్రతి ఒక్కరికీ అనుభవంలోని విషయమే. అయితే ఈ అడ్డంకులన్నీ దాటుకుంటూ వచ్చారు కాబట్టే జగన్ ని అసలైన విజేతగా గుర్తించారు ప్రజలు. 

స్థానిక ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన తీర్పునిచ్చారు. ఓవరాల్ గా ప్రతిపక్షాలు సృష్టించే వివాదాల కంటే జగన్ సంక్షేమ మంత్రాన్నే ప్రజలు నమ్మారనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

వాస్తవానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం ఊహించిందే అయినా.. రెండేళ్లవుతున్నా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతూ పోవడం మాత్రం కచ్చితంగా గమనించదగ్గ అంశమే. అయితే మరో రెండేళ్లపాటు ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ఆర్థిక కష్టాలను తట్టుకుని పథకాలను కొనసాగించడం ప్రభుత్వానికి కత్తిమీద సామే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?