cloudfront

Advertisement


Home > Politics - Political News

ఇప్పుడు జ్ఞానోదయమైందా బాబూ..!

ఇప్పుడు జ్ఞానోదయమైందా బాబూ..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారిగా జ్ఞానం వచ్చేసింది. ముందురోజు రాత్రి ఏదో కలవచ్చినట్టు, మరుసటి రోజు పొద్దున్నే మాట మార్చారు. కొత్త పల్లవి అందుకున్నారు. అవును.. మొన్నటివరకు ప్యాకేజీ ముద్దు అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు వద్దు అంటున్నారు. హోదా ఇవ్వాల్సిందే అంటూ కొత్త నాలుక బయటపెట్టారు. 

ఇదేమాటను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి నాలుగేళ్లుగా చెబుతుంటే తెగ చిరాకుపడ్డారు. చట్టాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆవేశపడ్డారు. సాధ్యాసాధ్యాలు తెలియవా అని విరుచుకుపడ్డారు. ఇన్ని మాటలన్న అదే నోటితో ఇప్పుడు ప్రత్యేకహోదా పలుకు పలికి ప్రతిపక్షంతో కలిసిపోయారు.

ముఖ్యమంత్రి తానా అంటే తందానా అనడం మంత్రులకు వెన్నతో పెట్టిన విద్య. అంతే.. ఒక్కసారిగా వీళ్లందరి రంగులు మారిపోయాయి. మొన్నటివరకు 'ప్యాకేజీ' మైండ్ సెట్ తో ఉన్న మంత్రులంతా ఇప్పుడు హోదా.. హోదా.. హోదా.. అంటూ నినాదాలు అందుకున్నారు. ఒక్కసారిగా 14వ ఆర్థిక సంఘం, విభజన చట్టం అంటూ ఆర్థికవేత్తలుగా మారిపోయారు.

ఇదంతా ఎందుకు..? ఎవరి కోసం..? ఉన్నఫలంగా మతమార్పిడిలా మాటమార్పిడి ఎందుకు జరిగింది..? దీనికి సమాధానం సో సింపుల్. సెంటిమెంట్ ను తమవైపు తిప్పుకోవాలి. రాజకీయ పబ్బం గడుపుకోవాలి. అంతే.. అంతకుమించి మరొకటి లేదు. ఇంకో ఆలోచన రాదు.

నాలుగేళ్లుగా ప్రత్యేకహోదాపై వైఎస్ఆర్సీ పార్టీ పోరాడుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఇన్నేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ దిశగా సెంటీమీటర్ కూడా కదల్లేదనే వాస్తవాన్ని గుర్తించారు. మెల్లమెల్లగా జగన్ వైపు ఆకర్షితులవుతున్నారు. తన "డిటెక్టివ్ నివేదికల" ఆధారంగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు చంద్రబాబు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టైమ్ చూసి యూ-టర్న్ తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 29సార్లు ఢిల్లీకి వెళ్లారు బాబు గారు. కనీసం ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా గురించి ప్రధానికి గుర్తుచేయలేదు. ఎందుకంటే అప్పుడు హోదా గురించి ప్రశ్నిస్తే, 'ప్రత్యేక నిధులు' ఆగిపోతాయి కదా. అలా తమ లెక్కల్లో తాము కోరుకున్న "నిధు"ల్ని బాగానే రాబట్టుకున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగిపోయింది. 

కట్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. అందుకే సడెన్ గా హోదా గుర్తుకొచ్చేసింది. ఎందుకంటే మళ్లీ పదవిలోకి రావాలంటే హోదా అనే బంగారుబాతు తమ చేతిలో ఉండాలి కదా. అందుకే బాబుగారి నాలుక మడత పడిపోయింది. పదవిలో ఉన్నప్పుడు కేంద్రం మాత్రమే ఈయనకు కనిపిస్తుంది. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు కనిపిస్తారు. వాళ్లను మరోసారి మభ్యపెట్టాలంటే ప్రత్యేకహోదా అంశానికి బూజు దులపాల్సిందే. అందుకే ఈ సమన్వయ కమిటీ సమావేశాలు, అఖిలపక్షం అనే కొత్తమాటలు.

నిజానికి ఇప్పుడు కూడా బాబుగారికి జ్ఞానోదయం అయ్యేదికాదు. ప్రత్యేకహోదా అంశాన్ని జగన్ విపరీతంగా వాడేస్తున్నారని ఈయనగారి భయం. నాలుగేళ్ల నుంచి జగన్ చేస్తున్న పోరాటానికి ప్రతిఫలంగా కేంద్రం ఏమైనా ప్రకటన చేస్తే ఆ క్రెడిట్ ఆయన ఖాతాలోకి వెళ్లిపోతుందేమోనని బాధ. పదవి జారిపోతుందేమో అనే టెన్షన్. అంతేతప్ప, ప్రజలపై ప్రేమకాదు.