cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్...వినరెవ్వరు చెప్పిన...!

జగన్...వినరెవ్వరు చెప్పిన...!

ఇంటికి ఓ పెద్ద దిక్కు వుండాలి. ఎందుకు..? చిన్నవాళ్లు తప్పు చేస్తే సరిదిద్దడానికి...అలా కాదు, ఇలా అని చెప్పడానికి. రాజకీయ పార్టీలకు కూడా ఇలాంటి అవసరం ఎంతయినా వుంది. పోలిట్ బ్యూరో అనేది నిజానికి అందుకోసమే. కీలకమైన వారిని అందులో సభ్యులుగా తీసుకుని, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు కనీసపు చర్చ అయినా జరిగేలా చూడడానికి. అయితే ఇప్పటి రాజకీయ పార్టీలు అన్నీ ఇలాంటి బ్యూరోల్లోకి తమకు భజన చేసేవారిని, తమ మాటలకు 'వహ్వా' అంటూ జేజేలు పలికేవారిని మాత్రమే తీసుకుంటున్నాయి.

ప్రాంతీయ పార్టీలతో సమస్య ఏమిటంటే, అవి ఎవరో ఒక వ్యక్తి శక్తి మీద, ఇమేజ్ మీద ఆధారపడి వుంటాయి. అందువల్ల పార్టీలో వున్నవారు ఎవ్వరూ కూడా ఆ వ్యక్తి చర్యలకు అడ్డం పడరు. ఆ అవకాశం వుండదు కూడా. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ ఒక్క కలంపోటుతో మంత్రి వర్గాన్ని రద్దు చేసినా, ఒక్క సంతకంతో అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోగలిగినా కారణం ఇదే. స్వంత అల్లుడు కాబట్టి, అది కూడా లక్ష్మీపార్వతి అంటే కిట్టని పెద్దలు, మీడియా మొగళ్లు, వివిధ వ్యవస్థల్లో ముందుజాగ్రత్తగా వుంచినే అనేక మంది స్లీపర్ సెల్స్ లాంటి మద్దతు దారులు భుజం కాసారు కాబట్టి చంద్రబాబు ఆయనను గద్దె దింపగలిగారు.

కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా వైఎస్ దాన్ని తన హయాంలో ఓ ప్రాంతీయ పార్టీ అన్నట్లే నడిపారు. జాతీయ నాయకత్వాన్ని గౌరవిస్తూనే, వారి అవసరాలు చూసుకుంటూనే, రాష్ట్రంలో పార్టీని తన కనుసన్నలలో నడిపారు. అయితే రాజశేఖర రెడ్డి వెనుక కేవిపి వున్నారు. ఇంకా కొంతమంది నమ్మకస్తులు వున్నారు. వారి మాట వినేవారో లేదో కానీ కనీసం తెలుసుకునేవారు. ఆ విధంగా పెద్దగా ఏకఛత్రాధిడపత్యం అనిపించుకోకుండానే సాగారు.

చంద్రబాబు వ్యవహారం వేరు. పార్టీని ఆయన తన చేతుల్లోకి తీసుకన్నా, అలా తీసుకోవడానికి తనకు సహరించిన సహచరులు, సీనియర్లను కాస్తయినా సలహా సంప్రదింపులకు తీసుకునేవారు. ఆయన తీసుకున్నా తీసుకోలేకపోయినా, అలాచెప్పే ధైర్యం, చనువు, అవకాశం పలువురు సీనియర్లకు వుండేది. పైగా పైకి కనిపించకుండానే సలహాలు, సంప్రదింపులకు రాజగురువులు వుండేవారని వార్తలు వినిపించేవి.

కానీ వైఎస్ జగన్ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా కొత్తగా మారిపోయింది. కేవలం ఆయన తన స్వంత చరిష్మాతో వైకాపాను విజయతీరానికి చేర్చి, అధికారం అందుకున్నారు. అధికారంలోకి రాకముందు పార్టీ నేతగావున్నపుడు కూడా అన్నీ ఆయన ఆలోచనలే. ఆయన నిర్ణయాలే. ఆయన ఆలోచనలతే తప్ప వేరు వ్యవహారం వుండేది కాదు. మొండి మనిషి అనే పదానికి ఉదాహరణగా జగన్ నిలుస్తారు. అందులో సందేహం లేదు. ఆ మొండితనంతోనే సోనియా లాంటి లీడర్ ను ఢీకొన్నారు. నానా బాధలు పడ్డారు. ఇప్పటికీ పడుతున్నారు.

ఇలా స్వంత శక్తితో అధికారంలోకి వచ్చిన జగన్ కు ఇప్పుడు సలహా ఇచ్చేవారు కానీ, ఓ మాట చెప్పేవారు కానీ ఎవ్వరూ లేరు. తీసుకున్న నిర్ణయం మంచిది అయినా, చెడ్డది అయినా సై అనాల్సిందే.ఊ కొట్టాల్సిందే.ఈ మొండితనం అన్నది జగన్ కు కొంత వరకు మంచి చేస్తున్నా, కొంత వరకు కీడు కూడా చేస్తోంది. ముఖ్యంగా రాజకీయ పక్షాలు జగన్ వైఖరి, సైకాలజీని అర్థం చేసుకుని కార్నర్ చేయడానికి వీలవుతోంది. మనం అవును అంటే జగన్ కాదు అంటారు అనే లాజిక్ ను ఆసరాగా తీసుకుని ప్రతిపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. జగన్ వాటిలో చిక్కుకుంటున్నారు.

ఉదాహరణకు పదవ తరగతి, ఇంటర్ పరిక్షల సంగతే చూద్దాం. అలా వదిలేసి వుంటే జగన్ వాయిదా వేసేవారేమో? వాయిదా వేయాల్సిందే..అంటూ ప్రతి పక్షాలు అన్నీ నానా యాగీ చేస్తున్నాయి. వాట్సాప్ గ్రూప్ లు పెట్టి అభిప్రాయ సేకరణ పేరిట యాంటీ జగన్ కాంపైయన్ రన్ చేస్తున్నాయి. దీంతో ఏమయింది జగన్ బిగుసుకుపోయారు. ప్రతిపక్షాలకు తలవొగ్గడమా? అని మొండికేస్తున్నారు. కానీ పిల్లల తల్లితండ్రులు కూడా పరిక్షలు వద్దు అంటున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకున్నట్లు, పిల్లల తల్లి తండ్రులకే వాళ్ల భవిష్యత్ మీద ఆందోళన లేనపుడు జగన్ కు ఎందుకు? ఇదే విషయం ఓపెన్ గా చెప్పి, పరిక్షలు వాయిదా వేసి వదిలేయవచ్చు కదా?

సినిమా టికెట్ ల వ్యవహారమే చూడండి. అడ్డగోలుగా దోచుకోవడం మరిగారు. సినిమా సినిమాకు కోర్టును అడ్డం పెట్టుకుని ప్రేక్షకులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి అడ్డు కట్ట వేయడం వరకు ఒకె. కానీ తీసుకున్న నిర్ణయంలో హేతుబద్దత వుండాలి కదా. సి సెంటర్లలో 20 రూపాయలకు ఏసితో సినిమా చూపించడం సాధ్యమేనా? జగన్ కుటుంబానికి కూడా థియేటర్లు వున్నాయి. ఆ మాత్రం ఆలోచించలేరా? ఇప్పుడు నిర్ణయం తీసేసుకున్నారు. ఎవ్వరు విమర్శించినా, డిమాండ్ చేసినా వినరు.

ఇసుక పాలసీనే తీసుకోండి. ఇప్పటికి ఒకటికి రెండు మూడు సార్లు మార్చారు. దీనివల్ల గ్రౌండ్ లెవెల్ లో ఎన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఎవరికీ పట్టదు. నది ఊళ్లోనే వున్నా ఇసుక దొరకని పరిస్థితి. మధ్యలో దళారుల దోపిడీ భయంకరంగా వుంది. ఎక్కడో ఇసుక స్టాక్ పెడతాం. అక్కడ నుంచి తీసుకోండి అంటూ పనికిరాని అనేకానేక విధానాలు.

మద్యం దుకాణాలు జాతీయం చేసారు. ఓకె బాగానే వుంది. రేట్లు పెంచారు. తగ్గించారు. ఏవేవో బ్రాండ్ లు తెచ్చారు. దీనివల్ల సాధించేది ఏమిటి? ప్రతిపక్షాలు విమర్శించినట్లు పార్టీకి నిధులా? లేక జనాలకను మద్యపానానికి దూరం చేయడమా? కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఎలా వుంది? ప్రభుత్వ మధ్య దుకాణలు కూడా ప్రయివేటు మద్యం దుకాణాల మాదిరిగానే తయారయ్యాయి. వాటికి పక్కనే బడ్డీ కొట్లు, పాకలు, రిటైల్ గా అక్కడిక్కడే వెలిసాయి. ప్రభుత్వ బ్రాందీ దుకాణాలు వున్న ప్రాంతాలు జాతరను తలపిస్తున్నాయి.

సంగం డెయిరీ వ్యవహారమే తీసుకోండి. అవకతవకలు జరిగాయి. చర్యలు తీసుకుంటున్నారు. ఓకె. కానీ అంతకన్నా దారుణమైన అవకతవకలు వున్నాయని, కోపరేటివ్ డైరీని కంపెనీగా మార్చేసి తన చేతుల్లోకి తీసుకున్నారు విశాఖ డైరీని. ఏళ్ల తరబడి కుటుంబ పాలన సాగిస్తూ, నానా అరోపణలకు గురవుతోంది అక్కడి పాలక వర్గం. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తేదేపాలోంచి వైకాపాలోకి వచ్చేసారు. మరి చర్యలు తీసుకోరా? ఇదే ప్రశ్న ఇప్పుడు మీడియాలో వినిపిస్తోంది. జనంలోకి వెళ్తోంది.

ఇలా ఇంకా చాలా విషయాలు వున్నాయి. కానీ జగన్  కు చెప్పేవారు ఎవ్వరు? పార్టీ బాధ్యులు సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రామకృష్ణా రెడ్డి కి జగన్ దగ్గర ఏ మేరకు చనువు వుంది అన్నది పార్టీ కీలక జనాలకు తెలుసు. వారు కూడా జగన్ దగ్గర కొంత వరకే వెళ్లగలరు. మంత్రుల సంగతి చెప్పనక్కరలేదు. విశాఖ ఎన్నికకు నిధుల కోసం విజయసాయి ప్రయత్నించి, జగన్ తో నిలదీయించుకుని, ఆఖరికి స్వంత డబ్బులు 15 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఎవరికి చెప్పుకోగలరు ఆయన. సినిమా జనం టికెట్ ల గురించి సజ్జలను అడిగితే తన వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు. కీలకమైన మంత్రి బుగ్గనను అడిగితే అదే సమాధానం.

చేస్తున్నది తప్పా? ఒప్పా? అన్నది పక్కన పెడితే ఇలా కాదు అలా చేద్దాం, దీన్ని కొంచెం సరిచేద్దాం అనే మాట ఎవరు చెబుతారు. అలా చెప్పేవారు ఒక్కరు కూడా లేరు. చెప్పినా జగన్ వింటారా? సమస్యే లేదు. వినరు కాక వినరు. తాపట్టిన కుందేటికి మూడే కాళ్లు అని మొండికేయడమే కాదు, అవసరం అయితే ఓ కాలు విరిచేసి మరీ ప్రూవ్ చేసేంత మొండితనం వున్న వ్యక్తి.

ఇలాంటి నాయకులు వల్ల ఒక ప్లస్ ఒక మైనస్. ఎలాంటి మంచి నిర్థయాన్నైనా, ఎందరు అడ్డం పడినా అమలు చేయలగరు. కానీ ఎలాంటి చెడు నిర్ణయం అయినా ఎందరు అడ్డం పడినా అలాగే అమలు చేసేస్తారు. ఇలాంటి వారికి సరైన సలహా ఇచ్చేవారు వుండాలి. తీసుకునే మెంటాలిటీ జగన్ కు వుండాలి. కానీ ఈ రెండూ వున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం అ దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు.

ఇలాంటి వ్యవహారాలు ఎలా వుంటాయి అంటే సాగినంత కాలం ఫరవాలేదు. తేడా వస్తే మాత్రం కాస్త కష్టమే. కానీ ఈ తరహా సైకాలజీ వున్నవాళ్లు ఆ కష్టానికి కూడా తాము రెడీ అంటారు తప్ప, వేరే మాట వినరు.

-చాణక్య

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి