cloudfront

Advertisement


Home > Politics - Political News

ఐదేళ్ల పాలన.. సర్వం నాశనం

ఐదేళ్ల పాలన.. సర్వం నాశనం

-అన్ని వ్యవస్థలనూ అస్తవ్యస్తం చేసిన బాబు
-ఒక వ్యాపారిలా వ్యవహరిస్తున్న వైనం
-అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు
-భారీ మూల్యం చెల్లించుకునే సమయం వచ్చిందా?
-ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!

'అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు..' ఇదీ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ మాట్లాడుతున్న మాట. తరచూ కాదు.. ప్రతిరోజూ మాట్లాడుతున్న మాట. ఈ విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలని.. మోడీ పాలనకు వీడ్కోలు పలకాలి అని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. నిజమే.. ప్రజలు ఈ విషయం గురించి ఆలోచించాలి. 'వ్యవస్థలను నాశనం చేయడం' గురించి ప్రజలు ఆలోచించాల్సిందే. అలాంటి పాలకులను ప్రజలు సాగనంపాల్సిందే! మరి అలా సాగనంపే పరిస్థితే వస్తే.. మోడీకన్నా ముందు ఇంటిబాట పట్టేది ఎవరు? చంద్రబాబే కదా! తను మోడీ కన్నా సీనియర్‌ అని కూడా చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ చెప్పుకొంటూ ఉంటారు. ఔను.. వ్యవస్థలను నాశనం చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు సీనియరే. మోడీ కన్నా సీనియరే. ఇది నిస్సందేహంగా ఒప్పుకోవాల్సిన నిజం.

చంద్రబాబు నాయుడు చేతికి మరోసారి అధికారం అంటూ వెళ్తే... ఏపీ పరిస్థితి ఏమిటి? ఏపీలో ఏ వ్యవస్థ అయినా మిగులుతుందా? మొత్తం చంద్రబాబు నియంతృత్వంలో రాష్ట్రం నలిగిపోతుందా? అనే సందేహాలు తలెత్తున్నాయి. బాబుకు మరొక్క అవకాశం లభిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు ఎస్టేట్‌గా మారిపోతుంది. బాబుకు, బాబును సమర్థిస్తున్న వాళ్లు విశృంఖలంగా ఏపీ మీదపడి.. రెచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సామాన్యుడు కూడా తన బతుకు తను బతికే పరిస్థితి ఉండదు. ఒక కులస్వామ్యం, చంద్రబాబు ధనస్వామ్యం మాత్రమే వర్ధిల్లుతుంది. ఏపీలో ప్రజాస్వామ్యం తన ఉనికిని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ బాబు చేసిన దుర్మార్గాలను క్షమిస్తే.. ఏపీ ప్రజలకు పట్టబోయే తదుపరి గతి అదే అని పరిశీలకులు చెబుతున్నారు. అంత తీవ్రంగా చెలరేగిపోతోంది చంద్రబాబు మార్కు నియంతృత్వం!

''వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు. కమ్యూనిస్టును కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు, సోషలిస్టును కాదు కాబట్టి నోరు మెదపలేదు. ఆ తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు... నేను యూదును కాదు కాబట్టి అప్పుడూ మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్లు కేథలిక్కుల కోసం వచ్చారు... కేథలిక్కును కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. చివరకు వాళ్లు నా కోసం వచ్చారు... వెనుదిరిగి చూస్తే గొంతు విప్పేవాళ్లు ఎవరూ మిగల్లేదు'' అని నాజీ జర్మనీ అనుభవాన్ని గుర్తుచేస్తూ ప్రొటెస్టెంట్‌ మతగురువు మార్టిన్‌ నీ మూలర్‌ యుద్ధానంతరం చెప్పిన పద్యం ఇది. చంద్రబాబు పాలనకు కూడా ఇది వందశాతం అన్వయించదగినదిగా ఉంది. అదెలాగో చూద్దాం!

ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేయడంతో మొదలు.. గత ఎన్నికల ముందు ఆరువందలకు పైగా హామీలు ఇచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ మెనిఫెస్టోని ఒక బుక్‌సైజ్‌లో విడుదల చేశారు. వాటిల్లో రైతు రుణమాఫీ మొదలుకుని డ్వాక్రా రుణమాఫీ, కాపులను బీసీల్లోకి చేర్చడం, రజకులను ఎస్సీల్లోకి చేర్చడం, వాల్మీకులను ఎస్టీల్లోకి చేర్చడం.. ఇలా కులానికి ఒక హామీ, వర్గానికి మరో హామీ.. ఇలా సవాలక్ష హామీలను ఇచ్చారు. గత ఎన్నికల ఫలితాలను బాగా ప్రభావితం చేసిన హామీలు అవి. ఒక్కసారి అధికారం రాగానే చంద్రబాబు తీరు మారిపోయింది.

హామీలను మూటగట్టి పక్కనపెట్టడం ప్రారంభించారు. ఇది నిస్సంకోచంగా ప్రజలను మోసం చేయడమే. రుణమాఫీ హామీలకు ఆశపడో.. మరో దానికి ఆశపడో చంద్రబాబుకు ఓటేసిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ పంగనామాలు పెట్టారు. అలా మొదటి ద్రోహం ప్రజలకే జరిగింది. నమ్మించిన వాళ్లను మోసంచేశారు చంద్రబాబు.

రాజధాని.. చంద్రబాబు ఇష్టానికి!
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడా అనే అంశం గురించి తేల్చడానికి చంద్రబాబు నాయుడు అనుసరించిన పద్ధతి ఏమిటి? అందులో ఏమైనా శాస్త్రీయత ఉందా, అందులో ఏమైనా అర్థం ఉందా? రాజధాని విషయంలో చట్టబద్ధంగా శివరామకృష్ణన్‌ కమిటీ అంటూ ఒకటి ఏర్పడింది. రాజధాని ఎక్కడా అనే అంశం గురించి అది శాస్త్రీయమైన నివేదికను ఇచ్చింది దానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన విలువ ఏమిటి? దాన్నిబుట్టదాఖలు చేసి చంద్రబాబు నాయుడు.. కేవలం తన ఇష్టానికి అమరావతి రాజధాని అని ప్రకటించారు. ఒక్క అఖిలపక్షం లేదు, ఇతర పార్టీల అభిప్రాయం తీసుకుంది లేదు. కేవలం తనకు తోచినట్టుగా, తన ప్రయోజనాలకు, తన కుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించేశారు.

బహుశా స్వతంత్ర భారతదేశంలో ఇంత నియంతృత్వంతో నిర్ణయం తీసుకున్న పాలకుడు మరొకరు ఉండరేమో. రాజధాని అనేది చంద్రబాబు నాయుడు కుటుంబానికో, కులానికో సంబంధించిన అంశంకాదు. అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం. ఇలాంటి అంశంపై తన ఇష్టానుసారం వ్యవహరించే అధికారం చంద్రబాబుకు ఎక్కడిది? అడిగే వారిని లెక్క చేయకపోవడం ఏమిటి? ఇదీ చంద్రబాబు మార్కు నియంతృత్వం.

ముఖ్యమంత్రి పదవికి విలువనే దిగజార్చలేదా?
ఒక రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు మాటమారిస్తే అదోలెక్క. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా మాటలు మారుస్తారు? దానికంటూ ఒక హద్దు ఉండదా? అది కూడా కీలకమైన, రాష్ట్రానికి ప్రాణప్రదమైన ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు ఏమిటి? తమకు అధికారం ఇస్తే పదిహేనేళ్ల పాటు ప్రత్యేకహోదా అని నాటి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పి... తీరా అధికారంలోకి వచ్చాకా చేసినది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రంగులు మార్చారు చంద్రబాబు నాయుడు. 'ప్రత్యేకహోదా ఏమీ సంజీవని కాదు, ప్రత్యేకతతో ఏమొస్తుందండీ, ప్రత్యేకహోదా అంటే జైలుకే, ప్రత్యేక హోదాతో ఏ రాష్ట్రం బాగుపడలేదు..' అంటూ హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రత్యేకహోదా కోసం కొంగ దీక్షలు చేస్తున్నారు. అది కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి.. ఎన్నికల ముందు నల్లరంగు షర్టు వేసి కొత్త వేషం వేశారు.

ఇక్కడ చంద్రబాబు నాయుడులోని 'అంతా నా ఇష్టం' అనే తత్వం బయటపడటంతో పాటు.. ఆయన అసమర్థత కూడా బయటపడుతూ ఉంది. మోడీకి మద్దతుగా ఉంటూ, మోడీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి.. రాష్ట్రానికి ప్రాణప్రదమైన, తమ ఎన్నికల హామీ అయిన ప్రత్యేకహోదాను సాధించలేకపోవడం చంద్రబాబు అసమర్థకు నిదర్శనం. నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని.. హోదా సాధించలేక.. హోదా ఇవ్వని అప్పుడే తేల్చేసిన మోడీ సర్కారు నుంచి బయటకు రాకుండా చంద్రబాబు నాయుడు అన అసమర్థతను, అవకాశవాదాన్ని చాటుకున్నారు. తీరా ఇప్పుడు తనేదో పోరాట యోధుడిని అని ప్రచారం చేసుకోవడానికి ప్రజల సొమ్ముతో దీక్షలు. ఒక్క ప్రత్యేకహోదా అంశం చాలు.. చంద్రబాబు నాయుడు ఎంత అవకాశవాదో, రాష్ట్ర ప్రయోజనాల మీద ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవడానికి!

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?
ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపులతో.. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం పోయేలా చేశారు చంద్రబాబు నాయుడు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారు. ఒక పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్లకూడదని అంటోందని అంటోంది రాజ్యాంగం. అలా వెళ్లాలని అనుకుంటే.. మొదట పార్టీ నుంచి లభించిన ఎమ్మెల్యే హోదాకు రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఆ రాజ్యాంగ నియమాన్ని అతిక్రమిస్తే.. సదరు నేతలపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్‌ వ్యవస్థకూ అధికారాన్ని అప్పగించింది. అయితే ఈ ఐదేళ్లలో ఈ స్పీకర్‌ వ్యవస్థ చేసినది ఏమిటి? చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో నెగ్గిన ఇరవై మూడుమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు. ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే సంతలో పశువుల్లా అమ్ముడుపోయారు. అలాంటి 'పశువులు'కు చంద్రబాబు నాయుడు పచ్చ కండువాలను పలుపుతాడులుగా వేశారు. వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు, స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేయలేదు, వ్యవహారం కోర్టుకు వెళ్లినా.. ఇప్పటివరకూ వారు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.

ఈ పరిణామాలను గమనిస్తున్న సామాన్యులు ఆఖరికి ఎమ్మెల్యేలనే ఛీదరించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అంటే వాళ్లు సంతలో పశువులు అని చంద్రబాబు నాయుడే చేల్చేశాకా, వాళ్లను సంతలో పశువుల్లా కొనుకోవచ్చని తేల్చాకా.. ఎమ్మెల్యేలకు విలువ ఏముంటుంది? ఫిరాయించిన వారినేకాదు.. వారే వాళ్లను కూడా ప్రజలు నమ్మకుండా అవుతున్నారు. ఏ పార్టీ తరఫున నెగ్గినవాళ్లు అయినా.. అధికార పార్టీవైపు వెళ్లిపోతారులే.. అని అనుకుంటున్నారు. ఇదీ చంద్రబాబు నాయుడు 'ఎమ్మెల్యే'లకు తెచ్చిన ఘనకీర్తి.

రాజకీయ నేతలకు మొన్నటివరకూ సమాజంలో ఎంతోకొంత విలువ ఉండేది. అయితే ఆ విలువను కోట్ల రూపాయల్లోకి కన్‌వర్ట్‌ చేసి చంద్రబాబు నాయుడు.. వారిని డబ్బుకు అమ్ముడయ్యే వారిగా మార్చారు. ఇక బాబుగారి మంత్రివర్గం మరో నిస్సిగ్గు వ్యవహారం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేల్లో నలుగురు బాబుగారి కేబినెట్‌లో మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఇప్పటికీ సాంకేతికంగా వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే బాబుగారు మాత్రం వారిని మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఉన్నారు. రాజకీయంలో ఫిరాయింపులను చాలా రాష్ట్రాల్లోనే చూస్తున్నాం. అయితే మరీ ఇంత నిస్సిగ్గు పందేరం.. మరెక్కడా లేదు.

కర్ణాటకలో కూడా ఫిరాయించి వచ్చే ఎమ్మెల్యేలకు బీజేపీ స్వాగతం పలుకుతోంది. అయితే అలా వచ్చిన వారిచేత రాజీనామా చేయించడానికి బీజేపీ సిద్ధమని ప్రకటిస్తోంది. వారిని మళ్లీ తమ పార్టీ తరఫున పోటీచేయించి గెలిపించుకుంటామని బీజేపీ నేతలు సదరు ఫిరాయింపుదారులకు హామీ ఇస్తున్నారు. అయితే చంద్రబాబు నాయడులో మాత్రం ఈపాటి నీతి కూడా లేకుండా పోయింది! ఫిరాయించిన ఎమ్మెల్యేల చేతకానీ, తన మంత్రివర్గంలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల చేతకానీ రాజీనామా చేయించాలని చంద్రబాబు నాయుడు అనుకోలేదు. నవ్విపోదరు గాక.. అన్నట్టుగా వ్యవహరించారు.

చెప్పే నీతులకు కొదవే లేదు!
'చెప్పేవి శ్రీరంగనీతులు.. 'అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పే శ్రీరంగనీతులకు కొదవే ఉండదు. ఆ మధ్య కోల్‌కతా వెళ్లి కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని అన్నారు. అంతకన్నా ముందు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ నుంచి తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ద్రోహులు అని ధ్వజమెత్తారు. అయితే అచ్చం అలాంటి ఎమ్మెల్యేల చేత తను ఫిరాయింపులు చేయించిన విషయం, వారిలో నలుగురికి అనైతికంగా, అప్రజాస్వామికంగా మంత్రి పదవులు ఇచ్చినట్టుగా.. ఎవరికీ తెలియదు, ఎవరూ గమనించట్లేదు అనేది చంద్రబాబు లెక్క. బాబులోని ఈ విశ్వాసానికి కారణం చేతిలోని మీడియా. ఈ ఫోర్త్‌ ఎస్టేట్‌ను చంద్రబాబు నాయుడు ఏనాడో తన స్వార్థానికి కలుషితం చేశారు. మీడియా సహకారంతోనే అనైతికంగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి తన కులం కబంధ హస్తాల్లోని మీడియా సహకారంతో తన రాజకీయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే తను అప్రజాస్వామ్యిక అనైతిక చేష్టలకు పాల్పడుతూనే.. మళ్లీ ఎన్ని నీతులనైనా చెప్పగలరు చంద్రబాబు.

ఓట్ల రాజకీయం..
రాజ్యాంగం భారత పౌరుడికి ఇచ్చిన ఓటు హక్కు విషయంలో కూడా చంద్రబాబు మార్కు రాజకీయం సాగుతోంది. సర్వేల పేరుతో తమకు వ్యతిరేకం అయిన వారిని గుర్తించి.. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొన్ని నెలలుగా సాగుతోంది. పట్టణాల్లో గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీకి పడతాయనే ఓట్ల తొలగింపుకు ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్నారు. తాము చెప్పినట్లుగా ఓట్లను తొలగించకపోతే.. అధికారులపై వేధింపులకు కూడా వెనుకాడటం లేదు. ఇలా ప్రభుత్వ వ్యవస్థల్లోకి పచ్చ పార్టీవాళ్లు చొరబడిపోతున్నారు.

పోలీస్‌ వ్యవస్థపై మచ్చలు!
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీ పోలీసుల తీరును అంతా గమనించారు. కనీస విచారణ అంటూ ఏమీలేకుండా.. ఆ ఘటనపై ఏపీ డీజీపీ ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు ఆధారం ఏమిటి అంటే.. ఏమీలేదు,. అదో చిలక జోస్యం. దాన్ని చెప్పిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ. ఆ తర్వాత ఏపీ పోలీసులు ఆ ఘటనపై విచారణ చేసి చెప్పినది ఏమిటి? అంటే.. డీజీపీ చెప్పినదాంట్లోని కీలకమైన పాయింట్లు అబద్ధాలు అని. రాష్ట్ర డీజీపీ ప్రకటనకు ఉన్న విలువ అది. ఇక డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో ఒక కులానికే ప్రాధాన్యతను ఇచ్చారు.. అన్ని కులాలనూ పక్కనపెట్టి తెలుగుదేశానికి సహకరించే కులం వాళ్లకే ప్రమోషన్లు ఇచ్చారని.. ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తే.. అది అబద్ధమని ఎదురుదాడి చేశారు కానీ, తమ వాదన నిజం అని చెప్పుకోవడానికి సదరు జాబితాను విడుదల చేయలేదు. ఎదురుదాడి చేస్తేచాలు.. అనేతత్వం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అలవాటు అయినదే!

అన్ని వ్యవస్థలపై నమ్మకం పోయింది!
రాజ్యాంగ బద్ధంగా నడవాల్సిన రాజకీయ వ్యవస్థనూ నాశనం చేశారు. ప్రజల నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలను 'పశువులు'గా ప్రజల ముందు నిలబెట్టారు. రాజ్యాంగబద్ధమైన శాసన వ్యవస్థ సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. చట్టం తెలుగుదేశం పార్టీ చుట్టమే.. అని నిరూపించారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం లేకుండా చేశారు. మీడియాను భజనకు మాత్రమే పరిమితం చేశారు. ప్రజాస్వామ్యానికి ఏ వ్యవస్థలు అయితే పట్టుగొమ్మలు అంటారో.. ఆ వ్యవస్థలను ఇంతకు దిగజార్చిన ఘనత చంద్రబాబుదే. ఈ విషయంలో చంద్రబాబుకు చంద్రబాబే పోటీ. ఐదేళ్ల బాబు పాలనకు ఇదే ప్రోగ్రెస్‌ కార్డ్‌.

ఇలాగే వదిలేస్తే...
ఇప్పటివరకూ చంద్రబాబు హయాంలో రాజకీయ, శాసన, చట్ట, పత్రికా వ్యవస్థలే పతనావస్థను చూశాయి, చూస్తున్నాయి. ఆల్రెడీ జన్మభూమి కమిటీల రూపంలో పల్లెల్లో పచ్చ పార్టీన నియంతృత్వం మరోటి నడుస్తోంది. ఇసుక, మట్టి, నీళ్లు.. అన్నీ అధికార పార్టీ వాళ్ల అబ్బ  సొత్తుగా.. వాళ్ల వ్యాపారంగా.. వాళ్లు కోట్ల రూపాయలు సంపాదించుకునే మార్గాలుగా మరాయి. ఇలాగే వదిలేస్తే... బాబుకు మరో అవకాశమే వస్తే.. నాజీలకు మించిన స్థాయిలో నాశనం చేసేలా ఉన్నారు. పచ్చవాడు తప్ప మరొకడు బతకడానికి కూడా కష్టం అయిపోయే పరిస్థితి వస్తుంది. రాజకీయాలకు అతీతంగా.. ప్రజలందరి జీవితాలనూ స్తంభింపజేసే ఒక నియంతృత్వ పోకడ ఏపీలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబుకు మరో అవకాశమే లభిస్తే.. జరగబోయేది అదే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకూ తమకు ఏం ఇబ్బంది రాలేదనుకునే వాళ్లు.. అప్పుడు జర్మన్‌ ప్రొటెస్టెంట్‌ మార్టిన్‌ మూలర్‌లా చింతించాల్సిదేనేమో!

-జీవన్‌ రెడ్డి.బి

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైనవారు!
గత ఎన్నికలప్పుడు.. టగ్‌ ఆఫ్‌ వార్‌ అనే పరిస్థితుల్లో.. చంద్రబాబు అనుభవానికి కొద్దిశాతం మంది ప్రజలు మొగ్గుచూపారు. దీంతో బాబుకు అధికారం దక్కింది. అయితే తీరా అధికారం దక్కాకా.. బాబు గ్రాఫిక్స్‌తోనే సమయం గడిపారు. ఇదే సమయంలో బాబు పాలనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో బాబు మీడియానే నమ్ముకున్నారు. ఆ మీడియా ద్వారా మసిపూసి మారేడుకాయ చేయవచ్చు అని బాబు భావిస్తున్నారు. తను ఏంచేసినా.. దాన్నే ప్రజలు నమ్ముతున్నారన్నట్టుగా మీడియా ద్వారా మేనేజ్‌ చేసే ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు బాబు కన్నా తెలివైనవారు. క్షేత్రస్థాయిలో బాబు పాలన ఎలా ఉందో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వ్యవస్థలను బాబు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అర్థమైంది. బాబు గతంలో చిత్తు అయినప్పుడు కూడా ఆయనకు మీడియా అండ ఉండింది. మీడియా ప్రతిసారీ రక్షించలేదు అని చెప్పడానికి ఆ రుజువులు. తెలుగుదేశం పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించే మారుతున్నారు. బాబుపాలన ఎలాసాగిందో అర్థం చేసుకోవడానికి ఇవే రుజువులు.

-విశేష్‌, మానసిక, సామాజిక విశ్లేషకులు.

బాబుకు ఈ అసహనం పనికి రాదు...
మనకు వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఉన్నట్టే.. ఎన్నికల కాలం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆ కాలం నడుస్తోంది. కాబట్టే ప్రతి రాజకీయ నేతలో ఉత్సాహం, ప్రతి పార్టీ కార్యాలయం కళకళలాడుతున్నాయి, వచ్చిపోయే నేతలతో. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలే కాదు.. పథకాలు కూడా కళకళలాడుతున్నాయి. అయితే నేతలు ఆలోచించాల్సింది ఏమిటంటే.. ప్రజలు ఆ పథకాలను ఎలా చూస్తున్నారు అని.. వాస్తవానికి ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు తెలంగాణ, నవ్యాంధ్ర అని చూశాం. ఇప్పుడు నాలుగున్నరేళ్ల నవ్యాంధ్ర, ఇప్పటి నవ్యాంధ్ర అని చూడాల్సి వస్తోంది. నాలుగున్నరేళ్లుగా అంతంత మాత్రంగా నడుస్తున్న పథకాలు, అసలు నడవని పథకాలు.. వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరుగులుపెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇవన్నీ ఫలిస్తే మళ్లీ అతడికి ఓటు వేస్తారనే ఆశ ఉండొచ్చు. ప్రతి రాజకీయనేతకూ అధికారం కావాలనే ఆశ ఉంటుంది. అది తప్పుకాదు. ఎంచుకునే దారులు ఏమిటనేది ప్రజలు చూస్తూ ఉంటారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతే వాళ్లను ఓడించండి అని పిలుపునిచ్చాడితను. సరిగ్గా మూడేళ్లక్రితం కొందరు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి చేరినప్పుడు, వారు జగన్‌ను తిట్టారు. వారు తిట్టారనేకన్నా బాబు వెనుకుండి తిట్టించారు అనడం కరెక్ట్‌. రాజకీయాలను ఒక క్రీడ అని నువ్వు అనుకున్నప్పుడు.. క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలి. నువ్వేం చేస్తున్నావో అంతా గమనిస్తున్నారు అనే విషయం గమనించాలి. ఇవి రాజరికపు రోజులు కావు.

ఒక నాయకుడు మహానాయకుడు కావాలంటే చాలా ఓర్చుకోవాలి, చాలా ఉదారత కనిపించాలి. తను సీనియర్‌ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరింత సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు. అలాగే ప్రతిపక్షనేత కూడా ఈ హడావుడి కంటే కూడా.. ప్రజలకు తామేం చెప్పదలుచుకున్నారు. తాము ప్రజలకు ఏం ఇవ్వదలుచుకున్నారనే అంశంపై శ్రద్ధపెడితే.. ఎవరిని ఎన్నుకోవాలనే ప్రజలు నిర్ణయిస్తారు.

-రామదుర్గం మధుసూదన రావు, సీనియర్‌ జర్నలిస్టు