cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ కు 'తెలివి' వచ్చిందా?

జగన్ కు 'తెలివి' వచ్చిందా?

కర్రకు మట్టి అంటకుండా, మాట పడకుండా పనులు చేయడం అందరికీ సాధ్యం కాదు. తాము తీసుకున్న నిర్ణయం అత్యంత మేలైనది, అద్భుతమైనది, ప్రజారంజకమైనది అని నమ్మించాలంటే మీడియా మొత్తం మన చేతుల్లో వుండాలి. ఓ ప్లాన్ ప్రకారం ముందు నుంచి స్క్రీన్ ప్లే తయారుచేసి నడపాలి. ఇదంతా చాలా తెలివయినపని. 

అలా కాకుండా తను అనుకున్నది మంచిది, ఎవరేమనుకుంటే మనకేంటీ అని ముక్కుసూటిగా ముందుకు పోతే బొప్పికట్టేస్తుంది. పైగా నానా యాగీ చేయడానికి 'ఆ' మీడియా రెడీగా వుంటుంది. అడ్డం పడడనికి కొర్టుకు వెళ్లే జనాలు వుండనే వుంటారు. 

కేవలం ఓ వర్గానికి ప్రయోజనం చేకూర్చడం కోసం, చాలా తెలివిగా అమరావతి స్కీమును తెరపైకి తెచ్చారు చంద్రబాబు. రైతులు, భూములు, త్యాగం, భూ సేకరణ వంటివి పైకి కనిపించాయి. 'మన రాజధాని' అక్కడ 'మన' భూముల వ్యాపారం అన్నది కొందరికి కనిపించింది. ఎంతటి చిత్రం అంటే చరిత్రలో తొలిసారి ప్రభుత్వానికి ఎదురు వెళ్లి తమ భూములు అప్పనంగా అప్పగించారు. ఎన్నారైలు అయితే అక్కడి నుంచి వచ్చి, ఎక్కువ రేటు పెట్టి కొని మరీ ప్రభుత్వానికి ఇచ్చారు. 

ఎక్కడో ఏ 'లాభమో' లేకుంటే ప్రభుత్వ భూసేకరణకు ఇలా కొని మరీ భూములు ఇచ్చిన వైనం దేశంలో చూసారా? అదే సమయంలో విశాఖలాంటి అద్భుతమైన పట్టణం డిల్ల మొహం వేసుకుని వుండిపోయింది. ఒక్కరంటే ఒక్కరు మాకూ రాజధాని కావాలని అడగలేదు. 

ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. విశాఖకు అన్యాయం జరిగింది అని గుర్తించారు. కర్నూలు కు గతంలో ఇచ్చిన శ్రీబాగ్ ఒడంబడిక మేరకు న్యాయం చేయాలనుకున్నారు. ఇక్కడే తెలివిగా ఆలోచించలేదు. ముక్కుసూటిగా వెళ్లిపోయారు.

మూడు రాజధానులు అనకుండా, విశాఖలో సిఎమ్ క్యాంప్ ఆఫీసు కట్టి వుండొచ్చు. చంద్రబాబు ఏం వచ్చినా కృష్ణ, గుంటూరుకు తోసేసి నట్లు, జగన్ తనకు నచ్చినవన్నీ విశాఖకు తోసేసి వుండొచ్చు. అమరావతిని పక్కన పెట్టి కర్నూలును, విశాఖను ముందుకు నడిపించి వుండొచ్చు. 

కానీ ఇలాంటి దొడ్డి దారి వ్యవహారాన్ని జగన్ ఎంచుకోలేదు. మూడు రాజధానుల విధానం ఎంచుకున్నారు. దాంతో అమరావతి విస్ఫోటనం. నానా గొడవలు, ఆందోళనలు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం విశాఖలో ఏదీ కట్టలేనంత. ఏ పనీ చేపట్టలేనంత. ఏ పని చేపట్టినా  ఏదో తరహా వార్తలతో బురద, ఎవరో ఒకరు అడ్డం పడడం. అంటే విశాఖకు ఇంత అన్యాయం చేస్తున్నా ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి

విశాఖ జనాలు జెండా పట్టలేదు. మాకూ రాజధాని కావాలని అడగలేదు. ఉద్యమించలేదు. కానీ అమరావతి జనాలు మాత్రం రాజధాని మా వారసత్వ హక్కు అన్నట్లు ఉద్యమాలు, కవరేజ్ లు. కోట్ల ఖర్చుతో యాత్రలు. ఇలాంటి టైమ్ లో మూడు రాజధానుల కేసు కోర్టులో నడుస్తోంది. ఏం జరుగుతుందో? తీర్పు ఏవిధంగా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ చట్టం, న్యాయం చదువుకున్న న్యాయ నిపుణులకు కేసులో ఏ బలం ఎటువుంది అన్నది తెలుసుకదా? జగన్ కు సూచనలు అందించే వుంటారు.

ఇప్పుడు జగన్ తెలివి తెచ్చుకున్నారు తెలివైన ఎత్తుగడ వేసారు. మూడు రాజధానుల ప్రతిపాదన చట్టం ఉపసంహరించుకున్నారు. ఇక దీని పర్యవసానం కోర్టులో వున్న కేసు మీద, నడుస్తున్న యాత్ర మీద ఎలా వుంటుందో అన్నది తరువాత సంగతి. ముందుకు విశాఖ అభివృద్దికి అడ్డంకి తీరింది. ఇప్పుడు ప్రభుత్వం ఏ పని విశాఖలో చేపట్టినా 'అదిగో రాజధాని కోసమే', 'అదిగో కోర్టు ఉల్లంఘన' అని అనడానికి లేదు. హ్యాపీగా కట్టేసుకోవచ్చు. అదే  విధంగా అమరావతిలో ఇలా చేయి, అలా చేయి బలవంతం చేసేంత సీన్ కూడా లేదు. 

చేపను ఏదో చేయనక్కరలేదు. నీళ్లలోంచి తీసి పక్కన పడేస్తే చాలు. ఇప్పుడు ఆ తెలివే జగన్ తెచ్చుకున్నట్లు వుంది. సిఎమ్ ను అమరావతిలోనే కూర్చో, అమరావతి నుంచే పాలించు అని ఎవ్వరూ శాసించలేరు. ఆయన వెళ్లి విశాఖలో కూర్చుంటే ఏం చేస్తారు? వద్దంటారా? అక్కడ నుంచి పాలిస్తుంటే ఏం చేస్తారు. కాళ్లు పట్టుకు లాగుతారా? 

చంద్రబాబు సిఎమ్ గా వుండగా విశాఖలో ఓ అయిదు నక్షత్రాల హోటల్ ను విపరీతంగా పోషించారు. ప్రతి నెలా, పదిహేను రోజులకు ఆ హోటల్ లో ఓ సదస్సు ఏర్పాటుచేసేవారు, రూమ్ లు బుకింగ్ లు, ఫుడ్. బిల్లులే బిల్లులు. ఒక్క వార్త లేదు. కేసు లేదు. ఇప్పుడు జగన్ కూడా అలాంటి తెలివి తేటలు నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

ఓ న్యాయవాది ఇలా అన్నారు. 'ఇప్పుడు నడుస్తున్న మూడు రాజధానుల బిల్లు కోర్టులో సాంకేతిక కారణాల వల్ల వీగిపోవచ్చు. అప్పుడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం మినహా గత్యతరం లేదు. అక్కడ కూడా వీగిపోతే, ఇక మూడు రాజధానుల అంశం శాశ్వతంగా మూతపడుతుంది. ఇప్పుడు ఇలా వెనక్కు తీసుకోవడం వల్ల ఆ అంశం ఎప్పటికీ సజీవంగా వుంటుంది. పరిస్థితులు అన్నీ చూసుకుని మళ్లీ పటిష్టంగా ముందుకు వెళ్లొచ్చు...ఇది తెలివైన మూవ్'' అన్నారు. 

ఓ పొలిటీషియన్ ఇలా అన్నారు. జగన్ మూడు రాజధానుల అంశాన్ని వెనక్కు తీసుకుని దాన్ని సజీవంగా వుంచారు. రేపు 2024లో జనం ముందుకు వెళ్లినపుడు ఆయన అదే చెబుతారు. నేను విశాఖను, కర్నూలును అభివృద్ది చేద్దాం అనుకున్నా, మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చా, తెలుగుదశం అడ్డం పడింది అని చెబుతారు దీన్ని తెలుగుదేశం కౌంటర్ చేయలేదు.

ఉత్తరాంధ్ర, కర్నూలు వాసులు అమరావతి వాసుల్లా కోట్ల ఖర్చుతో ఉద్యమాలు చేయలేకపోవచ్చు. కానీ అసంతృప్తిని సైలంట్ గా ఓటుతో వెలిబుచ్చవచ్చు. ఆ విధంగా చంద్రబాబును, ఆయన పార్టీని జగన్ కార్నర్ లోకి తోసారు. మొత్తానికి ముక్కుసూటి తనం మాత్రమే రాజకీయాల్లో చెల్లదు, తెలివి కూడా కావాలని జగన్ గ్రహించినట్లే వుంది.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి