Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ముందున్న సిసలైన సవాల్

జగన్ ముందున్న సిసలైన సవాల్

మాట ఇవ్వడం సులువు..నిలబెట్టుకోవడం కష్టం. అందులోనూ అడుగు అడుగునా కుట్రలు, కుతంత్రాలు నిండిన రాజకీయాల్లో మరీ కష్టం. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన అందించాలని నిర్ణయించుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ దిశగానే ప్రయాణం సాగిస్తున్నారు. అది కొందరికి నచ్చ వచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ జగన్ పద్దతి జగన్ ది. ఇలాంటి నేపథ్యంలో జగన్ చెప్పిన ఓ మాట ఇప్పుడు చర్చనీయాశంగా మారే సమయం వచ్చేసింది.

అఖండ ప్రజాదరణతో తను  ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ, ఎవరూ అడగకుండానే జగన్ ఓ మాట వదిలారు.  పార్టీలోని ఆశావహులు అందరికీ నచ్చే మాట ఇది. అర్హులు అందరికీ అవకాశం కల్పించే పద్దతి ఇది. ప్రతి రెండున్నర్ నెలలకు ఓసారి తన మంత్రి వర్గాన్ని పూర్తిగా మారస్తానని, అర్హులైన అందరికీ అవకాశం కల్పిస్తామని జగన్ స్సస్టంగా చెప్పేసారు.

మంత్రి వర్గంలో స్థానం లభించని వారంతా అప్పటి నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. జగన్ మాట ఇస్తే మాటే అని నమ్మే పార్టీ జనాలు కచ్చితంగా కొత్త మంత్రి వర్గం ఏర్పడుతుందని నమ్ముతున్నారు. మంత్రి వర్గంలో మార్పులుచేయడం విషయంలో జగన్ వెనక్కు తగ్గకపోవచ్చు. కానీ ఈ ఫీట్ ను ఎలా చేస్తారు అన్నదే పాయింట్.

వైఎస్ జగన్ ఎన్ని విధాలా టార్గెట్ చేయాలో అన్ని విధాలా ప్రయత్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం. మరోపక్క ఓ బలమైన సామాజిక వర్గం, దాని గుప్పిట్లో వున్న మీడియా నిత్యం జగన్ ను టార్గెట్ చేస్తూనే వుంది. అయిదేళ్లు పూర్తి చేసుకుని జగన్ ఎన్నికలకు  దిగితే, తాము ఢీకొనగలమో లేదో అన్న అనుమానం. 

జగన్ పాలన తమకు నచ్చకపోయినా, జనానికి నచ్చేసి మరోసాతి తమను పక్కన పెడతారేమో అన్న సందేహం ప్రతిపక్షాన్ని, అలాగే ఆ సామాజిక వర్గాన్ని పట్టి పీడిస్తోంది. అందుకే అడ్డదారిలో జగన్ ఎదుర్కొవాలి. జగన్ కిందకు లాగాలి, అధికారం నుంచి తప్పించాలి అనే యావతో వున్న వర్గానికి ఈ మంత్రి వర్గ మార్పు కార్యక్రమం ఆశావహంగా కనిపిస్తోంది.

ఇది కాస్తా పార్టీలో అసంతృప్తిని రాజేస్తుందేమో? రఘరామరాజు లాంటి వాళ్లు మరి కొందరు పుడతారేమో? వాళ్తను వాడుకుని తమకు నచ్చినట్లు ఆట ఆడించవచ్చు అని ఆశగా ఎదురుచూస్తోంది. ఇలాంటి కీలక వ్యూహాల నడుమ జగన్ తన మాట నిలబెట్టుకోవాల్సి వుంది. ప్రస్తుతం వున్న మంత్రి వర్గం అందరినీ కాకున్నా, సగం మందిని అయినా మార్చి కొత్త వారికి అవకాశం కల్పించాల్సి వుంది.

అయితే అలా మార్చేయడం అంత సులువు కాదు. పార్టీ మీద ఎంత ఎదురులేని పట్టు వున్నా, సామాజిక సమీకరణాలు, వ్యక్తుల బలాబలాలు అన్నీ చూసుకోవాలి. నచ్చినా నచ్చ కున్నా కొందరిని మార్చకుండా వుండాల్సి వుంటుంది. మరి కొందరికి అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. పదవి కోల్పోయిన వారిని బుజ్జగించాల్సి వుంటుంది. తిరుగుబాటు బావుటా ఎగరవేసే ఆలోచన వున్నవారిని ఓ కంట కనిపెట్టాల్సి వుంటుంది.

బోత్స లాంటి సీనియర్లను మంత్రి వర్గంలో వుంచుకోకతప్పదు. ధర్మాన సోదరుల్లో ఒకరికి మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు కాబట్టి, రెండోవారికి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే ఆలోచన చేయవచ్చు. అవంతి లాంటి వారికి విశ్రాంతి ఇచ్చి అమరనాధ్ లాంటి వారికి చేయి అందిచవచ్చు. కన్నబాబు లాంటి వారి పనితీరును లెక్కలు వేయవచ్చు.

బుగ్గన లాంటి వారిని కొనసాగిస్తారా? నచ్చ చెప్పి పక్కన పెడతారా అన్నది చూడాలి. అనిల్ కుమార్ లాంటి ఫైర్ బ్రాండ్ లను ఏం చేస్తారో చూడాలి? వివిధ కుల సమీకరణలను చూసుకుంటూనే గత మంత్రి వర్గం ఏర్పాటుచేసారు. ఇప్పుడు ఆ సమీకరణలు టోటల్ గా చూడాలి. జిల్లాల వారీగా చూడాలి. ప్రాంతాల వారీగా చూడాలి.

ఇప్పటికే వున్న ఉప ముఖ్యమంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదు అని వినిపిస్తోంది. అలాగే మహిళా మంత్రుల్లో కూడా కొందరికి ఉద్వాసన అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఫీట్ చేయడం అన్నది జగన్ కు కత్తిమీద సామే. జగన్ తన స్టయిల్ లో దుందుడుగా వ్యవహారించడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే మాంచి ఊపుతో అధికారం వచ్చిన కొత్తలో మంత్రి వర్గం ఏర్పాటుచేయడం వేరు, రెండున్నరేళ్ల తరువాత, ఎదర ఎన్నికలు పెట్టుకుని మంత్రి వర్గంలో మార్పులు చేయడం వేరు.

ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఇక తమకు అవకాశం లేదు అనో, లేదా ఇక తమను పక్కన పెట్టేసారు అనో, ఏమాత్రం గ్రహింపు వచ్చినా, లేదా జగన్ ఫోటో మీద మాత్రమే కాకుండా తమ స్వంత బలం మీద గెలిచిన ధీమా ఏమాత్రం వున్నా, సన్నాయి నొక్కుళ్లు, సణుగులు వినిపించడం ఖాయం. వీటిని తట్టుకోవాల్సి వుంటుంది. సర్దుబాటు చేయాల్సి వుంటుంది.

పార్టీలో అసంతృప్తి అనేది లేదు అని అనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది. ప్రస్తుతానికి అంది అణిగిమణిగి వుంది. మంత్రులకు మంత్రులకు మధ్య, పెద్ద నాయకుల మధ్య అడ్డుతెరలు అలాగే వున్నాయి. ఇప్పుడు ఈ మంత్రి వర్గ మార్పులు అన్నది వాటిని మరింత పెంచకూడదు. పార్టీ విజయావకాశాలను దెబ్బతీయకూడదు. మరింత మంది రఘురామలరాజులను తయారుచేయకూడదు.

ఈ ఫీట్ ను జగన్ కనుక దిగ్విజయంగా పూర్తి చేస్తే, రాజకీయం పూర్తిగా వంటబట్టినట్లే. పార్టీని నడపడం అనే విద్యను పూర్తిగా నేర్చుకున్నట్లే. ఈ సంగతి తెలియాలంటే మరి కొద్ది నెలలు ఆగితే తెలిసిపోతుంది. లేదూ, ఈ తలకాయనొప్పలు అన్నీ ఎవరు పడతారు అని అసలు మార్పులే చేయకుండా కాలయాపన చేస్తే, జగన్ కూడా చంద్రబాబు దారిలోకి వెళ్లిపోయినట్లే.

చాణక్య

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?