Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు రోడ్డుపాలు

జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు రోడ్డుపాలు

జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు ‘రోడ్డు’పాలైంది. టెండ‌ర్ల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ చెప్పే నిష్పాక్షిక‌త‌, పార‌ద‌ర్శ‌క‌త లాంటి వాటిపై అనుమానాలు క‌లిగించేందుకు బీజం ప‌డింది. ఇందుకు న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ర‌ద్దే నిద‌ర్శ‌నం. ఏపీలో 13 జిల్లాల్లోని 26 ప్యాకేజీలకు 25 బిడ్లు దాఖ‌లవ్వ‌డం, అన్నీ ముందుగా ఓ ప‌థ‌కం ప్ర‌కారం నిర్ణ‌యించిన కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కే ద‌క్క‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఎన్‌డీబీ రోడ్డు పనుల టెండర్ల విషయంలో డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెంట్ల ఎంపిక నుంచి టెండర్ల నిర్వహణ వరకు చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై మీడియాలో క‌థ‌నాలు రావ‌డం జ‌గ‌న్ స‌ర్కార్‌ను క‌ల‌వ‌ర‌పెట్టింది.  ఏ జిల్లా టెండరు ఎవరికి దక్కాలో ముందుగానే నిర్ణయించి అందుకు అనుగుణంగా బిడ్‌లు వేసేలా వ్యూహం రచించార‌ని, చిన్న, మధ్యస్థాయి కాంట్రాక్టర్లు వర్క్‌ల్లో పాల్గొనకుండా కొత్త నిబంధ‌న‌లు పెట్టారంటూ వివ‌రాల‌తో స‌హా ఆంధ్ర‌జ్యోతిలో వ‌రుస క‌థ‌నాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ క‌థ‌నాల నేప‌థ్యంలో త‌మ పాల‌న‌పై న‌మ్మ‌కం, అనుమానాల‌కు తావు లేకుండా రోడ్డు నిర్మాణ ప‌నులు చేప‌ట్టే ఉద్దేశంతో, ఆ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయ‌డం అభినంద‌నీయం. అయితే ఈ సంద‌ర్భంగా రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు చేసిన వ్యాఖ్య‌లు జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు తీశాయి.

‘కొన్ని వార్తాపత్రికలు, పనికట్టుకుని నిరాధారమైన వార్తలు ప్రచురించడం, ప్రజల్లో లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా దురుద్దేశ పూర్వక రాతలు రాశాయి. వాటిని నివృత్తి చేస్తూ టెండరుదారుల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు కలగకుండా ఈ టెండర్లు రద్దు చేశాం’

‘ఈసారి టెండర్లలో కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొనేలా... వారిలో కాన్ఫిడెన్స్‌ తీసుకొస్తాం. కాంట్రాక్టర్లను సంప్రదిస్తాం. వారికున్న ఇబ్బందులు, సమస్యలు ఏమిటో తెలుసుకుంటాం. ఒక్కో ప్యాకేజీకి రెండు కంపెనీలే ఎందుకు బిడ్‌లు వేశాయి? పెద్ద కాంట్రాక్టు సంస్థలు ఎందుకు పాల్గొనలేదో, లోపం ఎక్కడుందో పరిశీలిస్తాం’ అని కృష్ణబాబు మీడియా స‌మావేశంలో చెప్పుకొచ్చారు.

మీడియాలో నిరాధార , దురుద్దేశ‌పూరిత క‌థ‌నాలు రాస్తే ... వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాలే గానీ, టెండ‌ర్లు ర‌ద్దు చేయ‌డం ఏంటి?  పైగా టెండ‌ర్ల ర‌ద్దుకు పొంత‌న లేని స‌మ‌ర్థ‌న‌లు. టెండ‌ర్ల ర‌ద్దుకు, ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యాల‌కు ఎక్క‌డైనా లాజిక్ కుదురుతోందా? ఈ సారి టెండ‌ర్ల‌లో కాంట్రాక్ట‌ర్లు పెద్ద ఎత్తున పాల్గొనేలా చేస్తామ‌ని ఇప్పుడు చెప్ప‌డం ఏంటి? ఆ ప‌ని ముందే ఎందుకు చేయ‌లేదు?

అలాగే కాంట్రాక్ట‌ర్ల‌లో న‌మ్మ‌కం తీసుకొస్తామ‌ని స్వ‌యంగా సంబంధిత శాఖ ఉన్న‌తాధికారి చెబుతున్నారంటే ...ప్ర‌భుత్వంపై కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు కాన్ఫిడెన్స్ లేద‌నే క‌దా అర్థం. ఎందుకిలా జ‌రుగుతోంది. స‌హ‌జంగా వేల కోట్ల ప‌నుల‌కు టెండ‌ర్లంటే .... పెద్ద‌పెద్ద‌ కంపెనీల‌న్నీ క్యూ క‌ట్టాలి క‌దా! ఆ వాతావ‌ర‌ణం జ‌గ‌న్ పాల‌న‌లో కొర‌వ‌డిన‌ట్టు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌నే చెబుతోంది.

రోడ్ల ప‌నుల్లో పెద్ద కంపెనీలు పాల్గొనాలంటే ఎందుకు భ‌య‌ప‌డుతున్నాయ్‌? అస‌లేం జ‌రుగుతున్న‌దో ఆత్మ ప‌రిశీల‌న చేసుకునేందుకు రోడ్డు టెండ‌ర్లు పెద్ద గుణ‌పాఠంగా చెప్పొచ్చు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్త మాట‌లు క‌ట్టిపెట్టి, గ‌ట్టి మేలు త‌ల‌పెట్టే ప‌నులు చేప‌డితే మంచింది. 

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?