cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ఏ కాలంలో ఉన్నాడు? 

జగన్ ఏ కాలంలో ఉన్నాడు? 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపరిచితుడు టైపు. ఎవ్వరికీ అర్ధం కాడు. ఆయన ఆలోచనలేమిటో ఎవ్వరికీ అంతుబట్టవు. జగన్ ఏ కాలంలో ఉన్నాడు ? అనే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ప్రజలను బతిమాలుకున్నప్పుడు ఏపీ ప్రజలు ఏం ఆలోచించి అధికారం అప్పగించారో తెలియదు. 

రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు సీఎం కాగానే జగన్ కు అధికారం అప్పగించకుండా బాబుకు ఎందుకు అప్పగించారనే ప్రశ్నకు అప్పట్లో రాజకీయ విశ్లేషకులు, ప్రజలు చెప్పిన సమాధానం ఒక్కటే ...చంద్రబాబుకు అనుభవం ఉందని. సరే ...చంద్రబాబు పరిపాలన ఎలా జరిగిందో పక్కన పెడదాం. 2019 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఓల్డ్ అయిపోయాడు కాబట్టి యువకుడైన జగన్ కు జగన్ కు అధికారం ఇచ్చి చూదాం అనుకున్నారు ఏపీ ప్రజలు. 

జగన్ కు చాలా ఆధునికమైన ఆలోచనలు ఉంటాయని, యువకుడు కాబట్టి రాష్ట్రానికి రావలసిన దాని కోసం కేంద్రంతో పోరాడగలుగుతాడని అనుకున్నారు. కానీ వారు అనుకున్నది ఒకటి. జరిగింది మరొకటి. జగన్ యువకుడనేది వాస్తవమే. కానీ ఆధునికమైన ఆలోచనలు లేవనేది కూడా వాస్తవమే. చంద్రబాబు ముసలోడు అయిపోయాడని, ఆయనకు ఆధునికమైన ఆలోచనలు లేవని ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఊదరగొట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

జగన్ మీడియా ప్రజలను బాగా ప్రభావితం చేసింది. సరే ... కారణాలు ఏవైనా జగన్ అధికారంలోకి వచ్చాడు. ఈ రెండున్నరేళ్ల పరిపాలనలో ఆయన ఆధునిక ఆలోచనలు ఏమిటో ఎక్కడా కనబడలేదు. ఏపీ భవిష్యత్తు గురించిన ఆలోచనలే ఆయనకు లేవు. ఏపీ ప్రజలను, రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కావడంలేదు. చంద్రబాబు పరిపాలన సరిగా లేదనే కదా జగన్ కు అధికారం కట్టబెట్టింది.

కానీ బాబు పరిపాలన కంటే ఈ పరిపాలన బెటర్ గా ఉందా ? డబ్బులు పంచితే జనం సుఖంగా ఉంటారు. తన పేరు పది కాలాలపాటు చెప్పుకుంటారు అనే ఆలోచన తప్ప మరో ఆలోచన జగన్ కు లేదు. సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. కానీ దానికి ఒక లిమిట్ ఉండదా ? ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు నిస్సహాయుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కానీ జగన్ కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. 

రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు ఉపాధి దొరకాలన్నా పరిశ్రమ స్థాపన ప్రధానం. ఏ ప్రభుత్వమైనా ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉపాధి కల్పనకు ప్రైవేటు రంగమే రహదారి. ప్రైవేటు రంగమంటే ప్రధానంగా పరిశ్రమలే. కానీ పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనే జగన్ కు లేదని చెప్పొచ్చు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసుండొచ్చు. కాదనం. కానీ ఆయన చేసిన మంచి పని హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడానికి పునాదులు వేయడం. ఆనాడు చంద్రబాబు ముందు చూపుతో చేసిన ఈ పని ఇప్పుడు ఏపీ యువతకు కూడా హైదరాబాదులో ఉపాధి కల్పిస్తోంది.

హైదరాబాదులో ఐటీ రంగం డెవెలప్ కావడానికి చంద్రబాబే కారకుడని తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పాడు. జగన్ ఏపీలో ఏ రంగాన్ని డెవలప్ చేశాడని ప్రశ్నించుకుంటే ఏం చెబుతాం. జగన్ విధానాల కారణంగా ఏపీకి పరిశ్రమలు, కంపెనీలు రావడానికి సాహసించడంలేదు. ఇప్పుడు అమరారాజా బ్యాటరీస్ వివాదంతో పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. ఆ పరిశ్రమ తరలిపోవాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందేకదా. 

‘ఆ పరిశ్రమ గురించి నాకు పెద్దగా తెలియదు. పత్రికల్లో వచ్చింది చదివి తెలుసుకున్నా.. ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పింది. ఆ పరిశ్రమ నిర్వాహకులు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు.. ఈ విషయమై ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు..’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమర్ రాజా వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. 

పెద్దిరెడ్డి అంటే, వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్. రాష్ట్ర రాజకీయాల్ని ఔపోసన పట్టిన వ్యక్తి. చిత్తూరు జిల్లా మీద పూర్తి పట్టున్న నాయకుడు. అలాంటి వ్యక్తికి చిత్తూరు జిల్లాలోనే వున్న అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ గురించి పూర్తిగా తెలియదని ఎలా అనుకోగలం.? దాదాపు మూడు దశాబ్దాలుగా ఎలాంటి వివాదాల్లేని అమర్ రాజా సంస్థ, రాత్రికి రాత్రి వివాదాల్లో ఇరుక్కుని, పరిశ్రమను ఎత్తివేసే పరిస్థితి రావడమంటే, ఇందులో రాజకీయ కోణమే సుస్పష్టం.

ప్రభుత్వాన్ని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారోగానీ, రాజకీయంగా వైసీపీకి ఇది చాలా పెద్ద డ్యామేజ్.. అన్న చర్చ తెలంగాణలోనూ జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ‘మేమే వెళ్ళిపొమ్మన్నాం..’ అని  ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు.. కాలుష్యాన్ని సాకుగా చూపారు. ఇంతలోనే మాట మారింది. ‘మేం వెళ్ళిపొమ్మన్లేదు.. కాలుష్యంపై తగు చర్యలు చేపట్టి, ఫ్యాక్టరీని అక్కడే కొనసాగించొచ్చు..’ అంటూ కొత్త మాట చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ, అమర్ రాజా సంస్థ, వెనక్కి తగ్గే అవకాశాలు కన్పించడంలేదు. 

తమిళనాడు నుంచీ, కర్నాటక అలాగే తెలంగాణ నుంచి ఆహ్వానాలు అద్భుతంగా వుండడంతో, చిత్తూరు నుంచి పరిశ్రమ తరలిపోవడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. పరిశ్రమ తరలి వెళితే, వేలాది మంది స్థానికులు నిరుద్యోగులుగా మారతారు. వారి పరిస్థితేంటి.? ఈ డ్యామేజీని కంట్రోల్ చేయడం జగన్ కు సాధ్యమా ? ‘మేమే వెళ్ళిపోమన్నాం..’ అంటూ అమర్ రాజా బ్యాటరీస్ వ్యవహారంపై ప్రభుత్వం తరఫున ప్రకటనలు వస్తూనే, ఇంకోపక్క, ‘లాభాలు ఎక్కడొస్తే అక్కడికి పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారు.. మేమేం వెళ్ళిపోమనలేదు..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారంటే.. అసలేం జరుగుతోందని అనుకోవాలి.? 

చిత్తూరు జిల్లాలో వున్న అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో కాలుష్యం చాలా ఎక్కువగా వుంటోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే, ఆ పరిశ్రమల మూసివేత దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలుమార్లు అవకాశమిచ్చినా లోపాల్ని సంస్థ సరిదిద్దుకోలేదన్నది ప్రభుత్వం వాదన. హైకోర్టు కూడా, అమర్ రాజా సంస్థలో కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరోపక్క, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ వేధింపుల వల్లే అమర్ రాజా పరిశ్రమ వెళ్ళిపోతోందంటూ మీడియాలో వచ్చిన కథనాలపైనా ప్రభుత్వ పెద్దలు గుస్సా అవుతుండడం గమనార్హం. కాలుష్యం లేని పరిశ్రమల్ని ఊహించగలమా.? అందునా, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. కాలుష్యం పేరుతో పరిశ్రమలు చాలా చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. 

ఎల్జీ పాలిమర్స్ సంస్థ విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించిందన్న విమర్శ వుంది. కానీ, అమర్ రాజా వ్యవహారంలో ఎందుకీ అత్యుత్సాహం.? అంటే, అది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కి చెందిన పరిశ్రమ కాబట్టి.. అన్న సమాధానం సహజంగానే తెరపైకొస్తోంది. ప్రభుత్వంలో వున్నవారి నుంచి భిన్నమైన వాదనలు తెరపైకొచ్చినప్పుడు.. సహజంగానే కొత్త అనుమానాలు కలుగుతాయి. పొరుగు రాష్ట్రాలు సదరు పరిశ్రమను ఆహ్వానిస్తున్నాయంటే, దాన్నుంచి కాలుష్యం నిజంగానే వస్తోందని ఎలా అనుకోగలం.?

అమర్ రాజా బ్యాటరీస్.. అంటే, ప్రపంచ స్థాయి సంస్థ అది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిస్తున్న ప్రముఖ సంస్థ అమర్ రాజా. చిత్తూరు జిల్లాలో రాజకీయాలకతీతంగా స్థానిక ప్రజలు, అమర్ రాజా సంస్థను తమదిగా భావిస్తారు. ఆ సంస్థ ఇప్పుడు తమ కార్యకలాపాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించాలనుకుంటోందంటూ ప్రచారం జరుగుతోంది.  

ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా అమర్ రాజా సంస్థను వివాదాల్లోకి లాగింది లేదు ఇప్పటివరకూ. కానీ, ఈ మధ్యకాలంలో పరిస్థితి మారింది. దాదాపుగా ప్రతి వారం, ప్రతి నెలా అమర్ రాజా సంస్థకు సంబంధించిన ఏదో ఒక వివాదాన్ని వైసీపీ అనుకూల మీడియా తెరపైకి తెస్తోంది. అందుకు అనుగుణంగా, వివిధ ప్రభుత్వ శాఖలు ఆ సంస్థపై స్పెషల్ ఫోకస్ పెట్టి, ఆ సంస్థకు కేటాయించిన భూముల్ని తిరిగి తీసుకోవడమో, సంస్థలో పొల్యూషన్ సహా వివిధ అంశాలకు సంబంధించి తనిఖీలు చేస్తూ రగడకు కారణమవడమో చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. 

ఈ రాజకీయ వేధింపుల నేపథ్యంలో అమర్ రాజా సంస్థ, చిత్తూరు నుంచి తమ కార్యకలాపాల్ని వేరే రాష్ట్రానికి తరలించాలనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. తమిళనాడుతోపాటు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు అమర్ రాజా సంస్థకు రెడ్ కార్పెట్ పరుస్తుండడం గమనార్హం. ఒకవేళ అమర్ రాజా గనుక, చిత్తూరు నుంచి తరలిపోతే, వైఎస్ జగన్ హయాంలో ఇదో అతి పెద్ద ఫెయిల్యూర్ అవుతుందన్నది నిర్వివాదాంశం. ఏపీలో పరిశ్రమలు పెట్టడాన్ని ఇంకెవరు ఆసక్తి చూపిస్తారు? తెలంగాణా  ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తుండగా జగన్ అందుకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. 

-నాగ్ మేడేపల్లి

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి