Advertisement

Advertisement


Home > Politics - Political News

భారత్ లో రెండో కాస్ట్ లీ నగరం హైదరాబాద్

భారత్ లో రెండో కాస్ట్ లీ నగరం హైదరాబాద్

హైదరాబాద్ లో రియల్ బూమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లక్షలు విలువ చేసే భూములన్నీ కోట్ల రూపాయల్లోకి ఎప్పుడో మారిపోయాయి. దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉన్న సమయంలో కూడా హైదరాబాద్, దాని పరిసరాల్లో మాత్రం అమాంతం ఎగబాకింది. ఇంకా పెరుగుతూనే ఉంది. అలా పెరిగి పెరిగి ఇప్పుడు భారత్ లోనే నెంబర్-2 స్థానానికి చేరుకుంది హైదరాబాద్ రియల్టీ మార్కెట్. 

అవును, నివాస ప్రాంతాల ధరల లెక్కలు తీస్తే భారత్ లో హైదరాబాద్ ది రెండో స్థానం. మొదటి స్థానాన్ని ముంబై నిలుపుకోవడంలో పెద్ద విశేషమేమీ లేదు కానీ, ఒక దక్షిణాది నగరం అందులోనూ బెంగళూరుని తలదన్ని హైదరాబాద్ ముందుకెళ్లడమంటే విశేషమే.

తాజా లెక్కల ప్రకారం ముంబైలో సరాసరి చదరపు అడుగు స్థలం ఖరీదు 9600 రూపాయల నుంచి 9800 రూపాయల వరకు ఉంది. అంటే సగటున చదరపు అడుగు ధర 9670 రూపాయలు పలుకుతోంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ లో చదరపు అడుగు ఖరీదు 5751 రూపాయలుగా ఉంది. 

మూడో స్థానంలో ఉన్న బెంగళూరులో చదరపు అడుగు ఖరీదు సగటున రూ.5470గా ఉంది. చెన్నైలో 5370 రూపాయలు, పుణెలో 5070 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం చదరపు అడుగు ధర 4370 రూపాయలు మాత్రమే ఉండటం విశేషం. నివాస స్థలాల ధరలు ఎక్కువగా ఉన్న లిస్ట్ లో దక్షిణాది మూడు రాష్ట్రాలు వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉండటం మరో విశేషం.

ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్య భాగంలో హైదరాబాద్ లో భారీ సంఖ్యలో స్థలాలు చేతులు మారాయి. కొత్తగా వేసిన వెంచర్లలో 7,812 యూనిట్లు అమ్ముడు కావడంతో రియల్ బూమ్ ఏకంగా 222 శాతం పెరిగింది. ఏడాది యావరేజ్ తీసుకుంటే 140 శాతం పెరుగుదల కనిపించింది. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ లో ఎక్కువగా రియల్ వ్యాపారం జరిగింది. రెండేళ్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించినా.. గడచిన మూడు నెలల కాలంలో మాత్రం పెద్దఎత్తున  వ్యాపారం జరిగిందని తెలుస్తోంది.

అయితే స్థలాల రేట్లు తక్కువగా ఉన్నా.. రియల్ వ్యాపారంలో మాత్రం ఇప్పటికీ ఢిల్లీదే పైచేయి. తక్కువ వడ్డీరేట్లు, ఇతరత్రా ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలతో.. చాలామంది ఢిల్లీలో ఇళ్లు కొనడానికి ముందడుగేస్తున్నారు.

ధరలు పెరిగినా ముందుకే..

ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అయితే హైదరాబాద్ లో రియల్ వ్యాపారులు మాత్రం.. కొంతమేర తమ లాభాలను తగ్గించుకుంటూ డిస్కౌంట్లు ఇవ్వడం విశేషం. వీటికి తోడు ప్రభుత్వం కూడా స్టాంప్ డ్యూటీ తగ్గించడం, ఇతరత్రా మినహాయింపులు ఇవ్వడంతో రియల్ బూమ్ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?