cloudfront

Advertisement


Home > Politics - Political News

జగన్ ను మాత్రమే సీఎం చేయమని చెప్పలేదు

జగన్ ను మాత్రమే సీఎం చేయమని చెప్పలేదు

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు రోశయ్య. ఓవైపు వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ఏర్పడిన అనిశ్చితి, మరోవైపు తెలంగాణ ఉద్యమం, ఇంకోవైపు వైసీపీ ఆవిర్భావం.. ఇలాంటి ఎన్నో ఘటనలు ఆయన హయాంలోనే చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు ఇలాంటి కీలక పరిణామాలపై రోశయ్య స్పందించారు. 

"వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసినప్పుడు నాకు ఏం అర్థంకాలేదు. అంతలా నేనెప్పుడూ బాధపడలేదు. అదే టైమ్ లో అధిష్టానం నన్ను పిలిచి ముఖ్యమంత్రిగా చేయమన్నారు. సోనియా ఆదేశాల మేరకు నేను సీఎం పదవిలోకి వచ్చాను. వైఎస్ఆర్ తర్వాత నంబర్-2 నేనే అనే ఉద్దేశం నాకు ఏ కోశాన లేదు. వాళ్లు చెప్పారు, నేను చేశాను. అంతే." 

వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తారని తను అనుకోలేదన్నారు రోశయ్య. కాకపోతే ముఖ్యమంత్రిగా ఎవర్ని నియమిస్తే బాగుంటుందనే చర్చలో తను జగన్ పేరును ప్రస్తావించానని చెప్పుకొచ్చారు.

"జగన్ ను ముఖ్యమంత్రిని చేయండి, అతడే సరైన అభ్యర్థి అని నేను చెప్పలేదు. సీఎంను చేయాలనుకుంటే లిస్ట్ లో 10 మంది ఉన్నారు, వాళ్లలో జగన్ కూడా ఒకరు, ఆలోచించి నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పాను." 

ఓదార్పు యాత్ర చేయడానికి జగన్ కు తను అనుమతి ఇవ్వలేదనే అంశంలో నిజం లేదన్నారు రోశయ్య. నిజానికి అది తన పరిథిలో లేదన్నారు. ఈ విషయాన్ని సోనియాకు నివేదించానని, ఆమె అంగీకరించలేదని చెప్పుకొచ్చారు.

"జగన్ ఓదార్పు యాత్ర చేస్తానంటే అనుమతి నిరాకరించిన మాట వాస్తవమే. కానీ దానికి రాష్ట్ర కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ టైమ్ లో జగన్ వచ్చి నన్ను కలిసిన మాట నిజమే. కానీ నిర్ణయం మాత్రం మేం తీసుకోలేదు. సోనియానే తీసుకున్నారు. ఓదార్పు యాత్ర బదులు, బాధితుల్ని జిల్లా కేంద్రాలకు పిలిపించి పరిహారం ఇవ్వమని సోనియా చెప్పారు. జగన్ అందుకు ఒప్పుకోలేదు. ఓదార్పు యాత్ర చేశారు." 

ఇక కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన సమయంలో.. తెలంగాణపై కాంగ్రెస్ చేసిన ప్రకటనతో కూడా తనకు సంబంధం లేదన్నారు రోశయ్య. తెలంగాణకు మద్దతుగా ఆరోజు కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రకటన చేస్తుందని తను అనుకోలేదని, ప్రకటన చేయడానికి కొద్దిసేపు ముందు తనకు సమాచారం ఇచ్చారని, తర్వాత వాళ్ల పని వాళ్లు చేశారని అన్నారు.