cloudfront

Advertisement


Home > Politics - Political News

ఇంత లావు పుస్తకం నేను ఇవ్వను

ఇంత లావు పుస్తకం నేను ఇవ్వను

మనుషుల్ని విడదీసే రాజకీయం అస్సలు చేయనంటున్నారు వైఎస్ఆర్సీ అధినేత జగన్. అంతా సామరస్యంగా ఉండాలని, కలిసి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబులా ప్రతి కులంలో చిచ్చుపెట్టే రాజకీయాలు, కులానికో పేజీని కేటాయించే మేనిఫెస్టోలు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండవని స్పష్టంచేశారు.

"చంద్రబాబు మేనిఫెస్టోలా ఇంత లావు పుస్తకం నేను ఇవ్వను. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ పెట్టను. మనం ఇచ్చే మేనిఫెస్టో కేవలం రెండు వైపులు (ఒక కాగితానికి) మాత్రమే కనిపిస్తుంది. అవే నవరత్నాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.కామ్ అనికొడితే మన పార్టీ వెబ్ సైట్ కనిపిస్తుంది. అందులో మన మేనిఫెస్టో ఉంటుంది. సింపుల్ గా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. అదే మన మేనిఫెస్టో."

ఇలా తన ఆలోచనా విధానాన్ని, పాలసీని బయటపెట్టారు జగన్. ఎన్ని హామీలు ఇచ్చామనేది ముఖ్యం కాదంటున్న జగన్, ఇచ్చిన హామీలు నెరవేర్చామా లేదా అనేది కీలకం అంటున్నారు. హామీలు నెరవేర్చనప్పుడు పదవిలో కొనసాగే అర్హత ఎంతమాత్రం ఉండదంటున్నారు.

"చెప్పిన ప్రతి పని కచ్చితంగా చేస్తాను. చంద్రబాబులా మనుషుల్ని విడదీయడం, సమూహాల్ని వేరుచేయడం నాకు తెలీదు. నాకు అంతా ఒకటే. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పదవులు నాకొద్దు."

వినాయక చవితి సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించిన జగన్, ప్రస్తుతం పార్టీ కీలకనేతలు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నియోజకవర్గాల వారీగా పార్టీ టిక్కెట్లపై కసరత్తును ఓ కొలిక్కి తీసుకొచ్చారు.

ఓవైపు అభ్యర్థుల జాబితాకు తుదిమెరుగులు దిద్దుతూనే మరోవైపు ప్రజాసంకల్ప యాత్రను సాగిస్తున్నారు. రేపట్నుంచి జగన్ పాదయాత్ర విశాఖజిల్లా చిన్నగదిలి నుంచి పునఃప్రారంభమౌతుంది.