
చంద్రబాబునాయుడు అటూ ఇటూ తిరిగి ఇపుడు స్వామీజీల మీద కూడా పడ్డాడని ఆస్తిక జనులు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో బాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని కూడా మండిపడుతున్నారు.
లేకపోతే కుప్పంలో ఓడిపోయాక బాబు ఏదేదో మాట్లాడేస్తూ విశాఖ శారదాపీఠంపైన దారుణమైన కామెంట్స్ చేయడమేంటి అని బ్రాహ్మణ సమాజం పెద్దలు నిలదీస్తున్నారు.
శారదాపీఠంలో ఉన్న అమ్మవారు రాజశ్యామల మాత, అక్కడ కొలువు తీరిన అమ్మవారు శాంతమూర్తి అని ఆమెకు చేసే అర్చనలతో లోకం సుభిక్షంగా ఉంటుందని ఉమ్మడి ఏపీ అర్చక పురోహిత పరిషత్తు కార్యదర్శి ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ చెప్పుకొచ్చారు.
అలాంటిది పెందుర్తి శారదాపీఠంలో క్షుద్ర పూజలు చేస్తున్నారని, తనను చంపడానికే ఇదంతా చేస్తున్నారని బాబు గంగవెర్రులెత్తడం పూర్తిగా క్షుద్ర రాజకీయమేనని అంటున్నారు.
అధికార వ్యామోహం చంద్రబాబు కళ్ళు కప్పేయడంతోనే ఇలా దేవుడికీ, దెయ్యానికీ తేడా తెలియక మాట్లాడుతున్నారని కూడా శర్మ మండిపడ్డారు. శారదామాతకు చేసే పూజలను క్షుద్ర పూజలు అంటూ విమర్శించడం ద్వారా బాబు తీవ్ర అపచారానికి పాల్పడ్డారని ఆయన అంటున్నారు.
ఆఖరుకు రాజకీయాల్లోకి మతాన్ని కూడా తీసుకువచ్చి బాబు వేస్తున్న కొత్త ఎత్తులను జనాలు గమనిస్తున్నారని, ఆయనకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని కూడా శర్మ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తూంటే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లుగా చంద్రబాబు స్వాముల మీద పడడం అంటే ఆయనకు పంచాయతీ దెబ్బ గట్టిగానే తగిలింది అంటున్నారు అంతా.