cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అయిన‌నూ తీరు మార‌లేదు...

అయిన‌నూ తీరు మార‌లేదు...

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వైఖ‌రి రోజురోజుకూ దిగ‌జారుతోంది. ఒక‌వైపు ఏవేవో సాకులు చెప్పి ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరించి, ఓ చారిత్ర‌క త‌ప్పిదానికి పాల్ప‌డింద‌నే విమ‌ర్శ‌ల‌ను సొంత పార్టీ శ్రేణుల నుంచే ఎదుర్కొంటోంది. 

మ‌రోవైపు బ‌హిష్క‌రించిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌ర‌గ‌కుండా అడ్డుకోవాల‌ని విశ్వ ప్ర‌య‌త్నం చేసింది. ఇందులో భాగంగా హైకోర్టు సింగిల్ జ‌డ్జి తీర్పు ఆ పార్టీతో పాటు బీజేపీ, జ‌న‌సేన సంబ‌రాలు చేసుకున్నాయి. క‌నీసం 24 గంట‌లు కూడా వారికి ఆనందం మిగిల్చ కుండా ...హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

క‌నీసం ఇప్ప‌టికైనా త‌న మానాన తాను ఉంటే టీడీపీకి గౌర‌వం ఉండేది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంపై సుప్రీం కోర్టుకు వెళ్తామ‌ని టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ర్ల రామ‌య్య ప్ర‌క‌టించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. 

ఈ తీర్పుపై తాము సంతోషంగా లేమ‌ని, తాము లేవ‌నెత్తిన అంశాల‌పై న్యాయం ల‌భించ‌లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. చంద్రబాబు న్యాయ నిపుణులతో మాట్లాడార‌ని, సుప్రీంకోర్టుకు వెళ్తే బాగుంటుందని వారు సూచించిన‌ట్టు వ‌ర్ల రామ‌య్య తెలిపారు. దానిని పాటించాలని నిర్ణయించిన‌ట్టు రామ‌య్య వెల్ల‌డించారు.  

రాజ‌కీయ పార్టీల‌న్న త‌ర్వాత ప్ర‌జాకోర్టులో తీర్పు కోరాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటాయి. ఇందుకు టీడీపీ మిన‌హాయింపు. ఎంత సేపూ ప్ర‌జాకోర్టు కాకుండా ఇత‌రేత‌ర వేదిక‌ల‌ను ఆశ్ర‌యిస్తూ , ప్ర‌జాకోర్టు నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. ఇది ఒక రాజ‌కీయ పార్టీని బ‌ల‌హీన‌ప‌రిచే చ‌ర్యే త‌ప్ప‌, ఎప్ప‌టికీ బ‌ల‌ప‌ర‌చ‌ద‌ని టీడీపీ నేత‌లు గ్ర‌హిస్తే మంచిది.

అయిన‌నూ హ‌స్తిన‌కు వెళ్లి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌ని టీడీపీ భావిస్తే ఎవ‌రూ వ‌ద్ద‌న‌రు. అడ్డుకోరు కూడా. కానీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డంతో ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతూ, త‌న‌ను తాను నాశ‌నం చేసుకుంటున్న వాస్త‌వాల్ని ఆ పార్టీ నేత‌లు గ్ర‌హిస్తే ఇలాంటి ప‌నికిమాలిన ప‌నుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉండ‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×