cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రైతు బాంధవుడు.. తండ్రి బాటలోనే తనయుడు

రైతు బాంధవుడు.. తండ్రి బాటలోనే తనయుడు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలను ఎన్ని అమలు చేసినా.. ముఖ్యంగా రైతులు ఆయన్ను తమ దేవుడిగా పూజిస్తారు. ఉచిత విద్యుత్ సహా రైతులకు మేలు చేసే అనేక పథకాలను ఆయన అమలులోకి తెచ్చారు. జలయజ్ఞం పేరుతో సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి బాటలు వేశారు. అలాంటి రైతులే 2014లో రుణమాఫీ అనే ఒకే ఒక్క అంశానికి బోల్తాపడి చంద్రబాబుకి ఓటేశారు, ఐదేళ్లు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు.

ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. నవరత్నాల హామీలతో ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రైతు బాంధవుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోడానికి తాపత్రయ పడుతున్నారు. సాగునీరు సకాలంలో అందితేనే ఏ రైతయినా సంతోషంగా ఉండగలడు. దానికి మానవ ప్రయత్నం కంటే ఎక్కువగా ప్రకృతి సహకరించాలి. రెండోది సకాలంలో పంట రుణాలు, విత్తన సరఫరా, గిట్టుబాటు ధరలు కల్పించాలి. ఇది సర్కారు చేతిలో పని.

వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడులకు భరోసా ఇచ్చారు జగన్, విత్తనాల సరఫరాకు కూడా నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు. దళారుల రాజ్యం లేకుండా గిట్టుబాటు ధరలకు మాటిచ్చారు. అంటే ఇక్కడ గత ప్రభుత్వం కంటే మిన్నగానే ఉన్నారు. ఇక మూడోది, అత్యంత ముఖ్యమైనది రైతుల భూముల వ్యవహారం. పంటసాగు కంటే రైతుకు తలకు మించిన భారం ఇది. పంట పొలాలపై హక్కులు, సీజేఎఫ్ఎస్ ల్యాండ్స్, చుక్కల భూములు, రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, పట్టాదారు పాసు బుక్కులు.. ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటారు రైతులు.

వీటన్నిటి పరిష్కారం కోసమే జగన్ రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి రైతుల భూమి హక్కులకు సంబంధించిన సమస్యలకు అర్జీలు అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. వాటిని నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించేలా గడువు విధిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అపరిష్కృతంగా ఉన్న సీజేఎఫ్ఎస్ ల్యాండ్స్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. చుక్కల భూముల రైతులకు టీడీపీ సర్కారు మొండిచేయి చూపగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.

తాజాగా భూమి రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో తప్పొప్పుల సవరణ మొదలైంది. ఎప్పట్నుంచో రైతులు కోరుకుంటున్నది ఇదే. చాలామంది రైతులు పొలంలో సేద్యం చేసుకుంటారు కానీ, దానిపై తమకు పూర్తిస్థాయి హక్కు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. రికార్డుల్లో ఉంటే, ఆన్ లైన్లో ఉండదు, ఆన్ లైన్లో చూపిస్తే, రికార్డుల్లో దొరకదు. నిత్యం ఇలాంటి సమస్యలతో ఎమ్మార్వో ఆఫీస్ లకు వందలాది మంది రైతులు వస్తుంటారు. వీరి కష్టాలన్నిటినీ తీర్చే దిశగా జగన్ తొలి అడుగు వేశారు, అదీ తొలి ఏడాదిలోనే. జగన్ ప్రయత్నం ఫలిస్తే రైతుబాంధవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది