Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ధైర్యం చేశారు.. కేసీఆర్ వెనక్కు తగ్గారు

జగన్ ధైర్యం చేశారు.. కేసీఆర్ వెనక్కు తగ్గారు

హూజూర్ నగర్లో భారీ వర్షం, కేసీఆర్ సభ రద్దు. నిన్నంతా మీడియాలో ఇదే బ్రేకింగ్ న్యూస్. హుజూర్ నగర్లో వర్షం పడింది కానీ కేసీఆర్ సభ రద్దు చేసుకునేంత పెద్ద వర్షమేమీ కాదు. అరగంటసేపు దంచికొట్టి ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది. వాతావరణం అనుకూలించడం లేదనే కారణంతో కేసీఆర్ హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అనుమతివ్వలేదని, అందుకే ఆయన పర్యటన రద్దయిందని బైటకు కబురొచ్చింది.

సరిగ్గా రెండు రోజుల క్రితం.. వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి జగన్ నెల్లూరు వచ్చారు. మంగళవారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటలో దిగారు. అక్కడినుంచి నెల్లూరు సభా ప్రాంగణానికి హెలికాప్టర్లో వెళ్లాలి. అప్పుడే భారీ వర్షం మొదలైంది. అధికారులు హెలికాప్టర్ ప్రయాణానికి సందేహించారు. జగన్ కి విషయం చెప్పారు. కాసేపు వేచి చూద్దాం అన్న ఆయన, వర్షం తగ్గగానే హెలికాప్టర్ తీయమన్నారు. రేణిగుంటలో ఓకే, మరి నెల్లూరులో పరిస్థితి ఏంటి? అక్కడ వర్షం పడుతుంటే ల్యాండింగ్ కష్టమే కదా అని సంకోచించి అదే విషయాన్ని మళ్లీ జగన్ కి చెప్పారు.

ఆయన ససేమిరా అన్నారు, సభకు టైమ్ అవుతోంది, వేలాది మంది రైతులు అక్కడ వేచి చూస్తున్నారు. వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. అధికారులు చేసేదేంలేక హెలికాప్టర్ తీశారు. అనుకున్నట్టే అయింది, మార్గమధ్యంలోనే మళ్లీ వర్షం. నెల్లూరులో జగన్ దిగే సమయానికి జోరువాన. వర్షంలోనే జగన్ హెలికాప్టర్ నెల్లూరులో దిగింది. జగన్ కు వరుణుడు ఘన స్వాగతం పలికారని రైతులంతా హర్షం వ్యక్తంచేశారు. వాస్తవానికి అది చాలా రిస్కీ జర్నీ, వర్షంలో ల్యాండింగ్ చేయడానికి అధికారులు ఆలోచిస్తున్నా జగన్ ధైర్యం చెప్పారు. వర్షంలో జగన్ తో పాటు, మంత్రులు, అధికారులు తడుస్తూనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

ఇక హుజూర్ నగర్ సంఘటన చూస్తే కేసీఆర్ కోసం భారీగా జన సమీకరణ జరిగింది. ఉప ఎన్నికల నేపథ్యంలో, అందులోనూ ఆర్టీసీ సమ్మె ఉధృతంగా ఉన్న సమయంలో సభ భారీ సక్సెస్ కావాలని జనాల్ని తీసుకొచ్చారు టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఒక్క స్లోగన్ కూడా వినపడకూడదని జల్లెడపట్టి మరీ అస్మదీయుల్ని ఏరుకుని వచ్చారు. కానీ చివరి నిముషంలో కేసీఆర్ వెనకడుగేశారు. వర్షం సాకు చూపి సభను క్యాన్సిల్ చేశారు. కేసీఆర్ అనుకుంటే అరగంట ఆలస్యంగా అయినా సభకు వచ్చేవారు, కానీ రాలేదు.

అక్కడ జగన్ జనం కోసం వర్షంలోనే రిస్క్ చేశారు, ఇక్కడ కేసీఆర్ ఆర్టీసీ సమ్మె భయంతో వర్షం తగ్గిన తర్వాత కూడా భయపడ్డారు. రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ సచివాలయం నుంచి ప్రారంభించినా అడిగేవారెవరూ లేరు. కానీ హుజూర్ నగర్ లో ఎన్నికల సభ ఉంది. కేసీఆర్ వెళ్లకపోతే, ప్రచారం చేయకపోతే ఫలితం తేడా వచ్చే పరిస్థితి. అయితే అక్కడ జనం కోసం జగన్ ధైర్యం చేశారు, ఇక్కడ జనాన్ని, వర్షాన్ని చూసి కేసీఆర్ భయపడ్డారు. 

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?